బీఆర్ఎస్‌ను బద్నాం చేయడానికే కాళేశ్వరం పంపులు ఆన్ చేయడం లేదు: కేటీఆర్

కాళేశ్వరం కన్నెపల్లి పంపులను ఉద్దేశ్యపూర్వకంగా ప్రారంభించకుండా రైతులకు నీరు అందకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని కేటీఆర్ ఆరోపించారు. బీఆర్ఎస్‌ను బద్నాం చేయడమే లక్ష్యమని విమర్శించారు.

బీఆర్ఎస్‌ను బద్నాం చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని, అందుకే కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంప్‌హౌస్‌లో రెండు పంపులు ప్రారంభించకుండా లక్ష క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రైతులకు నీరు అందిస్తే ఎరువులు, పంటలు పండితే మద్దతు ధర, బోనస్ ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం నీటిని విడుదల చేయడం లేదని విమర్శించారు. గోదావరిలో నీరు అందుబాటులో ఉన్నప్పటికీ ఉద్దేశ్యపూర్వకంగా పంటలను ఎండబెట్టి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని అన్నారు. మల్లాపూర్‌లోని వీఎన్ఆర్ గార్డెన్స్‌లో నిర్వహించిన 18వ హమాలీ యూనియన్ ఆవిర్భావ దినోత్సవ మహాసభకు ముఖ్య అతిథిగా హాజరై కేటీఆర్ మాట్లాడారు.

కన్నెపల్లి నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామని, తమపై ఎంత కోపం ఉన్నా కేసులు పెట్టుకోవచ్చని, కానీ రైతులపై కక్ష సాధింపు చర్యలు తీసుకోవద్దని కోరినట్లు కేటీఆర్ తెలిపారు. తమపై ఎన్ని కేసులు పెట్టినా భయపడబోమని, కానీ రైతులను వేధిస్తే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. హమాలీలు వడ్ల బస్తాలు మోసి ప్రజలకు అన్నం అందించే గొప్ప సేవ చేస్తున్నారని, కానీ ముఖ్యమంత్రి మాత్రం ఢిల్లీలోని తన పార్టీ పెద్దలను సంతోషపెట్టేందుకు డబ్బుల సంచులు మోస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో హమాలీలు, రైతులు, మిల్లు యజమానులు అందరూ సంతోషంగా ఉండగా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని అన్నారు.

రాష్ట్రాన్ని మంచి నాయకుడు పాలిస్తే పేదలు, రైతులు, హమాలీలు, మిల్లు యజమానులు అందరూ సంతోషంగా ఉంటారని, కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణ అదే చూసిందన్నారు. గోదావరిలో నీరు ఉన్న ప్రాంతాన్ని గుర్తించి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించడం వల్ల సాగు విస్తీర్ణం భారీగా పెరిగి తెలంగాణ సస్యశ్యామలంగా మారిందన్నారు. రైతులు అభివృద్ధి చెందితే హమాలీలకు కూడా ఉపాధి పెరిగిందని గుర్తు చేశారు. హమాలీల కష్టాన్ని గుర్తించిన కేసీఆర్ ప్రభుత్వం కూలీ రేట్లను రూ.8 నుంచి రూ.26కు పెంచిందని, దాదాపు 250 శాతం పెంపు సాధించడం బీఆర్ఎస్ ప్రభుత్వ ఘనత అని తెలిపారు. గతంలో ఐదేళ్లకోసారి మాత్రమే కూలీ రేట్లు పెరిగేవని, కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండేళ్లకోసారి రేట్లు సవరించడంతో హమాలీల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని చెప్పారు.

బీఆర్ఎస్ ప్రస్తుతం అధికారంలో లేకపోయినా ప్రజల మద్దతు ఏమాత్రం తగ్గలేదని, కష్టకాలంలో పార్టీ వెంట నిలిచిన ప్రతి కార్యకర్తను, నాయకుడిని కాపాడుకుంటామని కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో మళ్లీ గులాబీ జెండా ఎగరడం ఖాయమని, అందరూ ఐకమత్యంగా నిలవాలని పిలుపునిచ్చారు. మరో రెండేళ్లలో కేసీఆర్‌ను తిరిగి ముఖ్యమంత్రిని చేసుకుని తెలంగాణ అభివృద్ధి పథంలో ముందుకు సాగుదామని హమాలీ కార్మికులకు, ప్రజలకు పిలుపునిచ్చారు.

Latest News