Musi river flood|మూసీ ఉగ్రరూపానికి హైదరాబాద్ విలవిల
వరుస వర్షాలు..వరదలతో జంటనగరాలలోని పలు ప్రాంతాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. జంట జలాశయాలు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ తో పాటు గండిపేల రిజర్వాయర్ గేట్లు ఎత్తడంతో భారీగా వరద నీరు మూసీకు చేరుతుంది

విధాత, హైదరాబాద్ : వరుస వర్షాలు..వరదలతో జంటనగరాలలోని పలు ప్రాంతాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. జంట జలాశయాలు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ తో పాటు గండిపేల రిజర్వాయర్ గేట్లు ఎత్తడంతో భారీగా వరద నీరు మూసీకు(Musi river flood) చేరుతుంది. దీంతో మూసీనది వరద పోటెత్తడంతో హైదరాబాద్(Hyderabad) నగరంలోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యింది. లోతట్టు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.
ఎంజీ బస్ స్టేషన్ ను చెరువుగా మారిపోయింది. బస్ స్టేషన్ లో చిక్కుకున్న ప్రయాణికులను సహాయక బృందాలు రక్షించాయి. అఫ్జల్ గంజ్, గౌలిగూడ, చాదర్ ఘట్ ప్రాంతంలో మూసీ వరద ఉదృతికి ఒడ్డున ఉన్న దేవాలయాలు, పలు కాలనీలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. బాపుఘాట్ వద్ద మూసీ వరదలో ఓకారు కొట్టుకొచ్చింది. ఇప్పటికే నాలాల వరద నీటిలో ముగ్గురు గల్లంతయ్యారు. పురానాపూల్ వద్ధ 13అడుగుల ఎత్తులో మూసీ ప్రవహిస్తుంది. పురానాపూల్ శివాలయంలో ఓ పూజారి కుటుంబం చిక్కుకుంది. దీంతో మూసీ నది మధ్యలోనే ఆలయంలో నలుగురు వ్యక్తులు ఉండిపోగా వారిని సహాయక బృందాలు కాపాడాయి.
నల్లగొండలో మూసీ పరవళ్లు
జంటనగరాల నుంచి వస్తున్న వరదతో ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో మూసీ నది ఉదృతంగా ప్రవహిస్తుంది. బీబీనగర్ మక్తా అనంతరం, వలిగొండ సంగెం కాజ్ వే, వేములకొండ లక్ష్మాపురం కాజ్ వేల మీదుగా మూసీ వరద నీరు ప్రవహిస్తుండటంతో ఆ ప్రాంతాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మూసీ ప్రాజెక్టు 9గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. 23,378క్యూసెక్కుల నీరు మూసీ ప్రాజెక్టులోకి వస్తుంంది. పూర్తి స్థాయి నీటి మట్టం 645అడుగులకుగాను 643.20అడుగులు..4.46టీఎంసీలకుగాను 3.94టీఎంసీల నీటి మట్టం ఉంది.
ఎంజీబీఎస్ కు ఎవరూ రావద్ధు : ఆర్టీసీ ప్రకటన
మూసీ నదికి భారీ వరద నేపథ్యంలో ఎంబీజీఎస్ ప్రాంగణంలోకి వరద నీరు చేరిన నేపథ్యంలో బస్ స్టేషన్ నుంచి బస్సుల రాకపోకలు టీజీఎస్ఆర్టీసీ తాత్కాలికంగా నిలిపివేసింది. ఎంబీజీఎస్ నుంచి బయలుదేరే బస్సులను హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల నుంచి సంస్థ నడుపుతోంది. ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ వైపునకు వెళ్లే సర్వీసులు జేబీఎస్ నుంచి నడుస్తున్నాయి. వరంగల్, హన్మకొండ వైపునకు వెళ్లేవి ఉప్పల్ క్రాస్ రోడ్స్ నుంచి వెళ్తున్నాయి. సూర్యాపేట, నల్లగొండ, విజయవాడ వైపునకు బస్సులు ఎల్బీనగర్ నుంచి నడుస్తున్నాయి. మహబూబ్‌నగర్, కర్నూల్, బెంగళూరు వైపునకు వెళ్లే సర్వీసులు ఆరాంఘర్ నుంచి వెళ్తున్నాయి.
మూసీ వరదనీరు చేరిన నేపథ్యంలో ఎంజీబీఎస్ కు ప్రయాణికులు ఎవరూ రావొద్దని టీజీఎస్ఆర్టీసీ విజ్ఞప్తి చేస్తోంది. ఎంబీజీఎస్ నుంచి నడిచే బస్సులను ఇతర ప్రాంతాల నుంచి తిప్పుతున్నామని, ఆయా మార్గాల ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని పేర్కొంది. వివరాలకు టీజీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033 సంప్రదించాలని సూచించింది.