High alert In Telangana | వచ్చే 24 గంటలు మరింత అప్రమత్తంగా ఉండండి….అత్యవసర సమయాల్లో ఫోన్ చేయాల్సిన టోల్ ఫ్రీ నంబర్స్ ఇవే
Heavy Rain, Floods,

- వచ్చే 24 గంటలు మరింత అప్రమత్తంగా ఉండండి
- ఆందోళన వద్దు, అన్ని విధాలా ఆదుకుంటాం
- వరద సహాయక చర్యల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భాగస్వామ్యం కావాలి
- అధికారులు, సిబ్బందికి సెలవులు రద్దు
- జీహెచ్ఎంసి పరిధిలో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవు
- మిగతా జిల్లాల్లో స్థానిక పరిస్థితులను బట్టి సెలవుపై కలెక్టర్లదే నిర్ణయం
- జిల్లా కలెక్టర్లు, ఎస్.పి.లతో వీడియో కాన్ఫరెన్స్
- భారీ వర్షాలతో మధ్యాహ్నం 1 గంట వరకు తొమ్మిది మంది మృతి
- పాలేరు సంఘటనపై భావోధ్వేగానికి గురైన మంత్రి పొంగులేటి
- భారీ వర్షాలు, వరదలపై సమీక్షించిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
రాష్ట్ర వ్యాప్తంగా రాగల 24 గంటల వరకు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులు మరింత అప్రమత్తంగా ఉండి ఏ విధమైన ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, ఎటువంటి పరిస్థితులు ఎదురైనా కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజలు ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుదని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల పరిస్థితులు, ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో తన నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులపై ఆదివారం ఉదయం నుంచి ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ డా. జితేందర్ లతో పాటు ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్.పి.లతో సమీక్షించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు అప్పటికప్పుడు అవసరమైన ఆదేశాలను జారీ చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమీషనర్లు, ఎస్.పీ లతో సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ డా. జితేందర్ లతో కలసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మున్సిపల్, వైద్య ఆరోగ్య, నీటి పారుదల, రెవిన్యూ, డిజాస్టర్ మేనేజ్మెంట్, జీహెచ్ఎంసీ, జలమండలి, ట్రాన్స్కో తదితర శాఖల అధికారులు కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు.
వీడియో కాన్ఫరెన్స్తో పాటు తన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ “రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఏర్పడే ఉపద్రవాన్ని ముందస్తుగా ఎదురుర్కొనేందుకు చేపట్టిన చర్యల వల్ల చాలా వరకు ప్రాణ, ఆస్తి నష్టం కలుగకుండా కాపాడగలిగాం. ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా సీ.ఎస్, డీజీపితో పాటు జిల్లా యంత్రాంగం అందరం కలిసి వీలైనంత వరకు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నాం. అయితే ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సంఘటనలలో తొమ్మిది మంది చనిపోయారు, ఇది చాలా దురదృష్టకరం, విచారకరం. అలాగే ఖమ్మం జిల్లా నా నియోజకవర్గం పాలేరులో వరదల్లో చిక్కుకున్న ఒక కుటుంబాన్ని రక్షించడానికి చేయని ప్రయత్నంమంటూ లేదు. నేవీ, డిఫెన్స్, హకీంపేట లో హెలికాప్టర్లను సిద్ధం చేసినా వాతావరణం అనుకూలించక అవి అక్కడికి వెళ్లలేకపోయాయి. వరదల్లో ఇంటిపైకి ఎక్కిన ఒకే కుటుంబలోని ముగ్గురు వరదల్లో కొట్టుకుపోయారు. అందులో ఒకరిని రక్షించగలిగాము. మరో ఇద్దరినీ రక్షించే ప్రయత్నాలు చేస్తున్నాము.
గోదావరీ, కృష్ణా నదులతో పాటు పలు వాగుల ద్వారా వచ్చే వరదను ఎప్పటి కప్పుడు అంచనా వేసి పకడ్బందీగా నీటిని వదలడం వల్ల చెరువులు, కుంటలకు పెద్దగా నష్టం వాటిల్లలేదు. అయినప్పటికీ, రాష్ట్రంలో అన్ని చెరువులు పూర్తి స్థాయిలో నిండి, మరింత వరద వస్తే తెగే ప్రమాదమున్నందున, అప్రమత్తంగా ఉండి ముందు జాగ్రత చర్యలు తీసుకుంటున్నాం. ప్రధానంగా మహబూబాబాద్, ములుగు, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో వరదలు, వర్షాల ప్రభావం అధికంగా ఉండి నీటిలో చిక్కుకున్న పలువురు గ్రామీణులను సురక్షితంగా కాపాడ గలిగాము. పరిస్థితుల తీవ్రత దృష్ట్యా అన్ని స్థాయిల అధికారులు, సిబ్బందికి సెలవుల మంజూరు రద్దు చేయాలని చీఫ్ సెక్రెటరీ ని ఆదేశించాము. స్థానిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించాలని కలెక్టర్లను సూచించడం జరిగింది. హైదరాబాద్ తో పాటు జీ.హెచ్.ఎం.సి. పరిధిలో రానున్న 24 గంటల్లో భారీ వర్షాలకు అవకాశం ఉండడంతో సెలవు ప్రకటించాలని ఆదేశించడం జరిగింది.
సోమవారం సాయంత్రం వరకు ప్రజలు బయటికి రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను అప్రమత్తం చేశామని మంత్రి తెలిపారు. జీ.హెచ్.ఎం.సి. పరిధిలో పాత ఇండ్లు గోడలు నాని కూలే పరిస్థితి ఉండడంతో ముందస్తుగా వారిని పునరావాస కేంద్రాలకు తరలించామన్నారు. మహబూబాబాద్, డోర్నకల్ మధ్య భారీ రైల్వే లైను పై వర్షం నీరు చేరుకోవడంతో రైళ్లు రాకపోకలు నిలిచిపోయాయి. రైలులో ఉన్న ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వ తరపున భోజన వసతి కల్పించి బస్సులు ఏర్పాటు చేసి వారిని అక్కడినుంచి తరలించడం జరిగిందన్నారు. సామాన్యులకు ఇబ్బంది లేకుండా ఎక్కడా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఇందులో భాగస్వామ్యమై ప్రజలకు అండగా నిలవాలని కోరారు.
జీహెచ్ ఎంసీ పరిధిలో అత్యవసర నెంబర్లు
GHMC Control No: 9704601866
GHMC Tree cutting No: 6309062583
GHMC Beggers Lifting No: 9154901720
Water Loging No: 9000113667
Electricity Control No: 7382072106
MCH Disaster Teams No: 9704601866
NDRF No 8333068536
Fire Control No: 101 and
8712699444..