HMDA Earns 1225 Crores Via Building Permits | HMDAలో అద్భుతమైన సేవలు, అనూహ్యమైన ప్రగతి: మెట్రోపాలిటన్ కమిషనర్
హెచ్‌ఎండీఏ (HMDA) వేగవంతమైన పనితీరుతో రికార్డు స్థాయిలో ₹1,225 కోట్ల ఆదాయం (గత ఏడాదితో పోలిస్తే 245% అధికం) సాధించింది. ఈ ఏడాది తొలి 9 నెలల్లో 88 లక్షల చ.మీ. పైగా బిల్ట్-అప్ ఏరియాకు అనుమతులు మంజూరు చేసింది.

• వేగవంతంగా బిల్డింగ్, లేఔట్ ల అనుమతులు
• రికార్డు స్థాయిలో రూ.1225 కోట్ల ఆదాయం
• గత ఏడాది తో పోలిస్తే 137 శాతం పెరిగిన అనుమతులు
• ఈ ఏడాది మొదటి 9 నెలలలోనే 88 లక్షల చ.మీ కు పైగా బిల్ట్ అప్ ఏరియా కి అనుమతి
• ఫైళ్ళ పరిష్కారానికి నిరంతర పర్యవేక్షణ
నగరం నలుమూలల విస్తృత అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్న హెచ్ఏండిఏ అనూహ్యమైన ప్రగతి సాధిస్తూ, వేగవంతమైన పనితీరుతో ముందూ దూసుకుపోతోందని హెచ్ఏండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి దార్శనికతకు అనుగుణంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్ఎండిఎ) భవనాలు, బహుళ అంతస్తుల భవనాలు, ఇళ్ల లేఔట్ లు, విల్లా లేఔట్ ల అనుమతులలో గణనీయమైన ఫలితాలు సాధిస్తోందన్నారు. గత సంవత్సరాలలో ఎప్పుడు లేని విధంగా ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలలలోనే అనుమతుల మంజూరు విషయంలో కానీ, ఆదాయం విషయంలో కానీ అద్భుతమైన పనితీరును ప్రదర్శించి ప్రజల మన్ననలు అందుకుంటోంది.
హెచ్ఎండిఎ ప్రస్థానంలో ప్రధానమైన అంశం నిర్ధిష్ట కాలపరిమితిలో దరఖాస్తుల పరిష్కారం జరుగుతుందన్నారు. ఈ ఏడాది దీనిలో గొప్ప ప్రగతిని సాధించింది. 2025 జనవరి నుండి సెప్టెంబర్ వరకు మాత్రమే చూస్తే, ఈ తొమ్మిది నెలల్లో 5,499 దరఖస్తులు వస్తే 6,079 దరఖాస్తులు పరిష్కరించడం జరిగింది. ఇది 2024లోని మొదటి తొమ్మిది నెలల తో పోలిస్తే 49 శాతం, 2023 తో పోలిస్తే 36 శాతం అధికమన్నారు.
భవన అనుమతుల కోసం మొత్తం 2,961 దరఖాస్తులు వచ్చాయి. వీటి సంఖ్య 2024తో పోలిస్తే 18 శాతం, 2023తో పోలిస్తే 8 శాతం పెరిగాయి. వాటిలో 2,904 పరిష్కారం అయ్యాయి. అంటే 98 శాతానికి పైగా పరిష్కారం అయ్యాయి. (2024తో పోలిస్తే 47 శాతం, 2023తో పోలిస్తే 26 శాతం బిల్డింగ్ అనుమతులు పెరిగాయి). మొత్తం ఈ దరఖాస్తుల ద్వారా 88.15 లక్షల చదరపు మీటర్లకు పైగా బిల్ట్ అప్ ఏరియాకు అనుమతులు ఇవ్వడం జరిగింది.
2025లో, హెచ్ఎండిఎ మొత్తం 3,677 కొత్త దరఖాస్తులను స్వీకరించిందని వీటిలో బహుళ అంతస్తుల భవనాల (ఎంఎస్బి) అనుమతులు, ఓపెన్ ప్లాట్‌లతో లేఅవుట్, గృహాలతో లేఅవుట్ మరియు భవన నిర్మాణ అనుమతులకు సంబంధించిన దరఖాస్తులు ఉన్నాయని హెచ్ఏండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ వెల్లడించారు. వాటిలో 2,887 దరఖాస్తులకు అనుమతులు మంజూరు చేసి 79 శాతం ఆమోద రేటును సాధించమని ఆయన వివరించారు. 2024లో 3,209 కొత్త దరఖాస్తులలో 1,216 అనుమతులు ఇచ్చి 38 శాతం ఆమోదం రేటు సాధించమని అన్నారు. 2023లో కొత్త దరఖాస్తులకు అనుమతులను ఇవ్వడంలో 58 శాతం ఆమోద రేటు నమోదయ్యిందని ఆయన చెప్పారు. 2023 ముందు కన్నా ఇప్పుడు అనుమతులు మంజూరు చేయడంలో గణనీయమైన వేగాన్ని సాధించామని తెలిపారు. నిర్మాణదారులకు, ప్రజలకు తమ సంస్థ ఒక నమ్మకాన్ని కలిగించడంతో వారిలో సానుకూల స్పందన వస్తోందని ఆయన తెలిపారు.
నిర్ధిష్ట కాలపరిమితిలో వివిధ భవనాలు, లేఔట్ లు, లేఔట్ గృహాలు, బహుళ అంతస్తుల భవనాలకు వచ్చిన దరఖాస్తులను పరిష్కరించడంలో కూడా హెచ్ఏండిఏ ఉన్నత ఫలితాలను సాధించిందని సర్ఫరాజ్ అహ్మద్ పేర్కొన్నారు. 2025 జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో మొత్తం 6,079 ఫైళ్ళు పరిష్కారం అయ్యాయని, ఇది 2024తో పోలిస్తే 49 శాతం మరియు 2023తో పోలిస్తే 36 శాతం అధికం అని ఆయన వెల్లడించారు. ఈ గణాంకాలు హెచ్ఎండిఏ నిబద్ధతను ప్రతిబింబిస్తాయని ఇది పౌరులు, నిర్మాణదారులు , పెట్టుబడిదారుల కోసం విశ్వసనీయమైన వాతావరణాన్ని ఏర్పరుస్తోందని ఆయన తెలిపారు.
పటిష్టమైన పర్యవేక్షణ -జవాబుదారీతనం:
మొత్తం ఈ విజయగాధ లో కీలకమైనది ఫైళ్ళను త్వరితగతిన పరిష్కరించడంలో ఒక పద్ధతి ప్రకారం నిర్వహిస్తున్న విధానం. ఎప్పటికప్పుడు పరిశీలన, ఇందుకు సంబంధించి ప్రతి అధికారిని జవాబుదారీ చేయడం, కమిషనర్ స్థాయిలో రోజువారీ వాటిని సమీక్షించడం దీనిలో ముఖ్యమైన అంశాలు.
మొత్తం పెండింగ్ ఫైళ్ళను ఒక నిర్ధిష్ట కాలపరమితి ప్రకారం విభజించి వాటిని పరిశీలించే యంత్రాంగాన్ని అభివృద్ధి చేశారు. 60 రోజులకు పైగా పెండింగ్ లో ఉన్న ఫైళ్ళు, 30 నుండి 60 రోజులుగా పెండింగ్ లో ఉన్న ఫైళ్ళు, 30 రోజుల లోపు పెండింగ్ లో ఉన్న ఫైళ్ళు, వారం రోజులుగా పెండింగ్ లో ఉన్న ఫైళ్ళు గా మొత్తం ఫైళ్ళను విభజించుకుని, ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరించే విధానాన్ని అమలు చేస్తోంది హెచ్ఎండిఏ. ఇది మంచి ఫలితాలను ఇస్తోందని సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. మొత్తం దరఖాస్తుల రావడం, వాటిని పరిష్కరించడం తమ పని విధానంలో చాలా ముఖ్యంగా భావిస్తున్నామని, అందుకే మంచి ఫలితాలు సాధించగలిగామని ఆయన వెల్లడించారు.
