HYDRA | హైదరాబాద్‌లో హైడ్రా హల్‌చల్
హైద్రాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై ఉక్కు పాదం మోపుతున్న హైడ్రా ఆదివారం నగర శివారు ప్రాంతాల్లో రంగారెడ్డి జిల్లా గండిపేట్ చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లలో నిర్మించిన భారీ భవనాలు, చెరువులో నిర్మించిన అపార్ట్‌మెంట్లను కూల్చివేసింది.

గండిపేట్ చెరువు పరిధిలోని కట్టడాల కూల్చివేత
హైడ్రా జాబితాలో ప్రముఖుల ఆక్రమణలు
విధాత, హైదరాబాద్ : హైద్రాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై ఉక్కు పాదం మోపుతున్న హైడ్రా ఆదివారం నగర శివారు ప్రాంతాల్లో రంగారెడ్డి జిల్లా గండిపేట్ చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లలో నిర్మించిన భారీ భవనాలు, చెరువులో నిర్మించిన అపార్ట్‌మెంట్లను కూల్చివేసింది. హైడ్రా కమీషనర్ రంగనాథ్‌కు ఫిర్యాదులు రావడంతో హైడ్రా బృందం రంగంలోకి దిగింది. పటిష్ట బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా వ్యాపార సముదాయాలు నిర్మించడంతో హైడ్రా చర్యలు తీసుకుంది. కూల్చివేత సందర్భంగా అధికారులు, యజమానులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు సాగాయి. కూల్చివేతలను అడ్డుకున్న స్థానికులను అధికారులు అరెస్ట్ చేశారు. నగరంలోని గండిపేట చెరువు చుట్టూ ఉన్న అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఫోకస్ చేసింది. 5 రోజుల్లో ఆపరేషన్ గండిపేట పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. గండిపేట చెరువు బఫర్ జోన్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేస్తున్నారు. మరోవైపు చిలుకూరు, నార్సింగ్ మండలం ఖానాపూర్‌లలో భారీ భవనాలను కూడా కూల్చివేయనున్నారు. ఈ అక్రమ కట్టడాలు గండిపేట చెరువు ఎన్టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో ఉన్నాయి.
హైడ్రా జాబితాలో పలువురు ప్రముఖులు
హైడ్రా ఆక్రమణల తొలగింపు ఆపరేషన్ జాబితాలో పలు పార్టీలకు చెందిన ప్రముఖులు ఉన్నట్లుగా ప్రచారం సాగుతుంది. ఇందులో బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్వాడా ఫామ్‌హౌజ్ సహా ప్రతిపక్ష పార్టీల నేతల ఆక్రమ నిర్మాణాలు సహా వివిధ రంగాల ప్రముఖల పామ్‌హౌజ్‌లు, మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధుల ప్రైవేటు యూనివర్సిటీలు, కళాశాలల భవనాలు కూడా ఉన్నట్లుగా నెట్టింట కామెంట్లు పెడుతున్నారు. జీవోనెంబర్ 111ఉల్లంఘనతో, చెరువుల పరిధిలోని ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లలో, ప్రభుత్వ భూముల్లో ఆక్రమంగా నిర్మాణాలు చేసుకున్న ప్రముఖులు వందల సంఖ్యలో ఉన్నట్లుగా హైడ్రాకు ఫిర్యాదులు అందుతున్నాయని తెలుస్తుంది. వారందరిలోనూ హైడ్రా గుబులు మొదలైందని, వారంతా హైడ్రా రద్ధుకు ప్రభుత్వంపై ఒత్తిడి మొదలుపెట్టారన్న ప్రచారం సైతం సాగుతుంది.