విధాత, హైదరాబాద్ :ఒక సినిమా ఫెయిల్ అయితే ప్రొడ్యూసర్లకి నష్టం వస్తుంది.. కానీ ఈ రేవంత్ రెడ్డి అనే సినిమా ఫ్లాప్ వల్ల 4కోట్ల తెలంగాణ ప్రజలకు నష్టం వస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. అర్జున్ రెడ్డి సినిమా సూపర్ హిట్ అయితే.. ఇప్పుడు వచ్చిన సినిమా రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్. ఫస్ట్ హాఫ్, ఇంటర్వెల్ అయిపోగానే ఎప్పుడు పోతడు రా ఈయన అని అందరూ తల పట్టుకొని కూర్చున్నారు అని ఎద్దేవా చేశారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలంగా కాంగ్రెస్ పోవాలి..కేసీఆర్ రావాలి అని ఎదురుచూస్తున్నారన్నారు.
దండుపాళ్యం ముఠా నాయకుడు..
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మాఫియా శక్తులు రాజ్యమేలుతున్నాయని..సీఎం రేవంత్ రెడ్డి దండుపాళ్యం ముఠాకు నాయకుడిలా వ్యవహరిస్తుంటే.. ఆయన ఆధ్వర్యంలో ‘దోచుకో.. దాచుకో’అన్నట్లుగా కాంగ్రెస్ మంత్రులంతా కలిసి మాఫియాలు, స్కామ్‌లు చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. శంషాబాద్ నుండి ఒక వ్యక్తి నాకు పెళ్లి కార్డు ఇచ్చేందుకు వచ్చాడని, మా తాతల నాటి భూమిని నిషేధిత జాబితాలో పెట్టరాని వాపోయాడని, ఇదేంటి అని రాజకీయ నాయకులను అడిగితే ఎకరానికి కోటి రూపాయలు ఇస్తే నిషేధిత జాబితా నుండి తీసేస్తామని చెప్తున్నారని తన బాధ చెప్పుకున్నాడని కేటీఆర్ వెల్లడించారు. రెండేళ్లు నా భూమిని ఎలాగైనా కాపాడుకుంటాను, మీరు వచ్చాక వాళ్ల భరతం పట్టాలి సార్ అని అతను నా దగ్గర వాపోయాడని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ల్యాండ్ మాఫీయా, సాండ్ మాఫియా, మైనింగ్ మాఫియాలతో కాంగ్రెస్ స్కామ్ పాలన సాగుతుందని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడని ఆరోపించారు.
నాడు కేసీఆర్ హయాంలో అంతర్జాతీయ కంపెనీలకు కేరాఫ్ అడ్రస్‌గా, సూపర్ స్టార్ రజనీకాంత్ గారే చూసి అబ్బురపడేలా ఉన్న హైదరాబాద్.. నేడు కాంగ్రెస్ 420 పాలనలో కుదేలైందని విమర్శించారు. మూసీ, హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూలుస్తూ.. నగరంలో శాంతిభద్రతలను గాల్లోకి దీపాల్లా మారుస్తూ వీరు చేస్తున్న దుర్మార్గాన్ని ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు. రూ. వేల కోట్లతో గాంధీ విగ్రహం పెట్టడం కోసం పేదల ఇళ్లను కూల్చడానికి కంకణం కట్టుకున్నాడని, స్వయంగా గాంధీజీ మనవడే వద్దన్నా..ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా..రేవంత్ అసలే పట్టించుకోకుండా, బీజేపీతో కుమ్మకై ఈ వినాశనానికి తెరలేపిండని కేటీఆర్ ఆరోపించారు. బీజేపీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ఈ ప్రాజెక్టుకు సహకరిస్తూ ఇచ్చిన రక్షణ శాఖ భూములను కాపాడాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీలు కలిసి రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.