2023 ముందు నాటి పరిస్థితులతో పోలిస్తే, హెచ్ఎండిఏ లో పని వేగం పెరగడంతో పాటు, తక్కువ సమయంలో దరఖాస్తులను పరిష్కరించడం, ప్రతి దరఖాస్తుకు తగిన ప్రతిస్పందన ఇచ్చేలా చూడడం, సరైన సమాచారాన్ని తగు రీతిలో పంచుకోవడం వంటి చర్యలు హెచ్ఎండిఏ పట్ల ప్రజలలో సంతృప్తి స్థాయిని పెంచిందని సర్ఫరాజ్ తెలిపారు. HMDAలో 30 రోజులకు మించి పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను కఠినమైన మానిటరింగ్ మరియు నిరంతర ఫాలో-అప్ ద్వారా 2 శాతం లోపు తగ్గించగలిగామని, పూర్తిగా పెండింగ్ లేకుండా చేయడానికి మరిన్ని ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఆయన వెల్లడించారు.
అసాధారణ ఆదాయ వృద్ధి: పట్టణాభివృద్ధికి ఆర్థిక పరిపుష్ఠి
ఈ సంస్కరణల వల్ల ఆర్థికంగా కూడా చాలా సానుకూల ధోరణి కనిపిస్తుంది. 2025 జనవరి నుండి సెప్టెంబర్ వరకు 9 నెలల్లో పర్మిట్ ఫీజు వసూళ్లు రూ.1,225 కోట్లకు పెరిగాయి, ఇది 2024తో పోలిస్తే 245% (రూ.355 కోట్లు) మరియు 2023తో పోలిస్తే 82% (రూ.674 కోట్లు) గణనీయంగా ఎక్కువ. 2025లో నెలవారీ ఆదాయం 2024 , 2023 నెలల సంబంధిత నెలల్లో నెలవారీ ఆదాయం కంటే ఎక్కువగా ఉంది. 2025 సెప్టెంబర్‌లో మాత్రమే ఆదాయ వసూళ్లు రూ. 132 కోట్లు, ఇది సెప్టెంబర్ 2024 నుండి 263% పెరుగుదల. ఇది మౌలిక సదుపాయాలు పెంచడంతో పాటు, వనరుల సమీకరణ, మెరుగైన ప్రజా సేవలకు అద్దం పడుతుందన్నారు.
2025 మొదటి తొమ్మిది నెలలు బహుళ అంతస్తుల భవనాల అనుమతుల పరంగా చూస్తే అసాధారణమైన ప్రగతి సాధించమని మెట్రోపాలిటన్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ స్పష్టం చేశారు. ఈ కాలంలో తమ మొత్తం 77 దరఖాస్తులకు అనుమతులు మంజూరు చేశామని, వీటి ద్వారా 78.71 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మాణాలకు అనుమతి లభించగా, రూ.514 కోట్ల ఆదాయాన్ని రికార్డు స్థాయిలో సాధించగలిగామని చెప్పారు. ఇదే కాలంలో 2023లో కేవలం 55 దరఖాస్తులు మాత్రమే మంజూరయ్యాయి. అప్పుడు నిర్మాణ విస్తీర్ణం 37.03 లక్షల చదరపు మీటర్లు కాగా, ఆదాయం రూ.215 కోట్లుగా నమోదైంది. ఈ ఏడాది వృద్ధి గణనీయమైనదిగా నిలిచిందని ఆయన వెల్లడించారు.
హైదరాబాద్ నగర విస్తరణలో భాగంగా, గండిపేట్ మండల పరిధిలోని కొన్ని కీలక ప్రాంతాల్లో హెచ్ఎండిఎ ఇటీవల భారీ మల్టీ-స్టోరీడ్ నిర్మాణాలకు ఇటీవల కాలంలో కొన్ని అనుమతులు మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టులు నగర రూపురేఖలను మరచేలా కీలకంగా నిలుస్తున్నాయి. వాటిలో ఉదాహరణగా కొన్ని చూస్తే..
