జూన్ 2నుంచి ఇందిరమ్మ ఇండ్ల రెండో విడత పంపిణీ: మంత్రి పొంగులేటి

జూన్ 2 నుంచి అదిలాబాద్‌లో ఇందిరమ్మ ఇండ్ల రెండో విడత పంపిణీ ప్రారంభమవుతుందని మంత్రి పొంగులేటి తెలిపారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇళ్లు అందిస్తామన్నారు.

జూన్ 2నుంచి ఇందిరమ్మ ఇండ్ల రెండో విడత పంపిణీ: మంత్రి పొంగులేటి

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సం జూన్ 2నుంచి ఇందిరమ్మ ఇండ్ల రెండో విడత పంపిణీని అదిలాబాద్ నుంచి ప్రారంభించనున్నట్లుగా రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ విధివిధానాలను ఈ నెల 21న జరిగే కేబినెట్‌ సమావేశంలో నిర్ణయిస్తామని తెలిపారు. రాష్ట్రంలో పేదల సొంత ఇంటి కలను సాకారం చేయడానికి సీఎం ఎ.రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తోందని పొంగులేటి పేర్కొన్నారు.

రెవెన్యూ, హౌసింగ్ అంశాలపై జిల్లాల వారీగా ప్రజా ప్రతినిధులతో నిర్వహిస్తున్న సమావేశాల్లో భాగంగా మంగళవారం హౌసింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు చెందిన ఇన్‌‌‌‌‌‌‌‌చార్జ్ మంత్రులు, జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ల కమీషనర్లు, హౌసింగ్, రెవెన్యూ, ఫారెస్టు అధికారులతో పొంగులేటి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం దూరదృష్టి లేకుండా హైదరాబాద్ నగరానికి దూరంగా డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించడం వల్ల జరిగిన నష్టం కళ్లముందే కనిపిస్తున్నదన్నారు. అటువంటి తప్పు పునరావృత్తం కాకుండా పేదలు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాలకు 5 నుంచి 8 కిలోమీటర్ల పరిథిలోనే ఇందిరమ్మ ఇండ్లను నిర్మించే విధంగా నియోజకవర్గాన్ని యూనిట్ గా తీసుకుని స్థలాలను గుర్తించి తగిన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

నియోజకవర్గం యూనిట్ గా తీసుకుని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు

బీఆర్ఎస్ ప్రభుత్వం నగరానికి 20 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి హైదరాబాద్ నగరంలో నివసిస్తున్న వారికి కేటాయించడం వల్ల తమ జీవనోపాథికి ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశ్యంతో ఇండ్లు తీసుకున్న లబ్ధిదారులు అక్కడ నివసించడానికి సంసిద్ధతం వ్యక్తం చేయడం లేదని క్షేత్ర స్థాయి పరిశీలనల్లో స్పష్టమైందన్నారు. ఈ అంశాన్ని ప్రధానంగా దృష్టిలో ఉంచుకుని ఏ నియోజకవర్గానికి సంబంధించి ఆ నియోజకవర్గంలోనే ప్రభుత్వ స్థలాలు, మురికివాడలు, భూదాన్, గతంలో వివిధ పథకాల కింద నిర్మించిన ఇళ్లు శిధిలావస్థలో ఉన్న ప్రాంతాలను గుర్తించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఈ విషయంలో ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యులను చేయాలని అధికారులను ఆదేశించారు.

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపుకు స్పెషల్ డ్రైవ్

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు లబ్ధిదారులను కేటాయించడానికి యుద్ధప్రాతిపదికన స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని మంత్రి శ్రీ పొంగులేటిఅధికారులను ఆదేశించారు. ఇప్పటికే పూర్తి అయిన వాటికి, వివిధ నిర్మాణ దశల్లో ఉన్న వాటికి ఈ నెలాఖరు కల్లా లబ్ధిదారులను గుర్తించాలని, అది కూడా ఆ కాలనీలకు అయిదు నుంచి ఎనిమిది కిలోమీటర్ల లోపు ఉన్న వారినే ఎంపిక చేయాలని స్పష్టం చేశారు. ఇప్పటికే నిర్మాణాలన్నీ పూర్తైన ఇండ్లలో లబ్ధిదారులు ఉండేలా చూసేలా నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ఈ కాలనీల్లో మంచినీరు, డ్రైనేజి, విద్యుత్ వంటి కనీస సౌకర్యాల కల్పనకు వేగవంతమైన చర్యలు తీసుకోవాలన్నారు. హైదరాబాద్ ప‌రిధిలో ఇండ్ల స్ధ‌లాలు ఉండి అర్హులైన ల‌బ్దిదారుల‌కు ఈనెల చివ‌రిలోగా ఇందిర‌మ్మ ఇండ్ల మంజూరు ప‌త్రాల‌ను అంద‌జేయాల‌ని అధికారులను ఆదేశించారు.

ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలపై కఠిన చర్యలు

జిల్లా హౌసింగ్ ప్రాజెక్టు డైరక్టర్లు మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని, పనితీరు మెరుగుపడాలని, అంగుళం ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైనా కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి పొంగులేటిహెచ్చరించారు. పీడీలు తమ పరిధిలో గతంలో నిర్మించిన జెన్ఎన్ యుఆర్ఎం, రాజీవ్ గృహకల్ప, వాంబే హౌసింగ్ కాలనీలన్నిటిని సందర్శించాలని స్పష్టంగా నిర్దేశించారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో యుఎల్ సి భూములు కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ, నిబంనలకు విరుద్దంగా కొంత భాగాన్ని రిజిస్ట్రేషన్ చేశారని , స్థానిక ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సమావేశంలో మంత్రి దృష్టికి తీసుకుని రాగా వెంటనే సంబంధిత సబ్ రిజిస్ట్రార్ పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు గురికాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు

శాశ్వత భవనాలు లేని ఆర్డీవో, తహశీల్దార్, సబ్ రిజస్ట్రార్ కార్యాలయాలకు సొంత భవనాలను నిర్మించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు రూపొందించాలని పొంగులేటి ఆదేశించారు. రెవెన్యూ, ఫారెస్టు సరిహద్దు వివాదాలకు ముగింపు పలికేలా రెండు శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

రాజకీయాలకు తావు లేకుండా ఇందిరమ్మ ఇండ్లు : మంత్రి శ్రీధర్ బాబు

పేదరికమే అర్హతగా లబ్దిదారుల ఎంపిక చేపడుతున్నామని ఇందులో ఎలాంటి రాజకీయాలకు తావు లేదని స్పష్టం చేశారు. తాము ఎలాంటి భేషజాలకు పోవడం లేదని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామని పరిశ్రమలు ఐటి శాఖలు, రంగారెడ్డి జిల్లా ఇన్‌‌‌‌‌‌‌‌చార్జ్ మంత్రి డి. శ్రీధర్ బాబు అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కార్యక్రమాల్లో ఇందిరమ్మ ఇండ్ల పథకం ముఖ్యమైనదని అన్నారు. ఇది చాల పకడ్బందీగా అమలవుతున్నదని ఈ పథకాన్ని ఇదే విధంగా ముందుకు తీసుకెళ్లాలని, పట్టణ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. కలెక్టర్లు ఈ పథకాన్ని క్షేత్రస్థాయిలో మరింత విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు.

కలెక్టర్లు సమీక్షించాలి : స్పీకర్ ప్రసాద్

శాసనసభ స్పీకర్ జి. ప్రసాద కుమార్ మాట్లాడుతూ.. శాసనసభలో తీసుకున్న నిర్ణయం మేరకు సమావేశాలు నిర్వహించడం పట్ల మంత్రిగారికి అభినందనలు తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం చాలా గొప్పగా అమలు అవుతున్నదని, జిల్లా స్థాయిలో కలెక్టర్లు ప్రతివారం ఈ పథకాన్ని సమీక్షించి పేదలకు మేలు కలిగేలా చూడాలన్నారు.

ఈ సమావేశంలో హైదరాబాద్ ఇన్ చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ , మంత్రి మహ్మద్ అజారుద్దీన్, శాసన మండలిలో చీఫ్ విప్పి. మహేందర్ రెడ్డి తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :

ముందుగా ప్రధాని విమానం అమ్మేయాలి : అవిముక్తేశ్వరానంద
విజయ్ కి ఊరట..ఒక్కడు తగ్గితే 31మంది వచ్చారు!