దమ్ముంటే అసెంబ్లీ రద్దు చెయ్ : సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్

అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు రావాలని సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు. రైతు సమస్యలు, ధాన్యం కొనుగోలు, భగీరథ్ కేసుపై కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

దమ్ముంటే అసెంబ్లీ రద్దు చెయ్ : సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్

2034 వరకు సీఎంగా తనే ఉంటానని చెప్పుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డికి ధైర్యం ఉంటే అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు రావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. నీకు అంత దమ్ము లేకపోతే ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు..ఉప ఎన్నికల్లో బలాబలాలు తేల్చుకుందాం అన్నారు. దేశంలో ఎక్కడా ఎన్నికలు జరిగిన కాంగ్రెస్ కు నిధులు తెలంగాణ నుంచే పోతున్నాయన్న సంగతి దేశం అంతా తెలుసు అన్నారు. కలలు కనవచ్చని..కథలు చెప్పి ప్రజలను మోసం చేయవద్దన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్ లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.

యాసంగి ధాన్యం కొనుగోలులో రేవంత్ సర్కార్ అబద్దాలు

యాసంగి ధాన్యం కొనుగోలు, మక్కల కొనుగోలులో రేవంత్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కేటీఆర్ విమర్శించారు. రైతులు నెల రోజులపైగా కళ్లాలలో పడిగాపులు పడుతు..ధాన్యం కొనడం లేదన్న దిగులుతో ప్రాణాలు విడుస్తున్న ఘటనలు జరుగుతున్నాయని, ఇప్పటికే 10మంది రైతులు చనిపోతే..ఒక్కరు కూడా చనిపోలేదంటూ సివిల్ సప్లయ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అబద్దాలు చెబుతున్నారని కేటీఆర్ విమర్శించారు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్..ధాన్యం కొనుగోలు చేయకుండా ఇష్టమొచ్చినట్లు అబద్దాలు చెప్తున్నాడని, 80శాతం కొనుగోలు చేశారని సీఎం రేవంత్ రెడ్డి, 60శాతం కొన్నామని మంత్రి ఉత్తమ్ భిన్నమైన మాటలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు.

రేవంత్ కు డబ్బు సంచులపైన శ్రద్ద ధాన్యం సంచులపై లేదు

సీఎం రేవంత్ రెడ్డికి డబ్బు సంచులపైన ఉన్న శ్రద్ద ధాన్యం సంచులపైన లేదని కేటీఆర్ విమర్శించారు. కేసీఆర్ పాలనలో పదేండ్లు దేశానికే అన్నపూర్ణగా వెలసిల్లిన తెలంగాణ.. ఇవ్వాళ తల్లడిల్లుతున్నదని, రైతు కన్నీరు పెడుతున్నాడన్నారు. కాంగ్రెస్ రైతు డిక్లరేషన్, బోనస్ అంతా బోగస్ అని, రైతు డిక్లరేషన్ లో 34హామీలు ఇచ్చి ఒక్కటి అమలు చేయలేదన్నారు. నాల్గవ సారి రైతుబంధు ఎగవేశారని, విత్తనాలు, యూరియా దొరకడం లేదన్నారు. ఆదుకోవాల్సిన కేంద్రం నుంచి ప్రధాని మోదీ వచ్చి యూరియా తక్కువ వాడాలని చెప్పి పోయారని విమర్శించారు.

