Harish rao | హరీశ్‌రావు క్యాంపు ఆఫీస్ పైన దాడిని ఖండించిన హరీశ్‌రావు, కేటీఆర్
సిద్ధిపేటలో శుక్రవారం అర్థరాత్రి కాంగ్రెస్, బీఆరెస్ శ్రేణుల మధ్య ఉద్రిక్తత చోటుచేసుకుంది. సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చెప్పినట్లుగా ఆగస్టు 15నాటికి 2లక్షల రుణమాఫీ చేసినందునా మాజీ మంత్రి హరీశ్‌రావు రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ నేతలు పలుచోట్ల ఫ్లెక్సీలు పెట్టారు.

విధాత, హైదరాబాద్ : సిద్ధిపేటలో శుక్రవారం అర్థరాత్రి కాంగ్రెస్, బీఆరెస్ శ్రేణుల మధ్య ఉద్రిక్తత చోటుచేసుకుంది. సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చెప్పినట్లుగా ఆగస్టు 15నాటికి 2లక్షల రుణమాఫీ చేసినందునా మాజీ మంత్రి హరీశ్‌రావు రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ నేతలు పలుచోట్ల ఫ్లెక్సీలు పెట్టారు. వాటిని బీఆరెస్ కార్యకర్తలు తొలగిస్తుండగా, విషయం తెలుసుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు వారితో గొడవకు దిగారు. ఇరువర్గాలు పోటాపోటీ నినాదాలతో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టి పోలీసు స్టేషన్ కు తరలించారు. ఇంతలో మరికొందరు కాంగ్రెస్ కార్యకర్తలు హరీష్ రావు క్యాంపు కార్యాలయంపై దాడి చేసి పలు వస్తువులను ధ్వంసం చేశారు. ఈ దాడి పట్ల మాజీ మంత్రి, స్థానిక సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు, బీఆరెస్ వర్కింగ్ ప్రెసెడెంట్ కేటీఆర్‌లు తీవ్రంగా ఖండించారు. అర్థరాత్రి కాంగ్రెస్ నేతల దాడి అన్యాయానికి నిదర్శనమని హరీశ్‌రావు మండిపడ్డారు. తాళాలు పగులగొట్టి.. ఆస్తులు ధ్వంసం చేయడం అప్రజాస్వామికమన్నారు. దాడిని అపకుండా నిందితులకు పోలీసులే రక్షణ కల్పించినట్లుందని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేకే భద్రత లేకపోతే.. పౌరులకు భరోసా ఏదని ప్రశ్నించారు. దాడి ఘటనపై డీజీపీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
దాడి ఘటనపై కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. సీనియర్ ఎమ్మెల్యేకు ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఎలా అని ప్రశ్నించారు. గత పదేళ్లలో ఇలాంటి కక్ష సాదింపులు లేవని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నీచంగా వ్యవహరిస్తోందని చెప్పారు. ప్రజలు ఇదంతా గమనిస్తున్నారని.. సరైన సమాధానం చెబుతారన్నారు. మరో పోస్టులో రాహుల్ గాంధీని ట్యాగ్ చేసి.. ఇదేనా మీ కాంగ్రెస్ పాలనలో వచ్చిన మార్పు.. ప్రేమ బజార్లో ద్వేషపు దుకాణం నడిపిస్తున్నారని చురకలంటించారు. రాజ్యాంగాన్ని రక్షిస్తున్నానని చెప్పుకొనే వ్యక్తికి ఇవి కనిపించడం లేదా అని కేటీఆర్ నిలదీశారు.
Atrocious .
అధికారం ఉంది కదా అని గుండాయిజమ్ చేస్తే ప్రజలు సరైన సమయంలో బుద్ధి చెప్తారు .@TelanganaDGP గారూ , మాజీ మంత్రి , ఎమ్మెల్యే అయిన హరీష్ రావు గారి అధికార నివాసంపైనే దాడి చేశారంటే ఇది ఖచ్చితంగా ప్రేరేపితం. కఠినచర్యలు తీసుకోవాలి . pic.twitter.com/KcL7suhJxJ— Ravula Sridhar Reddy (@RSRBRS) August 17, 2024