విధాత : కృష్ణమ్మ పరవళ్లు..నల్లమల ప్రకృతి అందాలను ఆకాశ మార్గం నుంచి వీక్షించే అద్భుత అవకాశం పర్యాటకులకు అందుబాటులోకి రానుంది. పర్యాటక రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తూ సోమశిల – శ్రీశైలం క్షేత్రాల మధ్య ‘హేలీ టూరిజం’ సేవలను ఈ నెల 9వ తేదీన ప్రారంభించనున్నట్లుగా తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు.
హైదరాబాద్ నుంచి ప్రారంభమయ్యే ఈ హెలికాప్టర్ యాత్ర సోమశిల మీదుగా శ్రీశైలం వరకు సాగుతుంది. సోమశిల చేరుకున్న పర్యాటకులు కృష్ణానదిలో బోటింగ్ చేస్తూ నదీ తీరంలోని ప్రకృతిని ఆస్వాదించవచ్చు. అనంతరం శ్రీశైల మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని తిరిగి హైదరాబాద్ చేరుకోవచ్చు. ప్రైవేట్ సంస్థలు(ఈజ్ మై ట్రిప్ సంస్థ) భాగస్వామ్యంతో ఈ సేవలను అందుబాటులోకి తెస్తున్నాం. దీనివల్ల స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని జూపల్లి తెలిపారు.
రానున్న రోజుల్లో ఈ గగన విహారం సేవలను కేవలం సోమశిలకే పరిమితం చేయకుండా నాగార్జున సాగర్, రామప్ప, నిజాం సాగర్ వంటి ప్రముఖ పర్యాటక కేంద్రాలకు కూడా విస్తరిస్తాం అని జూపల్లి పేర్కొన్నారు. తెలంగాణను దేశంలోనే అత్యుత్తమ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యంగా తెలిపారు.
ప్రకృతి ప్రేమికుల పర్యాటక ప్రాంతంగా సోమశిల – శ్రీశైలం
సోమశిల – శ్రీశైలం నల్లమల అటవీ ప్రాంతం ప్రకృతి ప్రేమికుల పర్యాటక ప్రాంతంగా ఆదరణ పొందుతుంది. జలాశయం బ్యాక్ వాటర్స్ లో ప్రకృతి అందాలు పర్యాటక ప్రేమికుల్ని సరికొత్త అనుభూతిని కలిగిస్తాయి. ఇక్కడి ఎకో పార్క్ (వాచ్ టవర్) వ్యూ పాయింట్ వద్ద ప్రకృతి దృశ్యాలు పర్యాటకులను కట్టిపడేస్తుంటాయి. ముఖ్యంగా ఎకో పార్కు పరిసరాల్లోకి అప్పుడప్పుడు పులులు వంటి వన్యప్రాణులు రావడం ఇక్కడి పర్యాటకానికి మరింత ఆకర్షణను తెస్తుంది. అటు సోమశిల ప్రాంతం కేవలం విహార కేంద్రంగానే కాకుండా 15 శివాలయాల సముదాయంతో ఆధ్యాత్మిక క్షేత్రంగానూ అలరారుతోంది. తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ (టీజీటీడీసీ) సోమశిల నుంచి శ్రీశైలం వరకు ఐదు గంటల పాటు సాగే ప్రత్యేక బోటింగ్ సేవలను అందిస్తోంది. ఈ ప్రయాణంలో నదీ తీర అందాలను చూస్తూ సాగే ప్రయాణం మధురానుభూతిని పర్యాటకులను అలరిస్తుంది.
పర్యాటకులకు వసతులు
ఇదే ప్రాంతంలో ఉన్న హరిత – మృగవాణి రిసార్ట్స్ పర్యాటకులు బస చేయడానికి అద్భుతమైన వసతు అందిస్తున్నాయి. సమీపంలోని మల్లెల తీర్థం, పాలధార, పంచదార వంటి జలపాతాలు పర్యాటకులకు కనువిందు చేస్తాయి. గత ఏడాది రూ.68.10 కోట్ల అంచనా వ్యయంతో సోమశిల వెల్‌నెస్, స్పిరిచ్యువల్ రిట్రీట్ నల్లమల ప్రాజెక్టు అభివృద్థి పనులు ప్రారంభించారు. కొల్లాపూర్ నియోజకవర్గం అమరగిరిలో రూ.45.84 కోట్ల వ్యయంతో అమరగిరి ఐలాండ్ వెల్‌నెస్ రి ట్రీట్ నిర్మాణ పనులు, రూ.1.60 కోట్లతో సోమశిల వీఐపీ ఘాట్-బోటింగ్ పాయింట్ కోసం ట్రెంచింగ్ పనులకు శంకుస్థాపన చేశారు.
కృష్ణమ్మ పరవళ్లు.. నల్లమల ప్రకృతి అందాలను ఆకాశ మార్గం నుంచి వీక్షించే అద్భుత అవకాశం పర్యాటకులకు చేరువవనుంది. పర్యాటక రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తూ సోమశిల – శ్రీశైలం క్షేత్రాల మధ్య ‘హేలీ టూరిజం’ సేవలను ఈ నెల 9వ తేదీన ప్రారంభిస్తాం.
హైదరాబాద్ నుంచి ప్రారంభమయ్యే ఈ హెలికాప్టర్… pic.twitter.com/QvImO9Jhfv
— Jupally Krishna Rao (@jupallyk_rao) April 4, 2026