భూ దోపిడిపైనే రేవంత్ శ్రద్ద

భూదోపిడిపైన ఉన్న శ్రద్ద ధాన్యం కొనుగోలుపై రేవంత్ రెడ్డికి లేదన్నారు.శంషాబాద్‌లో రేవంత్ రెడ్డి అనుచరుడు 1000 కోట్ల ప్రభుత్వ భూములు కాజేశాడు అని, వేం నరేందర్ రెడ్డి భూ కబ్జాలను మా పార్టీ నాయకుడు క్రిశాంక్ బయటపెట్టాడని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి ధాన్యం కొనుగోలుపై చిత్తశుద్ది ఉంటే కేబినెట్ మీటింట్ లో దీనిపై చర్చించాలని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక చనిపోయిన 1000 మంది రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు నిర్ణయం తీసుకోవాలన్నారు. ప్రభుత్వం ఏయే పంటలను ఎంత కొనుగోలు చేసిందో.. ఎన్ని డబ్బులు ఇచ్చారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తుందని, రైతుల సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం ఇలాగే కొనసాగితే రైతుల తరపునా బీఆర్ఎస్ ఉద్యమిస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు.

రేవంత్ రెడ్డి,బండి సంజయ్ ఇద్దరూ తోడుదొంగలే

సీఎం రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరూ తోడుదొంగల మాదిరిగా మారి భగీరథ ఫోక్సో కేసును పక్కదారి పట్టించాలని చూస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఒక మైనర్ బాలికపై ఘోరమైన అఘాయిత్యం జరిగితే.. కంప్లైంట్ తీసుకోవడానికి కూడా నిరాకరించిన ఈ రాష్ట్ర హోంమంత్రి (ముఖ్యమంత్రి) రేవంత్ రెడ్డికి అసలు బుర్ర ఉందా?ఒక పోక్సో నిందితుడిని పట్టుకోవాల్సింది పోయి.. 9 రోజులు రాచమర్యాదలు చేసి కాపాడిన వెధవలు ఎవరు? అని ప్రశ్నించారు. హైకోర్టు బెయిల్ నిరాకరించడంతో, దిక్కులేక చివరకు నిందితుడు లొంగిపోవాల్సి వచ్చిందని, ఇప్పుడు మీ ఇద్దరి డ్రామాలు, అరెస్ట్ నాటకాలు ఎవరూ నమ్మబోరన్నారు. రేవంత్ రెడ్డి మోదీ ఎప్పటినుండో కలిసే ఉన్నారు, మళ్లీ కొత్తగా కలవడం ఏంది? అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. గతంలో నరేంద్ర మోదీ వచ్చి ఇక్కడ ఆర్ఆర్ టాక్స్ వసూలు చేస్తున్నారు అన్నాడని, ఇప్పుడు నాతో కలిస్తే నీ అక్రమాలు అన్నీ వాషింగ్ మెషిన్ లెక్క మాఫీ చేస్తా అంటున్నాడని, తెలంగాణ మంత్రులు ఇన్ని అక్రమాలు చేస్తుంటే బీజేపీ ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రూ.10వేల కోట్ల కుంభకోణంపైన, మంత్రి పొంగులేటి ఈడీ రైడ్స్ పైన చర్యలు లేవని, సీఎం బంధువులకు కేంద్ర కాంట్రాక్టులు, బీజేపీ ఎంపీలకు రాష్ట్ర కాంట్రాక్టులు దక్కడం ఆ రెండు పార్టీల బంధానికి నిదర్శనం అన్నారు.

