విధాత : బీఆర్ఎస్ మాజీ మంత్రి టి.హరీశ్ రావును వరంగల్ పోలీసులు అరెస్టు చేసి, సుబేదారి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వరంగల్ జిల్లాలో పాలిటెక్నిక్ విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న ఆయనను తొలుత హైదరాబాద్ కోకాపేటలోని ఆయన నివాసం వద్ద అడ్డుకున్నారు. తర్వాతా వరంగల్ వెళ్లాక అరెస్టు చేశారు. హరీశ్‌రావును అరెస్టు చేయడంతో హనుమకొండ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది.
టీఎన్జీవోలు నిర్వహిస్తున్న ధర్నాలో పాల్గొన్న హరీశ్‌రావును అదుపులోకి తీసుకున్నారు. దీనిపై బీఆర్‌ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేయగా.. ఈక్రమంలో పోలీసులు, బీఆర్‌ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం, తోపులాట నెలకొంది. ఈ సందర్భంగా మాజీ మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీ మాలోత్ కవితలను అరెస్టు చేశారు. వారంతా సీఎం డౌన్.. డౌన్..’ అంటూ సుబేదారి పోలీస్ స్టేషన్ దద్దరిల్లేలా నినదించారు.
అంతకుముందు టీఎన్జీవోల ధర్నాలో హరీశ్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపై చెప్పేదానికి, చేసేదానికి పొంతన ఉండటం లేదని విమర్శించారు. పాత ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ ఆగిపోయింది.. కొత్త స్కీమ్ అమలు కావట్లేదు అని, ఉద్యోగుల జీతాల్లో నుండి మాత్రం 1.5% కట్ చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఉద్యోగ సంఘాల నాయకులను బెదిరిస్తున్నాడని, 3 సంవత్సరాల పాలనలో ఏ ఒక్క హామీ కూడా రేవంత్ రెడ్డి అమలు చేయలేదు అన్నారు. రేవంత్ రెడ్డికి రోజులు దగ్గర పడుతున్నాయి అని, ఉద్యోగ సంఘాల నాయకులతో పెట్టుకున్నోడు ఎవరూ ఇంతవరకు పోగుపొయ్యలేదు..నువ్వెంత రేవంత్ రెడ్డి అని దుయ్యబట్టారు.
నేను ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు.. ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు ఎప్పుడుపడితే అప్పుడు నేరుగా వచ్చి కలిసేవాళ్లు అని, కానీ.. ఇవాళ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలవాలంటే, సెల్‌ఫోన్లు బయటే పెట్టి వెళ్లాలని, అపాయింట్‌మెంట్ ఉంటేనే.. పోలీసులు తనిఖీలు చేసి, లోపలికి అనుమతి ఇస్తున్నారు అని, ప్రజా పాలన అంటే ఇదేనా..? అని హరీశ్ రావు ప్రశ్నించారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
అలాగే పాలిటెక్నిక్ విద్యార్ధుల ఆందోళనను అర్ధం చేసుకుని వెంటనే జీవో 97 రద్దు చేసి యథావిధిగా ప్రభుత్వంలోనే నడపాలని డిమాండ్ చేశారు. ఇవాళ కేవలం వరంగల్ పాలిటెక్నిక్‌లోనే 10 మంది విద్యార్థులు టీసీ తీసుకున్నారని, ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కళ్లు తెరువాలని కోరారు.
