హైదరాబాద్, సెప్టెంబర్ 17 (విధాత): తెలంగాణలో ప్రస్తుతం ముఖ్యమంత్రి నియంతలా వ్యవహరిస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో కేటీఆర్ బుధవారం మీడియాతో చిట్ చాట్ చేశారు. రాష్ట్రంలో గ్రూప్-1 అభ్యర్థులు, విద్యార్థులు కనీసం రౌండ్‌టేబుల్ సమావేశం కూడా పెట్టుకోలేని పరిస్థితి ఉందన్నారు. అన్ని వర్గాల పైన ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని, స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయని, ఆరోగ్యశ్రీ సేవలు రద్దు చేయడంతో హాస్పిటళ్లు స్తంభించాయని విమర్శించారు. ఆశా వర్కర్లు, రేషన్ డీలర్ల ఆందోళనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి సచివాలయానికి రావడం లేదని, గతంలో ప్రగతి భవన్ గురించి అనేక అబద్ధాలు చెప్పారని కేటీఆర్ గుర్తుచేశారు. ముఖ్యమంత్రి బెదిరింపులు, ముడుపుల కోసం వేధింపులు తట్టుకోలేకనే హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు నుంచి ఎల్ అండ్ టీ సంస్థ వైదొలుగుతోందని కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. గతంలో వివాదాస్పదమైన ఎంఆర్ సంస్థ ఆస్తులను రేవంత్ రెడ్డి అమ్మబోతున్నారని, ఇందులో ఆయన ఎంత కమిషన్ తీసుకున్నారో తెలుస్తుందన్నారు.
ఎవరికైనా పార్టీ పెట్టే హక్కు ఉంది
ప్రజాస్వామ్యంలో ఎవరికైనా పార్టీ పెట్టే హక్కు ఉందని, తమ వాయిస్ వినిపించే హక్కు ఉందని కేటీఆర్ అన్నారు. కొత్త పార్టీలు పెట్టుకుని తమ విధానాలను ప్రజలకు చెప్పి వారి దగ్గరకు వెళ్లవచ్చని స్వాగతించారు. తాము బతుకమ్మ చీరలు కులం, మతం, అంతం, వేదం లేకుండా అందరికీ ఇచ్చామని, అయితే ఈ ప్రభుత్వం కొందరికి మాత్రమే ఇస్తోందా అని ప్రశ్నించారు.
బంధుప్రీతి లేకపోతే కాంట్రాక్టులు ఎలా వస్తున్నాయ్
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో బంధుప్రీతి లేదన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కేటీఆర్ దీటుగా స్పందించారు. సుజన్ రెడ్డి, అమిత్ రెడ్డిలకు వందల కోట్ల కాంట్రాక్టులు కొత్తగా ఇచ్చారని, మరి బంధుప్రీతి లేని ప్రభుత్వంలో ఈ కాంట్రాక్టులు ఎలా వస్తున్నాయని ప్రశ్నించారు. ముడుపులు వసూలు చేసి ఢిల్లీకి పంపించడమే రేవంత్ రెడ్డి ఏకైక పని అని ఆరోపించారు.
నేతన్నలపై రేవంత్ కోపం
తనపై ఉన్న వ్యక్తిగత కోపాన్ని రేవంత్ రెడ్డి సిరిసిల్ల నేతన్నల పైన తీర్చుకుంటున్నారని కేటీఆర్ మండిపడ్డారు. దేశంలోనే రెండో అతిపెద్ద డ్రగ్స్ దందా రాష్ట్రంలో జరగడం దారుణమని అన్నారు. ఇంత పెద్ద అరాచకం జరుగుతుంటే ఈగల్ టీం, హైడ్రా అంటూ ఎందుకు తమాషాలు చేస్తున్నారని ప్రశ్నించారు.
పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి ‘కుడితిలో ఎలుకల’ మాదిరిగా మారింది
పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి ‘కుడితిలో ఎలుకల’ మాదిరిగా మారిందని కేటీఆర్ అన్నారు. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన నియోజకవర్గ నాయకుల పరిస్థితి చూస్తే జాలి కలుగుతోందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి పోరాడిన ప్రతి ఒక్కరూ దారుణంగా మోసపోయారని అన్నారు. నిజంగా రాష్ట్రంలో అద్భుత పాలన ఉంటే వెంటనే ఉప ఎన్నికలు పెట్టాలని సవాలు విసిరారు.