కొకాపేట్ గ్రామంలో 2.17 ఎకరాల విస్తీర్ణంలో ఒక బ్లాక్ నిర్మాణానికి అనుమతి లభించింది. ఇది 5 సెల్లార్లు + గ్రౌండ్ + 63 అంతస్తులు కలిగి ఉంటుంది. మొత్తం నిర్మాణ విస్తీర్ణం 15,45,994 చదరపు అడుగులు, యూనిట్లు: 362.అదే కొకాపేట్‌లో మరో ప్రాజెక్ట్ 7.71 ఎకరాలు, 5 బ్లాకులు, ప్రతి బ్లాక్ 4 సెల్లార్లు + గ్రౌండ్ + 56 అంతస్తులు. నిర్మాణ విస్తీర్ణం 55,44,206 చదరపు అడుగులు, యూనిట్లు: 656.
బండ్లగూడ జగీర్ గ్రామంలో 3.22 ఎకరాల ప్రాజెక్ట్‌లో 2 బ్లాకులు, 3 సెల్లార్లు + స్టిల్ట్ + 30 అంతస్తులు, నిర్మాణ విస్తీర్ణం 15,03,090 చదరపు అడుగులు, యూనిట్లు: 446.
అదే బండ్లగూడ జగీర్‌లో 2.34 ఎకరాల ప్రాజెక్ట్, 1 బ్లాక్, 2 సెల్లార్లు + 5 పొడియం + 47 అంతస్తులు, నిర్మాణ విస్తీర్ణం 13,51,476 చదరపు అడుగులు, యూనిట్లు: 344.
కొకాపేట్‌లో మరో ప్రధాన ప్రాజెక్ట్ 9.71 ఎకరాలు, 3 బ్లాకులు—ఇందులో 2 రెసిడెన్షియల్ బ్లాకులు (5 సెల్లార్లు + గ్రౌండ్ + 57 అంతస్తులు) మరియు 1 కమర్షియల్ బ్లాక్ (5 సెల్లార్లు + గ్రౌండ్ + 49 అంతస్తులు) ఉన్నాయి. మొత్తం నిర్మాణ విస్తీర్ణం 66,03,556 చదరపు అడుగులు, యూనిట్లు: 594.
ఈ ప్రాజెక్టులు హైదరాబాద్ నగరానికి కొత్త ఆకృతి, ఆధునికత, మరియు ఆకాశాన్ని తాకే నిర్మాణ శైలిని అందిస్తున్నాయి.
అనుమతులు , ఆదాయ పరంగా గత రెండు సంవత్సరాల్లో హెచ్ఎండిఎ ప్రగతి రెట్టింపు స్థాయికి చేరింది. ఇది పెరుగుతున్న డిమాండ్‌ను, హెచ్ఎండిఎ పారదర్శక విధానాలపై ప్రజల విశ్వాసాన్ని,
అభివృద్ధి ప్రాజెక్టుల క్లియరెన్స్‌లో ఉన్న వేగాన్ని ప్రతిబింబిస్తుంది:
ఓపెన్ ప్లాట్‌లకు మంజూరైన లేఅవుట్ అనుమతులు 2,862 ఎకరాలను కవర్ చేశాయి (2024తో పోల్చితే 512% వృద్ధి), హౌసింగ్‌తో కూడిన లేఅవుట్లు 38.24 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణాన్ని చేరాయి (2024తో పోల్చితే 186% వృద్ధి)
బిల్డింగ్ అనుమతుల ద్వారా 88.15 లక్షల చదరపు మీటర్ల అభివృద్ధికి ఆమోదం లభించింది (2024తో పోల్చితే +239%; 2023తో పోల్చితే +87%)
ఈ అసాధారణ ఆదాయ వనరులు హైదరాబాద్ నగర ప్రణాళికకు ప్రాణాధారంగా నిలుస్తోంది—రోడ్లు, ప్రజా సౌకర్యాలు, పచ్చదన ప్రదేశాలకు ఇది కొత్త శక్తినిస్తుంది.
హెచ్ఎండిఎ వేగవంతమైన పురోగతి వెనుక సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన దార్శనికత, ప్రోత్సాహకరమైన మద్దతు, అధికారుల అహర్నిశ శ్రమ ఉందని మెట్రోపాలిటన్ కమిషనర్ సర్ఫరాజ్ పేర్కొన్నారు. పారదర్శకత, బాధ్యత, నిబద్ధత ప్రతి అధికారిని అంచనాలకు మించి పనిచేయడానికి ప్రేరేపించింది. ఈ విధంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ పురోగతికి మార్గదర్శకంగా నిలుస్తోందన్నారు.