Harish Rao | కేసీఆర్​ హుందాగా మాట్లాడితే, సీఎం నీచంగా మాట్లాడాడు : హరీశ్​

కేసీఆర్‌ రాష్ట్ర ప్రయోజనాలపై హుందాగా మాట్లాడితే సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు నీచ స్థాయిలో ఉన్నాయని హరీశ్‌రావు విమర్శించారు. చెక్‌డ్యామ్‌లు, ప్రాజెక్టుల కూల్చివేత, నీటి హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాన్ని ఆయన ఎండగట్టారు.

Harish Rao | కేసీఆర్​ హుందాగా మాట్లాడితే, సీఎం నీచంగా మాట్లాడాడు : హరీశ్​

KCR spoke for Telangana’s interests, CM’s response inappropriate: Harish Rao

(విధాత పొలిటికల్​ బ్యూరో)

హైదరాబాద్: బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ రాష్ట్ర ప్రయోజనాలు, తెలంగాణ భవిష్యత్తు గురించి హుందాగా మాట్లాడితే, సీఎం రేవంత్రెడ్డి స్పందన మాత్రం నీచ స్థాయిలో ఉందని బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి హరీశ్రావు తీవ్రంగా విమర్శించారు. సోమవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో హరీశ్‌రావు సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఘాటుగా స్పందించారు.

కేసీఆర్‌ రాష్ట్రం కోసం మాట్లాడారు

కేసీఆర్‌ ప్రెస్‌మీట్‌లో తెలంగాణ హక్కులు, హైదరాబాద్‌ శ్రేయస్సు, రాష్ట్రానికి నష్టం కలగకుండా చూడాల్సిన బాధ్యతపై ఒక స్టేట్స్‌మన్‌లా మాట్లాడారని హరీశ్‌రావు అన్నారు. ‘‘తెలంగాణకు ఒక నొక్కు పడనీయను’’ అనే కేసీఆర్‌ మాటలతో సీఎం, మంత్రులకు ఎందుకు నొప్పి వచ్చిందో అర్థం కావడం లేదన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై ఇప్పటికీ ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోతున్నదని విమర్శించారు. ముఖ్యంగా ఆసరా పింఛన్లను రూ.4 వేల వరకు పెంచుతామని చెప్పి అమలు చేయకపోవడంపై సీఎం మౌనం ఎందుకని ప్రశ్నించారు.

బీఆర్‌ఎస్‌ హయాంలో తెలంగాణ అద్భుత ఆర్థిక ప్రగతి సాధించిందని హరీశ్‌రావు గుర్తు చేశారు. కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తక్కువ కాలంలోనే జీఎస్‌డీపీ, తలసరి ఆదాయంలో తెలంగాణ దేశానికే తలమానికంగా నిలిచిందన్నారు. ఇటీవల జరిగిన గ్లోబల్‌ సమ్మిట్‌లో పాల్గొన్న జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు కూడా కేసీఆర్‌ పాలనలోని ఆర్థిక వృద్ధిని ప్రశంసించారని చెప్పారు.

ప్రాజెక్టుల కూల్చివేతే మీ పాలనకు గుర్తింపు

బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత హరీశ్‌రావు తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ నేతలతో కలిసి మాట్లాడుతున్న దృశ్యం

సీఎం రేవంత్‌రెడ్డి రెండేళ్ల పాలనలో చేసిన పని ఏమిటంటే.. చెక్‌డ్యామ్‌ల పేల్చివేత, ప్రాజెక్టుల కూల్చివేత మాత్రమేనని హరీశ్‌రావు ఆరోపించారు. అసెంబ్లీ సాక్షిగా 11 లక్షల 60 వేల ఎకరాలకు నీళ్లు ఇస్తామని చెప్పారని, కనీసం 11 వేల ఎకరాలకు అయినా నీళ్లు ఇచ్చారా..? అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో 17 లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టు ఇచ్చామని, 31 లక్షల ఎకరాలను స్థిరీకరించామని తెలిపారు. రేవంత్‌రెడ్డి 11 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చిన ఆధారాలు చూపించాలని, లేదంటే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

కేసీఆర్‌ ప్రభుత్వం నిర్మించిన చెక్‌డ్యామ్‌లను పేల్చివేయడం, వట్టెం పంప్‌హౌస్‌ను ముంచివేయడం, ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు కూలిపోవడం కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలకు నిదర్శనమని హరీశ్‌రావు అన్నారు. ఎస్‌ఎల్‌బీసీ ఘటనలో శవాలను కూడా బయటికి తీయలేని దద్దమ్మ ప్రభుత్వం ఇదని తీవ్రంగా విమర్శించారు. ఇలాంటి ఘటనలపై ఒక్క ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదు చేయలేదని, ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా నిర్మించలేని ప్రభుత్వం నీళ్ల గురించి మాట్లాడడం విడ్డూరమని మండిపడ్డారు.