K.Kavitha : కొత్త పార్టీ పై ఇంకా నిర్ణయం తీసుకోలేదు

కొత్త పార్టీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, కాంగ్రెస్ లో చేరే ఆలోచన లేదని కవిత స్పష్టం చేశారు. ప్రజల కోసం పనిచేస్తానని తెలిపారు.

K.Kavitha : కొత్త పార్టీ పై ఇంకా నిర్ణయం తీసుకోలేదు

విధాత, హైదరాబాద్ : కొత్త పార్టీ పెట్టాలా లేదా అనే దానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు. శనివారం ఆమె మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడారు. పార్టీ పెట్టేముందు కేసీఆర్ వందల మందితో చర్చలు జరిపారని.. ప్రస్తుతం నేనూ అదే చేస్తున్నాను అన్నారు. దేశ రాజకీయాల్లో తండ్రి పార్టీ నుంచి సస్పెండ్ అయి‌న మెదటి కూతుర్ని నేనే అని ఆమె గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరే ఆలోచన నాకు లేదు అని..కాంగ్రెస్ పెద్దలు ఎవరూ నాకు ఫోన్ చేయలేదు తెలిపారు. ఆ పార్టీలో చేరేందుకు నేను కాంగ్రెస్ లో ఎవర్నీ అప్రోచ్ కాలేదు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి..పదే పదే నాపేరు ఎందుకు తీసుకుంటున్నారో తెలియదు అన్నారు. ముఖ్యమంత్రి కాంగ్రెస్ నుంచి బయటకు పోతున్నాడేమో? అని సెటైర్లు వేశారు. ఒక వర్గం కోసం కాదు.. ప్రజలందరి కోసం పనిచేయాలనుకుంటున్నానని, బీసీల సమస్య నా మనస్సుకు దగ్గరగా అనిపించింది అని అందుకే వారికోసం పోరాడాలని నిర్ణయించుకున్నానని కవిత చెప్పుకొచ్చారు. ప్రస్తుతం నేను ఫ్రీ బర్డ్ .. నా ద్వారాలు తెరిచే ఉన్నాయని..చాలామంది వచ్చి నన్ను కలుస్తున్నారని..నాతో టచ్ లో ఉన్న బీఆర్ఎస్ నేతల లిస్ట్ చాలా పెద్దదేనన్నారు.

ఇరిగేషన్ శాఖ అవినీతి విషయంలో 2016లోనే నేను కేటీఆర్ ను అలర్ట్ చేశాను అని… కిందిస్థాయి కమిటీ పరిశీలన, ఆమోదం లేకుండానే సీఎంకు ఫైళ్లు వెళ్లాయని చెప్పానన్నారు. కాళేశ్వరం విషయంలో ప్రతి నిర్ణయం కేసీఆర్ దేనని హరీష్ రావు పీసీ ఘోష్ కమిషన్ కు చెప్పారని కవిత వెల్లడించారు. హరీష్ రావుపై కాళేశ్వరం విషయంలో తప్ప నాకు వేరే కోపం లేదు అన్నారు. హరీష్ రావు, సంతోష్ రావు మీడియా నన్నే టార్గెట్ చేస్తుందని కవిత మండిపడ్డారు.స్పీకర్ ఫార్మాట్లో నేను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశానని..మండలి చైర్మన్ కు ఫోన్ చేసి కూడా ఆమోదించాలని కోరడం జరిగిందన్నారు. తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీలు వస్తే స్వాగతిస్తాం అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా పార్టీలు పెట్టుకునే హక్కు ఉందన్నారు. రాజకీయాల్లో ఎవరూ స్పేస్‌ ఇవ్వరు.. తొక్కుకుంటూ వెళ్లాల్సిందేనని కవిత వ్యాఖ్యానించారు.

నది జలాల హక్కుల పరిరక్షణలో కాంగ్రెస్ నిర్లక్ష్యం

కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ఎత్తు పెంపుపై కోర్టు స్టేను ధిక్కరిస్తూ 5మీటర్ల ఎత్తు పెంపుకు నిర్ణయం తీసుకుందని..దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకత వ్యక్తం చేస్తూ తాము సుప్రీంకోర్టుకు వెలుతామని చెప్పారని..తెలంగాణ ప్రభుత్వం మాత్రం దీనిపై స్పందించలేదని కవిత తప్పుబట్టారు. మఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవసరం లేనివాటికి సుప్రీం కోర్టుకు వెళ్తారు కానీ నీళ్ల విషయంలో మాత్రం సుప్రీంకోర్టుకు వెళ్లడం లేదన్నారు. ఆల్మట్టి ఎత్తు పెంచితే తెలంగాణకు అన్యాయం జరుగుతుందని…కృష్ణా నది వట్టిపోయే ప్రమాదముందని కవిత ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వారంలో జరిగే కృష్ణా ట్రిబ్యునల్ ముందు సీఎం రేవంత్ రెడ్డి హాజరై నాగార్జున సాగర్ పైన హక్కులు, కృష్ణా నది జలాల వాట, ఆల్మట్టి ఎత్తు పెంపులపై తెలంగాణ వాదనలు వినిపించాలని కోరారు. ఆంధ్రా నీటి హక్కుల కోసం పని చేసిన ఆదిత్యనాథ్ దాస్ ను తెలంగాణకు అడ్వైజర్ గా పెట్టుకుంటే తెలంగాణకు తీవ్రమైన నష్టం జరుగుతుందని..తక్షణమే ఆయనను తొలగించాలని కవిత డిమాండ్ చేశారు. బనకచర్ల, ఆల్మట్టిల సమస్యలసై జాగృతి న్యాయపోరాటం చేస్తుందన్నారు.

బతుకమ్మ చీరలు పంపిణీ చేయాలి

బతుకమ్మ పండుగకు రెండు చీరలు ఇస్తామని చెప్పి..ఇప్పటిదాక ఇవ్వలేదని.. తెలంగాణ ఆడబిడ్డలందరికీ చీరలు ఇవ్వాలని..ఇచ్చే ఆ చీరలను ఇందిరమ్మ చీర అని కాకుండా బతుకమ్మ చీర పేరుతో ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. ప్రతి సందర్భంలో తెలంగాణ ఆస్తిత్వాన్ని కనుమరుగు చేసే కుట్ర చేస్తుందన్నారు. ఇప్పటికే తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మను తొలగించిందన్నారు. ఈ ధఫా బతుకమ్మ వేడుకలను జాగృతి తరుపున ఘనంగా నిర్వహించబోతున్నామన్నారు. తాను స్వగ్రామం చింతమడకలో హాజరవుతున్నానని తెలిపారు. జాగృతి తరుపునా పాట కూడా విడుదల చేస్తున్నామన్నారు.

బీసీ రిజర్వేషన్ల సాధనకు సీఎం ఇంటిని ముట్టడిస్తాం

బీసీ రిజర్వేషన్ల పై నిర్ణయం తీసుకోకుంటే మంత్రుల ఇండ్లను ముట్టడిస్తాం అని..అయినా స్పందించకుంటే ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడిస్తాం అని తెలిపారు. ఈ నెల 30వ తేదీలోగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ఆదేశిస్తే..గడువు దగ్గర పడుతున్నప్పటికి.. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం లేదన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి అభ్యర్థిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.