విధాత, హైదరాబాద్ : ఫార్ములా ఈ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కు ఏసీబీ కోర్టు షాక్ ఇచ్చింది.ఈ కేసులో ఇప్పటికే వేసిన ఛార్జ్ షీట్ ను కగ్నిజనుల్ తీసుకున్న ఏసీబీ కోర్టు కేటీఆర్ తో పాటు ఏ2గా ఉన్న ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్, ఏ3 హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డి, ఏ4 స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వర్‌రావుకు సమన్లు జారీ అయ్యాయి. జులై 31న విచారణకు రావాలని కోర్టు నోటీసులలో ఆదేశించింది.
2023లో నిర్వహించిన ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో నిబంధనలకు విరుద్ధంగా విదేశీ సంస్థ ఎఫ్ఈఓ సంస్థకు రూ.55 కోట్లు మళ్లించినట్లు ఏసీబీ అభియోగపత్రంలో పేర్కొంది. విదేశీ సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా డబ్బు చెల్లించడం వల్ల తెలంగాణ ప్రభుత్వానికి రూ.కోట్లు నష్టం వాటిల్లిందని అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) కేసు నమోదు చేసింది. అయితే పురపాలక శాఖ మంత్రి హోదాలో కేటీఆర్ ఆదేశించడంతోనే తాను నిధులను విడుదల చేసినట్లుగా అప్పట్లో ఆశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగిన అర్వింద్ కుమార్ ఇదివరకే ప్రభుత్వానికి లిఖితపూర్వక వాంగ్మూలాన్ని సమర్పించారు. ఈ కేసులో గతంలో ఏసీబీ మాజీ మంత్రి కేటీఆర్ ను సైతం విచారణ చేసి వాంగ్ములం నమోదు చేసింది.
ఇప్పటికే ఈ కేసులో కేటీఆర్, అర్వింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిలతో సహా ఎఫ్ఈఓ సంస్థ ప్రతినిధులను ప్రశ్నించింది. కేసులో ఏసీబీ ఛార్జిషీటు కూడా వేసింది. ఏ1- కేటీఆర్, ఏ2-అర్వింద్‌కుమార్, ఏ3- బీఎల్ఎన్‌రెడ్డి, ఏ4- కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వర్రావు, ఏ5గా ఎఫ్ఈఓ సంస్థను ఛార్జిషీటులో చేర్చింది. ఏసీబీ దాఖలు చేసిన చార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకున్న కోర్టు తాజాగా నిందితులకు సమన్లు జారీ చేసింది.