భగీరథ్ ను దాచిపెట్టడంలో రేవంత్ ప్రమేయం

పోక్సో నిందితుడిని వెంటనే జైల్లో వేయాల్సింది పోయి..9 రోజులు దాచిపెట్టిన రేవంత్ రెడ్డి..నా బావ మరిది డ్రగ్స్ కేసులో దొరికితే కూడా నోటీసులు ఇచ్చామని ముచ్చట చెబుతున్నాడని, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అసత్య ప్రచారాలకు దిగడం సరికాదని విమర్శించారు. రాజకీయాల్లో హద్దులు, సభ్యత పాటించాలని సూచించిన కేటీఆర్, తమ వద్ద కూడా ముఖ్యమంత్రిపై మాట్లాడటానికి చాలా విషయాలు ఉన్నాయని, అయితే తాము సంస్కారంతో వ్యవహరిస్తున్నామని స్పష్టం చేశారు. బాధ్యత లేని ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. తెలుగు ప్రధాన మీడియాను మేనేజ్ చేసుకున్న విషయం వాస్తవం కాదా ? అని కేటీఆర్ విమర్శించారు. బండి భగీరథ్ 9 రోజులు మెడికవర్ అనే రేవంత్ రెడ్డి బంధువుల ఆసుపత్రిలో దాక్కున్నాడని మాకు సమాచారం ఉంది అని కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ రాష్ట్రంలో ఆడబిడ్డలందరూ రేవంత్, బండిల మొహం మీద ఉమ్ముతున్నారని, ఈ సిగ్గులేని కాంగ్రెస్ ప్రభుత్వానికి, తోడుదొంగల రాజకీయాలకు త్వరలోనే ప్రజలు బుద్ధి చెప్తారని అన్నారు. డ్రగ్స్ పార్టీలో దొరికిన పైలట్ రోహిత్ రెడ్డిని ఎప్పుడో సస్పెండ్ చేశామని, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులకు డ్రగ్స్ టెస్టులను మేం కూడా ఆహ్వానిస్తున్నామన్నారు.

దొంగలను ఎలా పట్టుకోవాలో రేవంత్ చెప్పడం విడ్డూరం

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏమన్న జడ్జి అనుకుంటున్నాడా అని రేవంత్ రెడ్డి అంటున్నాడని, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జడ్జి కాదు కానీ.. భవిష్యత్తులో నీకు పాఠాలు చెప్పే రోజులు అయితే వస్తాయి అని కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి పోలీసులకు దొంగలను ఎలా పట్టుకోవాలో చెప్తున్నాడని, దొంగలను ఎట్లా పట్టుకోవాలో పోలీసులకు తెలుసు అని, నిన్ను డబ్బు సంచులతో పట్టుకున్నది వాళ్లేనని రేవంత్ పై కేటీఆర్ చురకలేశారు. నీలాంటి దొంగల దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం పోలీసులకు లేదు అన్నారు. ఈ తమాషాలు బంద్ పెట్టి.. ధాన్యం కొనుగోళ్లపై దృష్టి పెట్టు అని కేటీఆర్ సూచించారు.బండి సంజయ్‌తో నాకు ఎలాంటి వ్యక్తిగత కక్ష లేదు అని, అతనే నా కుటుంబం గురించి నీచంగా మాట్లాడాడు కానీ నేనెప్పుడు నోరు జారలేదు అన్నారు. బండి సంజయ్ కొడుకు స్థానంలో సామాన్యుడు ఉంటే ఇలాగే ఉండేదా? అని ప్రశ్నించారు. నా పేరు కేటీఆర్..నా తండ్రి పేరు కేసీఆర్..నా కొడుకు పేరు హిమాన్షు అని, నేను కొడుకు కేసులో నా పేరు వాడొద్దని ఆర్డర్లు తెచ్చుకునే రకం కాదు అని బండి సంజయ్ పై విమర్శలు గుప్పించారు. కులగణన తెలంగాణలో విఫలమైన ప్రక్రియ అని, అది దేశానికి రూల్ మోడల్ ఏమిటంటూ విమర్శించారు. ఫ్యూచర్ లేని నాయకుడు రేవంత్ రెడ్డి చేస్తున్న ఫ్యూచర్ సిటీ అని హడావుడి చేస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడని, అందుకే బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే భూసేకరణ నిబంధనల మేరకు ఫార్మాసిటీని పునరుద్దరిస్తామని చెప్పారు.

ఇవి కూడా చదవండి :

10రాష్ట్రాలు…24రాజ్యసభ స్థానాల ఎన్నికల షెడ్యూల్ విడుదల
Viral News | సమ్మర్ హాలీడేస్‌లోనే పిల్లలను కనేలా ప్లాన్ చేసుకో.. కొత్తగా పెళ్లయిన టీచర్‌కు ప్రిన్సిపాల్ వింత కండిషన్!