Heavy Rains in Warangal | భారీ వర్షాలతో వరంగల్ బెంబేలు.. మరో రెండు రోజులు ఇదే స్థితి?
వరంగల్ నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. కుండపోతలా పడుతున్న వానలతో నగరంలోని అనేక కాలనీలు జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరో రెండు రోజులు భారీ వర్షాలు ఉంటాయన్న వార్తలు నగర వాసులను బెంబేలెత్తిస్తున్నాయి.

Heavy Rains in Warangal | విధాత, ప్రత్యేక ప్రతినిధి: వరుసగా కురుస్తున్న అతి భారీ వర్షాలతో జనం వణికి పోతున్నారు. ఇప్పటికే గత అయిదారు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలలో అతి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షాలతో ఆయా ప్రాంతాలలోని జనం బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో నిత్యం జనం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాలతో నాళాలు పొంగిపొర్లుతూ నీరు నిలిచిపోయి గంటలకొద్దీ సమయం ట్రాఫిక్ ఆగిపోతుంది. దీంతో నగరవాసులు తీవ్ర అవస్థలను ఎదుర్కొంటున్నారు. వర్షం కురుస్తుందంటేనే వణికిపోతున్నారు.
తడిసి ముద్దయిన వరంగల్ సిటీ
వరంగల్, నిజామాబాద్ లాంటి పట్టణాలు ఈ భారీ వర్షాలతో తల్లడిల్లిపోయాయి. పలు కాలనీలు, లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకొని స్థానికులు ఆందోళనకు లోనవుతున్నారు. సోమవారం రాత్రి ఏకదాటిన మూడు గంటల పాటు కురిసిన కుండపోత వర్షంతో వరంగల్ నగరం జల సంద్రాన్ని తలపించింది. జనం నీటిలోనే రాత్రంతా జాగారం చేశారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడిపారు. రాత్రి కురిసిన కుండపోత వర్షంతో ఒక వృద్ధురాలు మృతి చెందగా పలు ప్రాంతాలలో ప్రహరీ గోడలు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. లోతట్టు ప్రాంతాలైన సాయి గణేష్ కాలనీ, శివనగర్, గాంధీ నగర్, డీకే నగర్, లెనిన్ నగర్, అగర్తల చెరువు ప్రాంతం, మైసయ్య నగర్, గిరి ప్రసాద్ కాలనీ, పద్మ నగర్, శాకారాశికుంటలోతట్టు ప్రాంతాలతో పాటు పలు కాలనీలు నీటి ముంపునకు గురయ్యాయి. ఎన్నడూ వరద నీటి ఇబ్బందులను ఎదుర్కొని ప్రాంతాలు కూడా వర్షం నీటితో తడిసి ముద్దయింది. వరంగల్ జిల్లాలో సంగెం మండలంలో 24 సెంటీమీటర్ల భారీ వర్షం కురువగా ఖిలా వరంగల్ మండలంలో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. నాళాలు పొంగిపొర్లాయి. ఇంట్లోని వస్తువులు నీట మునిగి పలువురు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. వరంగల్ నగరంలో 1300 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. ఆరు సెంటర్లు ఏర్పాటు చేసి బాధితులకు అండగా నిలుస్తున్నారు. వరంగల్ కార్పొరేషన్ కార్యాలయంలో టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసి 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా అధికారులు చర్య తీసుకుంటున్నారు. ఎన్‌డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి నిలిచిపోయిన వర్షం నీరును తొలగించేందుకు చర్యలు తీసుకున్నారు. పునరావస కేంద్రాలను వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద, కార్పొరేషన్ కమిషనర్ చాహత్ వాజ్పాయ్ సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. నీటి ముంపు ప్రాంతాల నుంచి వర్షంనీరు, మురుగునీరు తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించారు.
మరో రెండు రోజులు భారీ వర్షాలు
ఈనెల 11 నుంచి 17వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలతో పాటు అతి భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావం రెండు రోజులపాటు ఉంటుందని ప్రకటించారు. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, వరంగల్, మహబూబాబాద్, జనగామ, భువనగిరి జిల్లాలలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించడంతో ఈ జిల్లాలలో ఆందోళన నెలకొంది. పెద్దపెల్లి ములుగు, భూపాల్ పల్లి, కరీంనగర్, కొత్తగూడెం, సిద్దిపేట, రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజిగిరి నల్లగొండ , సూర్యాపేట, ఖమ్మం జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో ఆయా జిల్లా యంత్రాంగాలు అప్రమత్తమై ముందస్తు చర్యలు చేపడుతోంది. కాగా భారీ వర్షాలు ఉన్నాయని సమాచారంతో లోతట్టు ప్రాంత వాసుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
ఇవి కూడా చదవండి..
రాబోయే భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి: సీఎం
Citizenship Act 1955 | ఆధార్, పాన్, ఓటర్ ఐడీ ఉన్నంత మాత్రాన భారత పౌరసత్వం రాదు: బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు
Frozen Love in Moscow: మాస్కోలో పెళ్లి రోజే మరణం వెనుక రహస్యం
Jagadish Reddy : కృష్ణా నీళ్లు సముద్రం పాలు..ఎండుతున్న నల్లగొండ చెరువులు