అమీన్ పూర్ లో హైడ్రా కూల్చివేతలు..ఉద్రిక్తత

సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మండలం ఐలాపూర్ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్(208) లో ఉన్న కేఏ రెసిడెన్సి, క్రిస్టల్ డెవలపర్స్ భవనంలో అద్దెకు ఉంటున్న నివాసితులను ఖాళీ చేయించి హైడ్రా సిబ్బంది కూల్చివేతలకు పాల్పడటం ఉద్రిక్తతలకు దారితీసింది.

విధాత, హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మండలం ఐలాపూర్ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్(208) లో ఉన్న కేఏ రెసిడెన్సి, క్రిస్టల్ డెవలపర్స్ భవనంలో అద్దెకు ఉంటున్న నివాసితులను ఖాళీ చేయించి హైడ్రా సిబ్బంది కూల్చివేతలకు పాల్పడటం ఉద్రిక్తతలకు దారితీసింది. రెండు జేసీబీలు, రెండు ప్రోక్లెయినర్లతో హైడ్రా సిబ్బంది పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు ప్రారంభించారు. రెవెన్యూ, పురపాలక అధికారులు, పోలీసులతో కలిసి హైడ్రా ఈ ఆపరేషన్ చేపట్టింది. నిర్మాణంలో ఉన్న ఓ గెస్ట్​ హౌస్ తో పాటు ఆరు అంతస్తుల భవనాన్ని హైడ్రా నేలమట్టం చేసింది.

ఈ ఆపరేషన్ లో వందలాది మంది హైడ్రా సిబ్బంది, పోలీసులు పాల్గొన్నారు. అయితే సరైన నోటీసులు లేకుండా..అనుమతులను సమగ్రంగా విచారించుకోకుండా , కోర్టు స్టేను ఖాతారు చేయకుండా.. హైడ్రా ఏకపక్షంగా కూల్చివేతలకు పాల్పడుతుందంటూ నిర్వాసితులు అడ్డుపడటంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. పోలీసు బలగాల సహాయంలో హైడ్రా భవనం కూల్చివేతలను కొనసాగించింది. భవనం నిర్మాణం అక్రమమైనందునే కూల్చివేసినట్లుగా హైడ్రా పేర్కొంది. ప్రభుత్వం, ఇనాం భూముల్లో అనధికారికంగా నిర్మించిన భవనాలకు సంబంధించి హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు రావడంతో అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాలతో భవనాన్ని కూల్చి వేశారు. గతంలో హైడ్రా కూల్చివేతలతో సుప్రీం కోర్టు తీర్పుని ఉల్లంఘించాడని సుప్రీం కోర్టు న్యాయవాది ముఖీమ్ హైడ్రా కమిషనర్ ను నీలదీశాడన్న కోపంతో..ఈ రకంగా ప్రతీకారం తీర్చుకున్నాడని ఆయన మద్దతుదారులు ఆరోపిస్తున్నారు.

ఐలాపురం గ్రామంలో మొత్తం 1263 ఎకరాల ప్రభుత్వానికి చెందిన భూమి ఉంది. ఇందులో ఇప్పటికే చాలా నివాసాలు వెలిశాయి. ఆ నివాసాల జోలికి వెళ్లకుండా, మిగిలి ఉన్న 860 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడేందుకు హైడ్రా చర్యలు చేపట్టింది. 863 ఎకరాల భూమి విలువ రూ.15 వేల కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక్కడ యథాతథ స్థితిని (స్టేటస్​ కో) కొనసాగించాలని 1998 నుంచి కోర్టు ఆర్డర్లిస్తున్నప్పటికీ పట్టించుకోకుండా ముఖీమ్ నిర్మించిన గెస్ట్ హౌస్ ను , అలాగే ఎలాంటి అనుమతులు లేకుండా ముఖీమ్ సోదరుడు అజీమ్ నిర్మించిన 6 అంతస్తుల భవనాన్ని హైడ్రా అధికారులు తొలగించారు.

కమిషనర్ రంగనాథ్ వివరణ

ఐలాపూర్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేతపై హైకోర్టు ఎలాంటి స్టే ఇవ్వలేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో హైడ్రా కూల్చివేతలపై తప్పుగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఐలాపూర్‌లో భూములపై 1998లో హైకోర్టు స్టేటస్ కో ఉందని తెలిపారు. ప్రభుత్వ భూములను ఆక్రమించి ముఖీమ్ ఫాంహౌస్ నిర్మించుకున్నాడని రంగనాథ్ అన్నారు. ఫాంహౌస్ కేంద్రంగా ప్రభుత్వ భూమి కబ్జాకు పాల్పడ్డాడని వివరించారు. 2006లో నిర్మించిన ఫాంహౌస్ ఇప్పుడు 40 ఎకరాలకు విస్తరించాడని వివరించారు. 20 ఏళ్లుగా ముఖీమ్‌ తన అనుచరులతో కలిసి భూదందా చేస్తున్నాడని రంగనాథ్ తెలిపారు. ప్రభుత్వ భూములను ప్లాట్లుగా విక్రయించి కోట్లు సొమ్ము చేసుకున్నాడని చెప్పారు. ముఖీమ్‌ 100 గజాలకు రూ.10 లక్షల చొప్పున పేదలకు విక్రయించాడని తెలిపారు.

స్థానికుల సంబరాలు

సంగారెడ్డి జిల్లా ఐలాపూర్ లో రాజగోపాల్ నగర్ ప్లాట్ యజమానులు 1980లో 4వేల ప్లాట్లను 495 ఎకరాలు కొనుగోలు చేశారు. అయితే అప్పటి నుంచి ముఖీం ప్లాట్ యజమానులకు అడ్డుపడటంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్టేటస్​కో ఆర్డర్​ తేవడం ఆనందంగా ఉందని కాలనీ వాసులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి, హైడ్రాకు ధన్యవాదాలు తెలియజేశారు. సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలభిషేకం నిర్వహించి ముఖీం దిష్టిబొమ్మును దగ్ధం చేశారు.

Latest News