కారు విజ‌యానికి బస్సు ప్రచారం

పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ చేపట్టనున్న బస్సు యాత్ర రోడ్ షోల షెడ్యూల్‌.. రూట్ మ్యాప్ ఖరారైంది

కారు విజ‌యానికి బస్సు ప్రచారం

కేసీఆర్ బస్సు యాత్ర రూట్ మ్యాప్ ఖరారు
24నుంచి మే 10వరకు యాత్ర
ప్రతి పార్లమెంటు నియోజవకర్గంలో ప్రచారం
17రోజుల పాటు కొనసాగనున్న బస్సు యాత్ర

విధాత, హైదరాబాద్ : పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ చేపట్టనున్న బస్సు యాత్ర రోడ్ షోల షెడ్యూల్‌.. రూట్ మ్యాప్ ఖరారైంది. ఈనెల 24నుంచి మే 10వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని పార్లమెంటు నియోజకవర్గాల గుండా 17రోజుల పాటు బస్సుయాత్ర కొనసాగనుంది. ఈ సందర్భంగా రోడ్ షోలు నిర్వహించనున్నారు. 24వ తేదీన నల్గగొండ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని మిర్యాలగూడ నుంచి ప్రారంభంకానున్న బస్సు యాత్ర మే 10వ తేదీన మెదక్ జిల్లా సిద్ధిపేట నిర్వహించే బహిరంగ సభతో ముగియ్యనుంది. హైదాబాద్ నుంచి బస్సు యాత్ర కోసం బయలుదేరే కేసీఆర్ యాత్ర ముగిశాకే తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు. మధ్యలో అదిలాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో చేపట్టే బస్సుయాత్రకు మాత్రం ఆయన దూరభారం కారణంగా హెలిక్యాప్టర్‌లో వెలుతారు. మిగతా అన్ని నియోజకవర్గాల్లోని ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ ప్రత్యేక బస్సులోనే ప్రయాణిస్తారు. 11వ తేదీ వరకు ప్రచారానికి గడువు ఉన్నందునా ఆ రోజు కూడా ఆయన ప్రచారంలో పాల్గొంటారని తెలుస్తుంది.

ప్రతి రోజు ఉదయం పొలంబాట..కార్యకర్తల భేటీ
బస్సు యాత్రలో భాగంగా ప్రతి రోజు ఉదయం పొలం బాట కార్యక్రమం ఉంటుంది. ప్రతి నియోజకవర్గంలోనూ ఉదయం పర్యటనల్లో స్థానిక నాయకులు, కార్యకర్తలతో కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశమవుతారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత నైరాశ్యంలో ఉన్న శ్రేణుల్లో పునరుత్తేజం నింపేందుకు ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు. రోజూ సాయంత్రం వేళల్లో కనీసం 2 ప్రాంతాల్లో రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌లలో కేసీఆర్ పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. ప్రచారం ముగిశాక స్థానిక బీఆరెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల ఇళ్లలోనే కేసీఆర్ బస చేస్తారు. తద్వారా కేడర్‌కు మరింత చేరువ కావచ్చని భావిస్తున్నారు.

బస్సుయాత్ర కొనసాగే షెడ్యూల్
24వ తేదీన సాయంత్రం 5.30గంటలకు మిర్యాలగూడ రోడ్‌షోతో కేసీఆర్‌ బస్సుయాత్ర ప్రారంభమవుతుంది. అదే రోజు రాత్రి 7గంటలకు సూర్యాపేట రోడ్ షో, అక్కడే రాత్రి బస చేస్తారు. 25వ తేదీన సాయంత్రం 6గంటలకు భువనగిరిలో రోడ్ షో, ఎర్రవెల్లిలో రాత్రి బస, 26న సాయంత్రం 6గంటలకు మహబూబ్‌నగర్‌లో రోడ్ షో, రాత్రి అక్కడే బస, 27న సాయంత్రం 6గంటలకు నాగర్ కర్నూల్ రోడ్ షో, అక్కడే బస, 28న సాయంత్రం 6గంటలకు వరంగల్‌లో రోడ్ షో, అక్కడే రాత్రి బస ఉంటుంది. 29వ తేదీన ఖమ్మంలో సాయంత్రం 6గంటలకు రోడ్ షో, అక్కడే రాత్రి బస చేస్తారు. 30న తల్లాడలో సాయంత్రం 5.30గంటలకు రోడ్ షో, 6.30కి కొత్తగూడెంలో రోడ్ షో, అక్కడే రాత్రి బస ఉంటుంది. మే1 వ తేదీన సాయంత్రం 6గంటలకు మహబూబాబాద్ రోడ్ షో, వరంగల్‌లో రాత్రి బస, 2వ తేదీన సాయంత్రం 6గంటలకే జమ్మికుంట రోడ్ షో, వీణవంకలో రాత్రి బస, 3వ తేదీన సాయంత్రం 6గంటలకు రామగుండం రోడ్ షో, అక్కడే రాత్రి బస, 4వ తేదీన సాయంత్రం 6గంటలకు మంచిర్యాలలో రోడ్ షో, కరీంనగర్‌లో రాత్రి బస, 5వ తేదీన సాయంత్రం 6గంటలకు జగిత్యాలలో రోడ్ షో, రాత్రి బస, 6వ తేదీన సాయంత్రం 6గంటలకు నిజామాబాద్ రోడ్ షో, అక్కడే రాత్రి బస, 7వ తేదీన సాయంత్రం 5.30కి కామారెడ్డిలో రోడ్ షో, 7గంటలకు మెదక్‌లో రోడ్ షో, అక్కడే రాత్రి బస, 8వ తేదీన సాయంత్రం 5.30కి నర్సాపూర్‌లో రోడ్ షో, 7గంటలకు పటాన్ చెరువులో రోడ్ షో, రాత్రి ఎర్రవెల్లిలో బస, 9వ తేదీన సాయంత్రం 6గంటలకు కరీంగనగర్‌లో రోడ్ షో, అక్కడే రాత్రి బస, 10వ తేదీన సాయంత్రం 5గంటలకు సిరిసిల్లవలో రోడ్ షో, 6.30కి సిద్ధిపేటలో బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొంటారు.