విధాత, హైదరాబాద్ : మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కృష్ణజలాలపైన, కాంగ్రెస్ ప్రభుత్వ రెండేళ్ల పాలన వైఫల్యాలపైన చేసిన విమర్శలు..సంధించిన ప్రశ్నలతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ నాయకులు ఆగమాగం అవుతున్నారని బీఆర్ఎస్ మాజీ మంత్రి టి.హరీష్ రావు విమర్శించారు. తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ లేవనెత్తిన అంశాలకు సూటిగా సమాధానాలు చెప్పలేక రేవంత్ రెడ్డి తప్పుడు విమర్శలు చేయడం, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తర ప్రగల్బాలు మాట్లాడటం సిగ్గుచేటన్నారు. కేసీఆర్ స్టేట్స్ మెన్ గా మాట్లాడితే, రేవంత్ స్ట్రీట్ రౌడీగా మాట్లాడారని, కేసీఆర్ తన మాటలతో రేవంత్ రెడ్డిని ద్రోహిగా నిలబెట్టారని హరీష్ రావు స్పష్టం చేశారు.
హామీలు, అప్పులు, పెట్టుబడులపై అన్ని అబద్దాలే
రెండేళ్లు అయ్యింది పింఛన్లు ఎందుకు పెంచలేదు.. 2500 మహాలక్ష్మి ఏమైందని ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ అడిగారని, రైతులను ఎందుకు గోస పెడుతున్నారు.. యాపులు, మ్యాపులు ఏమిటంటే రేవంత్ రెడ్డి నుంచి, మంత్రుల నుంచి సమాధానం లేదు అని హరీష్ రావు విమర్శించారు. ఫార్మాసిటీ ప్రాముఖ్యతను కేసీఆర్ చెప్పారన్నారు. రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఆర్థిక అరాచకత్వానికి పాల్పడిందంటే..గ్లోబల్ సమ్మిట్ కు వచ్చిన టోనీ బ్లెయిర్, సుబ్బారావులు కొత్త రాష్ట్రం తెలంగాణ అద్బుతమైన అభివృద్ది సాధించింది అన్నారని హరీష్ రావు గుర్తు చేశారు. సొంత పార్టీ నాయకులనే తొక్కుకుంటూ పెరిగిన అని రేవంత్ రెడ్డి చెప్పుకున్నాడని, 50కోట్లు పెట్టి పీసీసీ కొన్నడు అని కోమటి రెడ్డి చెప్పాడని, ఎమ్మెల్యేను కొనుగోలు చేసే క్రమంలో 50లక్షలు లంచం ఇస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిన దొంగ నిజాయితీ గురించి మాట్లాడటం సిగ్గుగా ఉందన్నారు. చొక్కాలు మార్చినంత సులువుగా పార్టీ మార్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని, త్యాగాల చరిత్ర మాది, వెన్నుపోటు చరిత్ర మీది అని, నీకు మాపై మాట్లాడే నైతికత లేదని హరీష్ రావు మండిపడ్డారు. ఊసరవెల్లి కూడా నిన్ను చూస్తే సిగ్గుపడుతుందని, సోనియాను దేవత అంటవు, బలి దేవత అంటవు
నీకో స్టాండ్, సిద్దాంతం ఉందా రేవంత్ రెడ్డి అని హరీష్ రావు ప్రశ్నించారు.
ధాన్యం రికార్డు దిగుబడి మా ఘనతే
2022-23లో 258 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి చేసి దేశంలో తెలంగాణను నెంబర్ 1గా చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వంఅని, ధాన్యం సేకరణలో 2020-21లో 141 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి రికార్డు నెలకొల్పిందని హరీష్ రావు చెప్పుకొచ్చారు. మల్లన్నసాగర్, రంగనాయక్ సాగర్, అనంతగిరి కింద పండ పంటల కాళేశ్వరం కాదా? వర్షాలు బాగా ఉంటే ఎస్సారెస్పీ నుంచి, మధ్య పరిస్థితులు ఉంటే ఎల్లంపల్లి నుంచి, కరువు పరిస్థితులు వస్తే మేడిగడ్డ నుంచి కాళేశ్వరం నీళ్లు వాడుతామని, నువ్వు రాకముందే ధాన్యం ఉత్పత్తిలో, డాక్టర్ల ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్ వన్ గా ఉందని హరీష్ రావు అన్నారు.
