KTR Slams Revanth Reddy Over Baki Card | బాకీ కార్డుతో రేవంత్ సర్కార్ భరతం పడతాం : కేటీఆర్
కేటీఆర్ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బాకీ కార్డు ఉద్యమంతో విమర్శించారు, హైదరాబాద్‌లో పరిస్థితులు అసమర్థత వల్ల కష్టంగా ఉన్నాయని పేర్కొన్నారు.

విధాత, హైదరాబాద్ : బాకీ కార్డుతో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం భరతం పడతాం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్‌లో చేరిన టీడీపీ సీనియర్ నేత ప్రదీప్ చౌదరికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ మోసాలను ఎండగట్టేందుకు ప్రారంభించిన ‘బాకీ కార్డు’ ఉద్యమమే రేవంత్ సర్కార్ భరతం పట్టే బ్రహ్మాస్త్రమని అన్నారు. కాంగ్రెస్ అభయహస్తం ఆ పార్టీ పాలిట భస్మాసుర హస్తంగా పేర్కొన్నారు. రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించుకున్నట్టుగా, హైదరాబాద్ నగరం సమస్యలతో ఆగమాగం అవుతుంటే రేవంత్ రెడ్డి కొత్త నగరం కడతానంటూ ఊదరగొట్టే ఉపన్యాసాలు ఇస్తున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఉన్న నగరాన్ని ఉద్ధరించలేని వారు కొత్త నగరం కడతామని ఫోజులు కొట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
రేవంత్ ప్రభుత్వ అసమర్థతతో హైదరాబాద్‌లో చెత్త తీసేవారు కరువయ్యారని, డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయని, వీధి దీపాలు వెలగడం లేదని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్‌లో 42 ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఇటుక కూడా పేర్చలేదని, కనీసం ఉన్న రోడ్లను కూడా సరిగా నిర్వహించడం లేదని విమర్శించారు.
కేసీఆర్ పాలనకు ప్రజల ఎదురుచూపులు
రాష్ట్రంలో రైతులు, మహిళలు, వృద్ధులు, నిరుద్యోగులు, విద్యార్థులు సహా అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని కేటీఆర్ అన్నారు. గతంలో కాంగ్రెస్ హయాంలో ఎరువుల కోసం రైతులు యుద్ధాలు చేసే దుస్థితి ఉండేదని, నేడు మళ్లీ అవే రోజులు దాపురించాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎరువుల కోసం క్యూలైన్లలో చెప్పులు పెట్టే, ప్రాణాలు కోల్పోయే దారుణ పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించారు. తెలంగాణ ప్రజలంతా మార్పు కోరుకుంటున్నారని, తిరిగి కేసీఆర్ నాయకత్వాన్ని ఆకాంక్షిస్తున్నారని చెప్పారు. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మాగంటి గోపినాథ్ నాయకత్వంలో హైదరాబాద్‌లో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా దక్కలేదని గుర్తుచేశారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఆయన సతీమణి మాగంటి సునీతను ప్రజలు బంపర్ మెజారిటీతో గెలిపించడం ఖాయమని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు.