Telangana DGP | తెలంగాణ డీజీపీగా జితేందర్..? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తొలి డీజీపీ ఈయనే..!
Telangana DGP | తెలంగాణ డీజీపీ( Telangana DGP ) మార్పు అని గత వారం పది రోజుల నుంచి వార్తలు షికారు చేస్తున్న సంగతి తెలిసిందే. మొత్తానికి డీజీపీ మార్పునకు సమయం ఆసన్నమైనట్లు కనిపిస్తోంది. అందుకు ముహుర్తం బుధవారం ఖరారు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తెలంగాణ డీజీపీగా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ జితేందర్( IPS Jitender )ను నియామకం దాదాపు ఖరారైనట్లు సమాచారం.

Telangana DGP | హైదరాబాద్ : తెలంగాణ డీజీపీ( Telangana DGP ) మార్పు అని గత వారం పది రోజుల నుంచి వార్తలు షికారు చేస్తున్న సంగతి తెలిసిందే. మొత్తానికి డీజీపీ మార్పునకు సమయం ఆసన్నమైనట్లు కనిపిస్తోంది. అందుకు ముహుర్తం బుధవారం ఖరారు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తెలంగాణ డీజీపీగా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ జితేందర్( IPS Jitender )ను నియామకం దాదాపు ఖరారైనట్లు సమాచారం. డీజీపీగా జితేందర్ నియామకంపై సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) కూడా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే డీజీపీగా జితేందర్ నియామకంపై నిన్ననే ప్రభుత్వం ఉత్తర్వులు వెలువడాల్సి ఉన్నా.. సీఎం మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనలో ఉండటం కారణంగా వాయిదా పడినట్లు సమాచారం. డీజీపీ నియామకంపై బుధవారం అధికారికంగా ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.
కాంగ్రెస్ ప్రభుత్వంలో తొలి డీజీపీ..!
ఈ ఉత్తర్వులు వెలువడితే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రేవంత్ సర్కార్ నియమించిన తొలి డీజీపీ జితేందర్ కానున్నారు. ప్రస్తుతం ఆయన డీజీపీ హోదాలోనే హోం శాఖ ముఖ్యకార్యదర్శిగా కొనసాగుతున్నారు. అలాగే విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇక ప్రస్తుత డీజీపీ రవిగుప్తాను అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు ఎన్నికల కమిషన్ నియమించిన సంగతి తెలిసిందే. అప్పట్లో డీజీపీగా ఉన్న అంజనీ కుమార్‌ను క్రమశిక్షణ చర్య కింద సస్పెండ్ చేసిన తర్వాత రవిగుప్తాను ఎంపిక చేసింది ఎన్నికల కమిషన్. అప్పట్నుంచే రవిగుప్తానే డీజీపీగా కొనసాగుతున్నారు. తాజాగా జితేందర్ వైపు సీఎం రేవంత్ రెడ్డి మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.
అసలు ఎవరాయన..?
1992 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన జితేందర్.. పంజాబ్ రాష్ట్రం జలంధర్‌లో రైతు కుటుంబంలో జన్మించారు. ఏపీ కేడర్‌కు ఎంపికయ్యారు. తొలి పోస్టింగ్ నిర్మల్ ఏఎస్సీగా పని చేశారు. ఆ తర్వాత బెల్లంపల్లి అదనపు ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. మహబూబ్‌నగర్, గుంటూరు జిల్లాల ఎస్పీగా కూడా సేవలందించారు. ఢిల్లీ సీబీఐలో, 2004 నుంచి 2006 వరకు గ్రేహౌండ్స్‌లో పని చేశారు. అనంతరం డీఐజీగా పదోన్నతి పొంది విశాఖపట్నం రేంజ్‌లో బాధ్యతలు స్వీకరించారు. అప్పాలో కొంతకాలం పని చేసి తెలంగాణ ఉద్యమ సమయంలో వరంగల్ రేంజ్ డీఐజీగా కొనసాగారు. ఏపీ సీఐడీ, ఎంక్వయిరీ కమిషన్, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం హైదరాబాద్ కమిషనరేట్‌లో ట్రాఫిక్ అదనపు కమిషనర్‌గా పని చేశారు. ఆ తర్వాత తెలంగాణ శాంతి భద్రతల విభాగం అదనపు డీజీపీగా, జైళ్ల శాఖ డీజీగా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం హోం శాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్న జితేందర్ 2025 సెప్టెంబర్‌లో పదవీ విరమణ చేయనున్నారు. ఇప్పుడు డీజీపీగా నియమితులైతే 14 నెలల పాటు ఆ పదవిలో కొనసాగే అవకాశం ఉంది.