నది జలాల సమస్యలపై అవగాహన లేని కాంగ్రెస్ పాలకులు
రెండేళ్లు అయినా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ ప్రెస్ మీట్లకు ప్రిపేర్ కాకుండా రావడం సిగ్గుచేటు అని, సగం సగం చదవి సగం సగం చెబుతాడని హరీష్ రావు ఎద్దేవా చేశారు. 2023లో డీపీఆర్ వాపస్ వస్తే కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ (CEA) అనుమతి, సెంట్రల్ సాయిల్ & మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్(CSMRS) అనుమతి, కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ (MoTA) అనుమతి, కేంద్ర భూగర్భ జల బోర్డు (CGWB) అనుమతి ఎట్లా సాధించామని ప్రశ్నించారు. పాలమూరు డీపీఆర్ 12.04.2023 లో వాపస్ వస్తే, మూడు రోజుల్లోనే మా ప్రభుత్వం జల్ శక్తి మినిస్ట్రీ కి లేఖ రాసిందని, కేసీఆర్ జల్ శక్తి అధికారులతో మాట్లాడి, అక్కడ నుంచి సీడబ్ల్యూసీకి అప్రూవల్ కొనసాగించమని ఆదేశాలు ఇప్పించామని, EAC సిఫారసు సహా 7 అనుమతులు సాధించామని, ఇది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. 19.12.2024 లో DPR వాపస్ లేఖ రాస్తే ఎందుకు మౌనంగా ఉన్నారని కేసీఆర్ ప్రశ్నించారన్నారు. రెండేళ్లలో ఒక్క అనుమతి కూడా ఎందుకు తేలేదు అని, ఇది కాకుండా 45 టీఎంసీలు చాలు అంటూ ఢిల్లీకి ఉత్తమ్ కుమార్, సీఎంలు లేఖ రాసి..సిగ్గులేకుండా మేం రాయలేదు అంటున్నారని హరీష్ రావు విమర్శించారు. డీపీఆర్ వాపస్ తెస్తవు, 45 టీఎంసీలు చాలు అంటావని, 45 టీఎంసీలతో ఎవరికి అన్యాయం చేస్తవు, పాలమూరుకా, రంగారెడ్డికా, నల్లగొండకా అని ప్రశ్నించారు.
ఎవరి డైరెక్షన్.. చంద్రబాబు డైరెక్షనా?
45టీఎంసీలు చాలు అని లేఖ రాయడం ఎవరి డైరక్షన్…చంద్రబాబు డైరక్షనా అని దానికి సమాధానం చెప్పకుండా చిల్లర వాగుడు ఎందుకు అని సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ మండిపడ్డారు. పాలమూరు 90శాతం పనులు పూర్తి చేసింది వాస్తవం. మీరు రెండేళ్లలో ఏం చేసారు? 16 సెప్టెంబర్ న నార్లాపూర్ పంప్ హౌజ్ లో పంపు ను రన్ చేసి మహబూబ్ నగర్ ప్రజానీకానికి ప్రాజెక్టు నుంచి నీళ్ళు వస్తాయన్న భరోసాను కల్పించిండు కేసీఆర్ అని గుర్తు చేశారు. నార్లపూర్ -95 % పూర్తి, డిసెంబర్ 2023 జలాశయంలో 2 టిఎంసిల నీటిని నింపామని, ప్రస్తుతం జలాశయంలో 4 టిఎంసిల నీటి నిల్వ ఉందని. ఈ ఘనత మా ప్రభుత్వానికి కాదా ? అని హరీష్ రావు ప్రశ్నించారు. ఏదుల, వట్టేం, కరివెన, ఉద్దండాపూర్ పనులు దాదాపు పూర్తి చేశామని, కేవలం రెండు కిలోమీటర్లు తవ్వుతే నీళ్లు నిండుతాయని, బీఆర్ఎస్ ఉండి ఉంటే కోడంగల్, నారాయణ్ పేట్ రైతుల కాళ్లు కృష్ణా నీళ్లతో కడిగే వాళ్లం అన్నారు. పాలమూరు బిడ్డను అని చెప్పుకుంటూ పాలమూరు గొంతు కోయడమేనా నీ రాజకీయం అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.
