Rain Fall | శుక్రవారం రాత్రి దంచికొట్టిన వాన.. అత్యధికంగా జీడిమెట్లలో 52 మి.మీ. వర్షపాతం నమోదు
Rain Fall | శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి 11 గంటల వరకు హైదరాబాద్ నగరంతో పాటు మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. కుండపోత వర్షానికి భాగ్యనగరం అతలాకుతలమైంది.

Rain Fall | హైదరాబాద్ : శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు హైదరాబాద్ నగర వ్యాప్తంగా పొడి వాతావరణం ఉన్నది. కొన్ని ప్రాంతాల్లో ఎండ దంచికొట్టింది. ఇక ఉన్నట్టుండి.. శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి 11 గంటల వరకు హైదరాబాద్ నగరంతో పాటు మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. కుండపోత వర్షానికి భాగ్యనగరం అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు చోట్ల విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. రోడ్లన్నీ జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
శుక్రవారం రాత్రి దంచికొట్టిన వానకు అత్యధికంగా జీడిమెట్లలో 52 మి.మీ. వర్షపాతం నమోదు కాగా, షాపూర్‌నగర్‌లో 48.5, రాజీవ్ గృహకల్ప(కూకట్‌పల్లి)లో 48.3, కుత్బుల్లాపూర్ – గాజులరామారం ఏరియాలో 46 మి.మీ., షాంషీగూడ(కూకట్‌పల్లి)లో 43.8, గాయత్రినగర్ వార్డ్ ఆఫీస్(కుత్బుల్లాపూర్)లో 41.3, కూకట్‌పల్లి బస్తీ దవఖానా వద్ద 38.8 మి.మీ. వర్షపాతం నమోదైంది.
ఇవాళ జగిత్యాల, భూపాలపల్లి, కరీంనగర్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.