విధాత, హైదరాబాద్ : హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల వ్యాప్తంగా ఆదివారం బోనాల సందడి నెలకొంది. ఆషాడమాసం చివరి ఆదివారం కావడంతో నగరమంతటా బోనాల ఉత్సవాలు జరుపుకుంటున్నారు.అమ్మవార్ల ప్రముఖ దేవాలయలు మొదలుకుని బస్తీల్లోని వీధుల్లో కొలువైన అమ్మవారి దేవాలయల వరకు భక్తులు పెద్ద సంఖ్యలో బోనాలు సమర్పించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.
సిటీలోని ప్రముఖ ఆలయాలు సహా కాలనీలు, బస్తీల్లోని గుడులన్నీ భక్తులతో సందడిగా మారాయి. మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి బోనాలను అలంకరించి తీసుకురావడం, శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు, డప్పుదరువులతో దద్దలిల్లుతున్నాయి.
పాతబస్తీలోని లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి, అక్కన్న మాదన్న టెంపుల్, మీరాలంమండి మహంకాళి, బేలా ముత్యాలమ్మ, ఉప్పుగూడ మహంకాళి ఆలయాలతో పాటు అన్ని పురాతన దేవాలయాల్లో అమ్మవార్లకు బోనాలు సమర్పించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. బోనాల నైవేద్యం సమర్పించుకుని అమ్మవారి ఆశీస్సులు తీసుకుని భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకుంటున్నారు.
బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్‌లోని చారిత్రాత్మక లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారిని హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, హీరో ఆనంద్ దేవరకొండ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం బయటకు వచ్చిన విజయ్‌ను చూసేందుకు, ఆయను ఫోటోలు తీసేందుకు అభిమానులు, యువత ఎగబడ్డారు. దీంతో ఆలయ పరిసరాల్లో కొద్దిసేపు సందడి నెలకొంది.
బోనాలు సమర్పించిన మంత్రులు
ఆషాఢ మాస బోనాల ఉత్సవాల సందర్భంగా లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని అమ్మవారి ఆలయంలో శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారికి ప్రభుత్వం తరుపున మంత్రులు పొన్నం ప్రభాకర్, మంత్రి కొండా సురేఖ , పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ , రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారితో కలిసి పట్టు వస్త్రాలు, బోనాలు సమర్పించారు. శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న వివిధ కార్పొరేషన్ చైర్మన్ దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు , పోలీస్ కమిషనర్ సజ్జనార్,హైదరాబాద్ కలెక్టర్ ప్రియాంక ఆలా తదితరులు ఉన్నారు.
బోరబండ లో నల్లపోచమ్మ తల్లికి ఎమ్మెల్సీ విజయశాంతి బోనం సమర్పించారు. అమ్మవారిని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ దర్శించుకుని పూజలు చేశారు. బోరబండ డివిజన్ లో ఉన్న అన్నీ అమ్మవారి ఆలయాలకు మాజీ డిప్యూటీ మేయర్ బాబాఫసియుద్ధీన్ పట్టు వస్త్రాలు సమర్పించారు.