వాటాలపై అసెంబ్లీలోనే స్పష్టతనిచ్చాం
299:512 వాటా విషయంలో మూతి పలగ్గొట్టే విధంగా అసెంబ్లీలోనే సమాధానం చెప్పామని, ఈ ఒప్పందానికి మరణ శాసనం రాసిందే కాంగ్రెస్ పార్టీ అని హరీష్ రావు ఆరోపించారు. కృష్ణాలో 299:512 వాటా ఇచ్చి, తెలంగాణ తీరని చారిత్రక ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. 18.10.2013 నాడు ఉమ్మడి ఏపీ జస్టిస్ శ్రీ కృష్ణ కమిటికి రిపోర్టు ఇచ్చింది. ఇదే రిపోర్టును శాసనసభలోనూ పెట్టారు అన్నారు. జులై 14, 2014 నాడు కృష్ణాలో 299 అన్యాయం అని కేంద్రానికి కేసీఆర్ లేఖ రాశాడని, ఢిల్లీకి పోయి పోరాటం చేశారని అని హరీష్ రావు తెలిపారు.
రాష్ట్రం వచ్చిన 42 రోజుల్లోనే.. ఆనాటి కాంగ్రెస్ మాకు అన్యాయం చేసిందని, కొత్త ట్రిబ్యునల్ వేసి నదీ పరివాహక ప్రాంతం ఆధారంగా కేంద్రాన్ని కోరామని, తెలంగాణ పట్ల మా చిత్తశుద్దికి, నిజాయితీకి నిదర్శనం ఇది అని తెలిపారు. మేం 299 శాశ్వత ఒప్పందం చేసుకుంటే, సెక్షన్ 3 ఎందుకు అడిగాం, అపెక్స్ కౌన్సిల్ ఎందుకు పోయాం, ఎందుకు కేసీఆర్ సుప్రీంకు మెట్లు ఎక్కారని, సెక్షన్ 3 సాధించింది కేసీఆర్ కాదా అని హరీష్ రావు వ్యాఖ్యానించారు.
కేసీఆర్ సంతకాన్ని చూపించాలి
కేసీఆర్ సంతకం పెట్టిండు అంటాడని, యాడ పెట్టిండు చూపెట్టు రేవంత్ రెడ్డి అని హరీష్ రావు డిమాండ్ చేశారు. 17.2.2025 నాడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసుకున్న అగ్రిమెంట్ లో ఏముంది. అదే తాత్కాలిక ఒప్పందం వీళ్లు కూడా చేసుకున్నరు. దీని గురించి ఏమంటరు?
దీనిపై రేవంత్ రెడ్డి సంతకం పెట్టిండు అని మేం అనలేమా? కానీ మేం చిల్లరగా మాట్లాడం.
అందులో ఏముంది ఫైనల్ అవార్డు వచ్చే దాక 50:50 చేసుకుందామని మీ సెక్రెటరీ రాసిండు.
అదే డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ 28 లెటర్లు రాసి అడిగిందన్నారు. మీరు కొత్తగా చేసింది ఏముంది, కొత్తగా రాసింది ఏముందని ప్రశ్నించారు. పదేండ్లలో కొత్తగా ఒక్క ఎకరానికి నీళ్లు ఇవ్వలేదు అని మంత్రి ఉత్తమ్ అంటున్నారని, 2014 నుంచి 2023 వరకు 17.24 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, 31.50 లక్షల ఎకరాల స్థిరీకరణ చేశామని, తొమ్మిదిన్నరేళ్లలో మొత్తం 48.74లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. అసెంబ్లీలో ఇచ్చామని చెప్పిన ఉత్తమ్, నిన్ననేమో ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదు అంటాడని విమర్శించారు.
