తెలంగాణ‌కు రెడ్ అల‌ర్ట్.. భారీ వ‌డ‌గ‌ళ్ల వాన‌

తెలంగాణ‌లోని ప‌లు జిల్లాల్లో వ‌డ‌గ‌ళ్ల వాన‌, ఉరుముల‌తో కూడిన వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం హెచ్చ‌రించింది

తెలంగాణ వ్యాప్తంగా ఎండ‌లు దంచికొడుతున్నాయి. మండుటెండ‌ల‌కు ప్ర‌జ‌లు విల‌విల‌లాడిపోతున్నారు. తెలంగాణ‌లోని ప‌లు జిల్లాల్లో వ‌డ‌గ‌ళ్ల వాన‌, ఉరుముల‌తో కూడిన వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం హెచ్చ‌రించింది. ఈ నేప‌థ్యంలో ప‌లు జిల్లాల‌కు రెడ్ అల‌ర్ట్ జారీ చేసింది. నేడు ప‌లు జిల్లాల్లో వ‌డ‌గాలుల తీవ్ర‌త పెర‌గ‌నుంద‌ని హెచ్చ‌రిక జారీ చేసింది.

జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, నాగర్‌కర్నూల్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాల్లో వడగళ్ల వానలు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది అని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది.

అదే సమయంలో, ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల వంటి ఉత్తర జిల్లాలకు తీవ్రమైన వడగాలుల హెచ్చరిక జారీ చేశారు. ఈ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది.

ఉత్తర తెలంగాణ జిల్లాల్లో నెలకొన్న పొడి వాతావరణానికి భిన్నంగా, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి జిల్లాల్లో మంగళవారం వరకు ఉరుములతో కూడిన వర్షాలు, వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

రాబోయే రెండు మూడు రోజుల్లో ప‌గ‌టి ఉష్ణోగ్ర‌త‌లు త‌గ్గే అవ‌కాశం ఉంద‌ని పేర్కొంది. ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుండి 3 డిగ్రీల మేర తగ్గే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ‌ పేర్కొంది.

మే 6, 7 తేదీల్లో ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో విస్తృతంగా ఉరుములతో కూడిన వర్షాలు, ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

Latest News