నకిలీ సర్టిఫికెట్లతో ఎంబీబీఎస్ సీట్లు.. అడ్మిషన్లు రద్దు

నకిలీ సర్టిఫికెట్లతో ఎంబీబీఎస్ సీట్లు.. అడ్మిషన్లు రద్దు
  • ఏడుగురి విద్యార్థుల అడ్మిషన్లు రద్దు
  • ప్రధాన సూత్రధారి కామిరెడ్డి నాగేశ్వర్ రావు
  • పోలీసులకు హెల్త్ యూనివర్సిటీ ఫిర్యాదు


విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: నకిలీ స్థానిక ధ్రువీకరణ సర్టిఫికెట్లు సమర్పించి సీటు పొందిన ఏడుగురు ఎంబీబీఎస్ విద్యార్థుల అడ్మిషన్‌ను కాళోజీ హెల్త్ యూనివర్సిటీ రద్దు చేసింది. ఈ వ్యవహారంలో సూత్రధారిగా ఉన్న కన్సల్టెన్సీ మీద కాళోజీ హెల్త్ యూనివర్సిటీ అధికారులు స్థానిక మట్టేవాడ పోలీస్ స్టేషన్ లో శుక్రవారం రాత్రి ఫిర్యాదు చేశారు.


ఏపీకి చెందిన ఏడుగురు విద్యార్థులు తెలంగాణకు చెందిన స్థానిక ధ్రువీకరణ సర్టిఫికెట్లు సమర్పించి కాళోజీ యూనివర్సిటీ పరిధిలో 2023-24 విద్యా సంవత్సరం ప్రవేశానికి ఎంబీబీఎస్ అడ్మిషన్లు పొందారు. ఈ విషయాన్ని గుర్తించిన యూనివర్సిటీ వర్గాలు ఆ ఏడుగురి అడ్మిషన్లను రద్దు చేసింది.


నకిలీ స్థానిక ధ్రువీకరణ పత్రం సమర్పించి సీటు పొందిన వారిలో ఏపీకి చెందిన సుబ్రహ్మణ్య సాయి, ప్రీతిక రెడ్డి, విష్ణు తేజ, సంజయ్, హనుమాన్ రెడ్డి, మహేష్, యశ్వంత్ ఉన్నారు. వీరి అడ్మిషన్లను కాళోజీ యూనివర్సిటీ తిరస్కరించింది.


సర్టిఫికెట్ల పరిశీలనలో వెలుగులోకి…


నకిలీ ధ్రువపత్రాలతో ఎంబీబీఎస్ సీట్లు పొందినట్లు సర్టిఫికెట్ల పరిశీలన సందర్భంగా తాము గుర్తించామని వర్సిటీ వర్గాలు పేర్కొన్నాయి. ఆరు నుంచి తొమ్మిదో తరగతి తెలంగాణలో చదివినట్లు సర్టిఫికెట్లు సమర్పించారని, టెన్త్ , ఇంటర్మీడియట్ తో సహా నీట్ ఎగ్జాం కూడా ఆంధ్రప్రదేశ్ లో రాసారని పేర్కొన్నారు.


దీంతో తమకు అనుమానం వచ్చి విద్యార్థులను విచారించగా పొంతన లేని సమాధానం చెప్పారని తెలిపారు. అంతా కన్సల్టెన్సీ ద్వారా జరిగిందని విద్యార్థులు చెప్పడంతో పాటు ఈ మేరకు తాము నిర్వహించిన విచారణలో వాస్తవం వెలుగు చూసిందని తెలిపారు. దీంతో ఏడుగురు ఏపీకి చెందిన విద్యార్థుల అడ్మిషన్లు రద్దు చేసినట్లు ప్రకటించారు.


విజయవాడకు చెందిన కామిరెడ్డి నాగేశ్వరరావు నిర్వహిస్తున్న కన్సల్టెన్సీ ప్రధాన సూత్రధారిగా భావిస్తున్నట్లు యూనివర్సిటీ వర్గాలు తెలిపారు. దీంతో కన్సల్టెన్సీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సూత్రధారులు, పాత్రధారులకు సంబంధించి పోలీసు విచారణలో మరిన్ని అంశాలు వెలుగు చూసే అవకాశం ఉంది.


యూనివర్సిటీ అధికారుల ఫిర్యాదుతో మట్టేవాడ పోలీసులు కేసు నమోదుచేసి విచారణ ప్రారంభించారు. ఈ వ్యవహారంలో విద్యార్థుల నుంచి కన్సల్టెన్సీ పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్నట్లు చెబుతున్నారు. విద్యార్థులు మైనారిటీలు కావడంతో కన్సల్టెన్సీపై ఫిర్యాదు చేసినట్లు వర్సిటీ వర్గాలు పేర్కొన్నాయి.