Seethakka | మంత్రి సీతక్కతో ఉపాధిహామీ ఉద్యోగులు భేటీ
మంత్రి సీతక్క ఉపాధి హామీ ఉద్యోగులతో భేటీ; 20 ఏళ్ల FTEలకు పే స్కేల్ అమలు కోసం ఫైల్ సిద్ధం చేయాలని ఆదేశం.

హైదరాబాద్, సెప్టెంబర్ 26(విధాత): తెలంగాణ గ్రామీణ అభివృద్ధి శాఖలో పనిచేస్తున్న ఉపాధి హామీ ఉద్యోగులు సచివాలయంలో పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా దినోత్సవ శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క తో శుక్రవారం భేటీ అయ్యారు. గత 20 సంవత్సరాలుగా ఉపాధి హామీ పథకంలోఎఫ్‌టీఈ లుగా పనిచేస్తున్న తమకు పే స్కేల్ వర్తింపచేయాలని మంత్రికి వినతి పత్రం సమర్పించారు. కేవలం రూ. 30 కోట్లు ప్రతి సంవత్సరం అదనంగా వెచ్చిస్తే తమకు పే స్కేల్ అమలు చేయవచ్చని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే స్పందించిన మంత్రి సీతక్క పే స్కేల్ కు సంబంధించిన ఫైల్ ను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పే స్కేల్ పై క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న చిరు ఉద్యోగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని స్పష్టం చేశారు.
అయితే పలు సాంకేతిక సమస్యలను కారణంగా చూపుతూ పే అండ్ అకౌంట్స్ సెక్షన్ తమ జీతాల చెల్లింపుల్లో జాప్యం చేస్తుందనిఎఫ్‌టీఈఎస్‌లు మంత్రికి మొర పెట్టుకున్నారు. వెంటనే స్పందించిన మంత్రి సీతక్క పే అండ్ అకౌంట్స్ సెక్షన్ అధికారులతో మాట్లాడారు. చిన్న చిన్న సమస్యలతో చిరు ఉద్యోగుల జీతాలు ఆపొద్దని, మానవత దృక్పథంతో వ్యవహరించి జీతాలు చెల్లించాలని ఆదేశించారు.