KCR | బీఆరెస్ ఖతమవుతుందా.. పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఖతమైందా: కేసీఆర్
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోగానే బీఆరెస్‌ను ఖతం చేస్తామని మాట్లాడుతున్నారని, 25ఏండ్ల పార్టీని ఖతం చేయగలరా అని, అలాగైతే పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఖతమైందా అని బీఆరెస్ అధినేత కేసీఆర్ ప్రశ్నించారు

కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్లీ అధికారం మనదే
శ్వాస ఉన్నంత వరకు తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తా
రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో కేసీఆర్
విధాత, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోగానే బీఆరెస్‌ను ఖతం చేస్తామని మాట్లాడుతున్నారని, 25ఏండ్ల పార్టీని ఖతం చేయగలరా అని, అలాగైతే పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఖతమైందా అని బీఆరెస్ అధినేత కేసీఆర్ ప్రశ్నించారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ఆయన హాజరై మాట్లాడారు. బీఆరెస్ మహావృక్షం…సముద్రం వంటిదని, అనేక జయపజయాలు చూసిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో కొంత నైరాశ్యం నెలకొందని, నేను బస్సు యాత్ర మొదలుపెట్టగానే మళ్లీ అదే గర్జన కనిపించిందన్నారు.
గులాబీ జెండా పుట్టిందే తెలంగాణ సమాజ రక్షణ కోసమని, రాజకీయ నిరంతర ప్రవాహమని, అధికారంలో ఉంటేనే రాజకీయం కాదన్నారు. ప్రజలు మనకిచ్చే ఏ పాత్రలోనైనా మనం వారి కోసం పనిచేయాలని, తెలంగాణ ప్రజల ప్రయోజనాల పరిరక్షణనే బీఆరెస్ ప్రథమ కర్తవ్యమని, ఎన్నికల ఫలితాలతో ఆగమాగం కాకుండా ముందున్న మంచి భవిష్యత్తు దిశగా అడుగులేయని, దశాబ్ధి వేడుకల స్ఫూర్తితో ప్రజల కోసం నూతన ఉద్యమ పంథాలో నడుద్దామన్నారు.
నా శ్వాస ఉన్నంత వరకు తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తానన్నారు. కాంగ్రెసోళ్లు తిరిగి అధికారంలోకి వచ్చినట్లే మళ్లా బీఆరెస్ కూడా అధికారంలోకి వస్తుందన్నారు. ఇప్పుడు ఎన్నికలు జరిగినా బీఆరెస్ అధికారంలోకి వస్తదని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయన్నారు. చేప పిల్లలు, గొర్రె పిల్లలను పంపిణీ చేస్తే అపహాస్యం చేశారని, 30వేల కోట్ల చేపలను విక్రయించారని, రైతుబంధు ఓట్ల కోసం ఇవ్వలేదని, వ్యవసాయ స్థిరీకరణ కోసం చేశామని, 18.32జీడీపీ వ్యవసాయ రంగం నుంచి వచ్చిందన్నారు. గొర్రెలపంపిణీతో దేశంలో నెంబర్ వన్ స్థానానికి వెళ్లామని, కరెంటు కోతల నుంచి 24గంటల విద్యుత్తు సరఫరా స్థాయికి చేరామన్నారు.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేశామని, వేలకోట్ల రూపాయలు గ్రామీణ ప్రాంతాలకు పంప్ చేశామన్నారు. సంక్షేమ పథకాలు, పల్లె, పట్టణ ప్రగతి వంటి కార్యక్రమాలతో తెలంగాణ పల్లెలు సర్వతోముఖాభివృద్ధి చెందాయన్నారు. ప్రతి పంచాయతీకి ట్రాక్టర్, పార్కు ఉన్నరాష్ట్రం తెలంగాణ, జీఎస్డీపీలో, మంచినీటి సరఫరా, తలసరి ఆదాయం, నిరంతర కరెంటు వంటి వాటిలో తెలంగాణ నెంబర్‌గా ఉందన్నారు. అప్పుడప్పుడూ కొంత విషపు గాలి వస్తుందని.. తప్పుడు ప్రచారాలు, హామీలకు ప్రజలు భ్రమ పడ్డారన్నారు. కేవలం 1.8శాతం తేడాతో మనం ఓడిపోయామన్నారు.
