• Telugu News
  • /Telangana

రైతులకు గుడ్ న్యూస్…అండమాన్‌ను తాకిన రుతుపవనాలు

నైరుతి రుతుపవనాలు అండమాన్‌లోకి ప్రవేశించాయని ఐఎండీ వెల్లడించింది. ఈనెల 26న కేరళను తాకే అవకాశం ఉండగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో త్వరలో వర్షాలు ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయి.

Reported by: Tejaswini Nanna | తెలంగాణ‌ | May 16, 2026, 5:32 pm IST
Read Time: 4 mins
రైతులకు గుడ్ న్యూస్…అండమాన్‌ను తాకిన రుతుపవనాలు

భారత ప్రజలకు, రైతాంగానికి వాతావరణ శాఖ తీపి కబురు తెలిపింది. నైరుతి రుతుపవనాలు అండమాన్ లోకి ప్రవేశించాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈనెల 26న కేరళంను తాకే అవకాశం ఉందని తెలిపింది. అనంతరం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా వర్షాలు ప్రారంభమయ్యే అవకాశముందని ఐఎండీ అంచనా వేసింది.

రుతుపవనాల ప్రభావంతో అండమాన్, నికోబార్‌లో వర్షాలు కురుస్తున్నాయి. ముందస్తు అంచనాలకు అనుగుణంగానే నైరుతి రుతుపవనాలు సానుకూలంగా కదులుతున్నాయని పేర్కొంది. నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్‌లోని కొన్ని ప్రాంతాలు, నికోబార్ దీవులకు రుతు పవనాలు విస్తరించాయి. ఆగ్నేయ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాల్లోనూ ఋతుపవనాలు ప్రవేశించాయి. మరో మూడు నాలుగు రోజుల్లో మరింత విస్తరించేందుకు అనుకూల పరిస్థితులున్నాయని ఐఎండీ ప్రకటించింది. ఆగ్నేయ అరేబియా ప్రాంతంలోని మరికొన్ని ప్రాంతాలు, నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ దీవులు అండమాన్ సముద్రంలోని మిగిలిన ప్రాంతాలు, తూర్పు బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాలకు ప్రవేశించే అవకాశముందని పేర్కొంది. వాతావరణ శాఖ చల్లటి కబురు అందించడంతో అన్నదాతలు ఖరీఫ్ సాగు పనులకు సిద్ధమవుతున్నారు.

సాధారణంగా భారత వాతావరణ అంచనా ప్రకారం ప్రతిఏటా జూన్ 1 నాటికి కేరళంలో రుతుపవనాలు ప్రవేశిస్తాయి. అక్కడ నుంచి ఉత్తరాదిశగా కదులుతూ విస్తరిస్తాయి. దేశంలోనే మిగతా ప్రాంతాలకు క్రమంగా రుతుపవనాలు చేరుకుంటాయి. కేరళలో రుతుపవనాలు ప్రవేశించిన నాటి నుంచి రుతుపవనాలు విస్తరించినచోట వర్షాలు కురవడం మొదలవుతుంది. ఈ వర్షాల సీజన్ సెప్టెంబర్ వరకు ఉంటుంది.గతేడాది ఎనిమిది రోజులు ముందుగానే నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించడం గమనార్హం.

ఇవి కూడా చదవండి :

మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ఇద్దరు మహిళల దారుణ హత్య
ప్రపంచ పటంలో ఉండాలో లేదో పాక్ తేల్చుకోవాలి : భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది