ఇప్ప పువ్వు, తేనె సేకరణతో మహిళలకు ఉపాధి : మంత్రి సీతక్క

ఇప్ప పువ్వు , తేనె సేకరణతో మహిళా సంఘాలకు మెరుగైన ఉపాధి లభిస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామన్నారు.

విధాత ప్రత్యేక ప్రతినిధి:

ఇప్ప పువ్వు , తేనె సేకరణతో మహిళా సంఘాలకు మెరుగైన ఉపాధి లభిస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు పౌష్టికాహారం అందిస్తామన్నారు. శుక్రవారం ములుగు జిల్లా పర్యటన సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా సంఘాల ద్వారా స్థానిక ఉత్పత్తులైన ఇప్ప పువ్వు తేనె సేకరణ వంటి పనులను చేపట్టడం ద్వారా మహిళలకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు.

అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని మంత్రి సీతక్క చెప్పారు. పౌష్టికాహారాన్ని సక్రమంగా అందించాలని, మెనూలో ఎటువంటి లోపాలు చూసుకోవాలని అధికార యంత్రాగానికి సూచించారు. జిల్లా అభివృద్ధి పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని, మారుమూల ప్రాంతాల అభివృద్ధి, గిరిజన సంక్షేమం కోసం ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు.

అంకంపల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా ఎంపిక చేసి పైలట్ ప్రాజెక్ట్ ద్వారా అన్ని మౌలిక వస్తువులు కల్పిస్తూ మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు తుది దశకు చేరుకున్నాయని మంత్రి తెలిపారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి పేదల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, పంచాయతీ రాజ్ ఈ ఈ అజయ్ కుమార్, ప్రజా ప్రతినిధులు, చైర్మన్లు, డైరెక్టర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Latest News