రెండేళ్లలో ఒక్క ప్రాజెక్టు కట్టలేదు
అంటే 2024-25 బడ్జెట్ లో ఆ ఏడాదికి 6,55,895 ఎకరాల ఐపీ క్రియేట్ చేస్తం అన్నారని, 2025-26 బడ్జెట్ లో 5,05,000 ఎకరాల ఐపీ క్రియేట్ చేస్తం అన్నారని, అంటే మొదటి రెండేళ్లలో 11,60,895 ఎకరాలు, నీళ్లు ఇచ్చారంటున్నారని, 11 వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చినవా ఇస్తే ఎక్కడ ఇచ్చినవో చెప్పాలని సవాల్ రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్ విసిరారు. చెప్పకపోతే అసెంబ్లీ సాక్షిగా తప్పు చెప్పా అని ముక్కు నేలకు రాసి తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పు తెలంగాణ సమాజానికి అని హరీష్ రావు డిమాండ్ చేశారు. రెండేళ్లలో ఒక్క ప్రాజెక్టు కట్టింది లేదు, ఒక్క చెక్ డ్యాం పూర్తి చేసింది లేదు. మీరు చేసింది చెక్ డ్యాంల పేల్చివేత, ప్రాజెక్టుల కూల్చివేత తప్ప చేసింది ఏముంది?
ప్రాజెక్టులు, చెక్ డ్యాంలను కూల్చి వేస్తున్న అసలైన ఉగ్రవాది రేవంత్ రెడ్డి అన్నారు. ఎస్ ఎల్ బీ సీ కుప్పం కూలితే శవాలను కూడా బయటకు తీయలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం నీది రేవంత్ రెడ్డి.
కృష్ణా నీళ్లలో అతి తక్కువ నీటి వినియోగం జరిగింది రేవంత్ రెడ్డి పాలనలోనేనని, నల్లమల బిడ్డకు బేసిన్లు తెల్వదా? అని హరీష్ రావు విమర్శించారు. కృష్ణా నీళ్లను తాకట్టు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా పెడుతున్నది ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీనే అని హరీష్ రావు ఆరోపించారు.
నది జలాలపై పూటకో మాట
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 18.06.2025 నాడు కృష్ణా బేసిన్ మీద 500 టిఎంసీలకు బ్లాంకెట్ ఎన్ ఓ సీ ఇవ్వండి, ఆ తర్వాత ఏ ప్రాజెక్టులైన కట్టుకోండి అన్నాడని, సెప్టెంబర్ 13న జరిగిన నీటి పారుదల శాఖ సమీక్షలో ఇదే ముఖ్యమంత్రి.. కృష్ణా జలాల్లో 904 టీఎంసీల వాటా సాధించి తీరాలని చెప్పాడని హరీష్ రావు గుర్తు చేశారు. మంత్రి ఉత్తమ్ ఏమో 763 టిఎంసీల రైట్ షేర్ అంటాడని, ముఖ్యమంత్రి ఏమో ఓ సారి 500 టీఎంసీ అంటాడు. ఓసారి 904 టీఎంసీలు అంటాడని, పూటకో మాట మాట్లాడి పరువు తీసుకుంటున్నారని హరీష్ రావు తప్పుబట్టారు. వీళ్ల తెలివి తక్కవ తనంతో తెలంగాణ రాష్ట్రం హక్కుగా రావాల్సిన నీటి వాటాను కోల్పోయే పరిస్థితి ఉందన్నారు. కావాలనే తెలంగాణకు ద్రోహం చేస్తున్న అసలైన జల ద్రోహి రేవంత్ రెడ్డి అని ఆరోపించారు.
ఏపీ జల దోపిడిపై చేష్టలూడిన రేవంత్ ప్రభుత్వం
సాగర్ కుడి కాల్వ నుంచి ఏపీ ప్రభుత్వం రోజు 10వేల క్యూసెక్కుల నీళ్లు తరలించుకుపోతుంటే, తెలంగాణ ప్రభుత్వం చేవచచ్చి, చేష్టలుడిగి చేతులు కట్టుకొని చూస్తున్నారని.. ఇప్పుడు కూడా నీళ్లు తరలి పోతున్నాయని హరీష్ రావు ఆరోపించారు. కృష్ణా జలాల్లో ఏపీ తాత్కాలిక వాటా 512 టిఎంసీలు, కానీ 650 పైగా నీళ్లు ఏపీ తరలించుకుపోతుంటే మీ నోరు పెగలదా? మిమ్మల్ని ఎన్నుకున్నది ఎందుకు? అన్నారు. తెలంగాణ నీటి ప్రయోజనాలు పట్టని కాంగ్రెస్, తెలంగాణ ప్రజల పాలిట పెను శాపం అని విమర్శించారు. కల్వకుర్తి,బీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్ ప్రాజెక్టులను నాడు కాంగ్రెస్ ఎందుకు పూర్తి చేయలేదు. 1984లో కల్వకుర్తికి కొబ్బరికాయ కొట్టి 2014 వరకు 13వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చారు. కానీ మేము పదేండ్లలోనే 2600 కోట్లు ఖర్చు చేసి 3 లక్షల 7వేల ఎకరాలకు నీళ్లు అందించాం. నెట్టంపాడు 2300 ఎకరాలకు నీళ్లు ఇస్తే మేము 540 కోట్లు ఖర్చు పెట్టి లక్షా 40వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చాం అని తెలిపారు. బీమా కింద 12వేల ఎకరాలకు మీరు నీళ్లు ఇస్తే 646 కోట్లు ఖర్చు చేసి లక్షా 60వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చాం అన్నారు. కోయిల్ సాగర్ కింద 38వేల ఎకరాలకు ఇచ్చామని, ఈ నాలుగు ప్రాజెక్టుల కింద ఆరున్నర లక్షల ఎకరాలను సాగులోకి తెచ్చాం అని, మొత్తంగా పాలమూరులో 10లక్షల ఎకరాల్లో నీళ్లు పారించినామని హరీష్ రావు తెలిపారు.
ఎస్ ఎల్ బీసీ విషయంలోనూ అబద్దాలే
ఎస్ ఎల్ బీ సీ విషయంలోనూ అదే పచ్చి అబద్దం చెబుతున్నారని, కరోనా ప్రభావం ఉన్న రెండు సంవత్సరాలు మినహాయించి 2014 నుండి 2023 వరకు.. 7 ఏండ్లలో 11.48 కిలోమీటర్ల టన్నెల్ తవ్వకాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేసిందని హరీష్ రావు తెలిపారు. ఇందుకు గాను 1358 కోట్లు ఖర్చు చేసిందని, టన్నెల్ సహ SLBC ప్రాజెక్టులో భాగమైన డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, పెండ్లిపాక రిజర్వాయర్, భూసేకరణ, పునరావాసం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మొత్తం ఖర్చు 3892 కోట్లు అని, ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఖర్చు కంటే ఎక్కువ చేశామని తెలిపారు. ప్రాజెక్టు పనులు చేయడం కాదు, కనీసం సొరంగంలో పూడుకుపోయిన శవాలను కూడా బయటకు తీయలేని దద్దమ్మ సర్కారు ఇదని విమర్శించారు. పావు కిలోమీటర్ తవ్వకుండానే కుప్ప కూల్చారన్నారు.
రేవంత్ రెడ్డి ద్రోహాన్ని కేసీఆర్ వదిలిపెట్టరు
కేసీఆర్ గర్జిస్తే నువ్వు ప్రాజెక్టుల అప్పగింత నుంచి వెనక్కి వచ్చావని, కేసీఆర్ నిన్ను, నీ ద్రోహాన్ని వదిలిపెట్టబోరని రేవంత్ రెడ్డిని హరీష్ రావు హెచ్చరించారు. పాలమూరు, నల్లగొండ, రంగారెడ్డిలో సమావేశం పెట్టి డప్పు కొడుతారని, ఇప్పటికైనా 45 టీఎంసీలు చాలు అని రాసిన లేఖ తప్పు అని విరమించుకోవాలని, ల చెంపలేసుకొని క్షమాపణలు చెప్పాలని, 90టీఎంసీల కోసం పని చేసి రాష్ట్ర నీటి హక్కులు కాపాడాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి :
పార్టీ మనుగడకే కేసీఆర్ తోలు మాటలు : మంత్రుల ఎదురుదాడి
India’s New Income Tax Bill : ఏప్రిల్ 1 నుంచి సోషల్ మీడియా, ఈ మెయిల్, డిజిటల్ ఖాతాల తనిఖీలు