పాలనా చేతగాక ప్రతిపక్షం నిందలా
సీఎం రేవంత్‌రెడ్డి విద్యుత్తు ఉత్పత్తి, సరఫరాలో విఫలమై హరీశ్‌రావు కరెంటోళ్లను పనిచేయనిస్తలేడనడం విడ్డూరంగా ఉందన్నారు. రైతులకు మళ్లీ విత్తనాలు, ఎరువుల కొరతతో క్యూలైన్లు కట్టాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వం విత్తనాలు సక్రమంగా సరఫరా చేస్తే బీఆరెస్ వాళ్లు చెప్పులు లైన్లలో పెట్టమంటే వారు ఎందుకు పెడుతారని ప్రశ్నించారు. మిషన్ భగీరథ కూడా ప్రపంచం మెచ్చుకున్న కార్యక్రమమని, అది కూడా పనిచేయడం లేదంటారని, రైతుబంధు కూడా పెంచి ఇస్తామని చెప్పి పాత పద్దతిలో కూడా ఇవ్వడం లేదన్నారు.
పింఛన్లు సైతం 2వేలకు బదులుగా 4వేలు ఇస్తామని ఇవ్వడం లేదన్నారు. దళితబంధును కూడా నిలిపివేశారన్నారు. గీత, నేత కార్మికులకు కూడా అన్యాయం జరుగుతుందన్నారు. అందుకే ఇప్పుడిన్న ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయన్నారు. రోజురోజుకు అన్ని రంగాల్లో పరిపాలనలో విఫలమవుతున్నారన్నారు. యావత్ తెలంగాణ సమాజానికి ఇచ్చిన హామీలలో మోసం చేస్తుందన్నారు. సీఎం సొంత జిల్లా మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించామని, రేపు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా గెలవబోతుందన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో ఏమవుతుందో చుద్దామన్నారు.
జయశంకర్ ఆజన్మ తెలంగాణ వాది
తెలంగాణ జాతిపిత జయశంకర్ సార్ ఆజన్మ తెలంగాణవాదిగా కేసీఆర్ కీర్తించారు. జయశంకర్ సార్ తెలంగాణ గురించి చేసిన పోరాటాలను గుర్తుచేేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. ఆ రోజుల్లో తెలంగాణ గురించి మాట్లాడుడే కష్టంగా ఉండెనని, నాటి శాసనసభ స్పీకర్ ప్రణయభాస్కర్ తెలంగాణ అనే పదం ఉపయోగించవద్దని చెప్పారని, వెనుకబడిన ప్రాంతం అనాలని శాసనసభ ముఖంగా వ్యాఖ్యానించారని కేసీఆర్ గుర్తుచేశారు.
ఆంధ్రావాళ్లు చేసిన హేళనల నుంచే నా తెలంగాణ ప్రస్థానం మొదలైందని జయశంకర్ సార్ చెప్పేవారన్నారు. అందుకు ఆయన తన బాల్యంలో వరంగల్‌లోని మర్కజి స్కూల్‌లో జరిగిన సంఘటన గురించి చెప్పారన్నారు. జయశంకర్ సార్ చూపిన బాటలో తెలంగాణ ఉద్యమాన్ని మొండి పట్టుదలతో సాగించి లక్ష్యాన్ని సాధించామన్నారు. అదే స్ఫూర్తితో భవిష్యత్తులోనూ బీఆరెస్ శ్రేణులు తెలంగాణ ప్రజల ప్రయోజనాల ప్రథమ కర్తవ్యంగా పనిచేయాలన్నారు.
ఎగ్జిట్ పోల్స్ ఓ గ్యాంబ్లింగ్
ఎగ్జిట్ పోల్స్ ఓ గ్యాంబ్లింగ్ తయారయ్యాయని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఒక్కో సంస్థ ఒక్కోలా లెక్కలు చెబుతున్నాయన్నారు. “రాజకీయ ఫలితాలు వస్తుంటాయి.. పోతుంటాయి. గెలుపోటములు ఎలా ఉన్నా.. ప్రజాక్షేత్రంలో పనిచేస్తూనే ఉండాలి. ఎగ్జిట్ పోల్స్లో భారాసకు 11 స్థానాలు వస్తాయని ఒకరు.. ఒక సీటు వస్తుందని మరొకరు చెప్పారు. 11 సీట్లు వచ్చినంత మాత్రాన పొంగిపోయేది లేదు.. 3 వచ్చినా కుంగిపోయేది లేదు. రాజకీయ జయాపజయాలు మనకి లెక్కకాదు” అని అన్నారు.
Read more