Miyazaki mango | నిర్మ‌ల్ జిల్లాలో అరుదైన మామిడి పండ్లు.. కిలో రూ. 2.5 ల‌క్ష‌లు

Miyazaki mango | ఒక్కో ర‌కం మామిడి పండుకు ఒక్కో ధ‌ర ఉంటుంది. నిర్మ‌ల్ జిల్లాలో ఈ అరుదైన మామిడి పండ్ల ధ‌ర మాత్రం రూ. 2.5 ల‌క్ష‌లుగా ప‌లుకుతోంది. మ‌రి ఇంత‌కీ ఆ అరుదైన మామిడి పండ్లు ఏవో తెలుసుకుందాం.

Miyazaki mango | ఎండాకాలం వ‌చ్చిందంటే చాలు మామిడి పండ్లు కుప్ప‌లు తెప్ప‌లుగా ద‌ర్శ‌న‌మిస్తాయి. ఆ స్థాయిలోనే ఫ్రూట్ ల‌వ‌ర్స్ మామిడి పండ్ల‌ను కొనుగోలు చేసి తింటుంటారు. అయితే స్వీట్‌నెస్ ఎక్కువ‌గా ఉన్న ర‌కాల‌కు చెందిన మామిడి పండ్ల‌ను అధికంగా ఇష్ట‌ప‌డుతుంటారు. ఒక్కో ర‌కం మామిడి పండుకు ఒక్కో ధ‌ర ఉంటుంది. నిర్మ‌ల్ జిల్లాలో ఈ అరుదైన మామిడి పండ్ల ధ‌ర మాత్రం రూ. 2.5 ల‌క్ష‌లుగా ప‌లుకుతోంది. మ‌రి ఇంత‌కీ ఆ అరుదైన మామిడి పండ్లు ఏవో తెలుసుకుందాం.

జ‌పాన్‌కు మియాజాకి ర‌కం మామిడి పేరు వినే ఉంటారు. ఎందుకంటే తెలంగాణ‌లో ఈ ర‌కం మామిడి పండ్ల‌ను అతి త‌క్కువ మంది సాగు చేస్తున్నారు. అది కూడా ప్ర‌త్యేక‌మైన ప‌ద్ధతుల్లో. ఇక ఈ మామిడి పండ్ల ధ‌ర ల‌క్ష‌ల్లో ఉండ‌డంతో కంటికి రెప్ప‌లా కాపాడుకుంటూ.. సాగు చేస్తున్నారు.

నిర్మ‌ల్ జిల్లా క‌డెం మండ‌లం న‌వాబుపేట గ్రామానికి చెందిన ఆయుర్వేద వైద్యుడు డాక్ట‌ర్ రాప‌ల్లి స‌త్యం కూడా మియాజాకి మామిడి పండించాల‌ని మూడేండ్ల క్రితం నిర్ణ‌యించుకున్నాడు. ఈ మామిడి మొక్క‌లు శీత‌ల వాతావ‌ర‌ణంలోనే పెరుగుతాయ‌ని ప‌లువురు వాదించిన‌ప్ప‌టికీ స‌త్యం వినిపించుకోలేదు. కేర‌ళ‌లోని ఓ ఏజెన్సీ ద్వారా మూడేండ్ల క్రితం రూ. 10 వేల చొప్పున ఆరు మొక్క‌ల‌ను కొనుగోలు చేశాడు.

ఆరు మొక్క‌ల్లో ఒక‌టి చ‌నిపోగా, మిగ‌తా ఐదు పెరిగి పెద్ద‌దైంది. నాటిన రెండున్న‌రేండ్ల‌కే మొక్క‌లు దిగుబ‌డిని ఇచ్చారు. ఐదు చెట్ల‌కు భారీగా మియాజాకి మామిడి పండ్లు కాశాయి. ఇక వీటి ధ‌ర అంత‌ర్జాతీయ మార్కెట్‌లో కిలో రూ. 2.5 ల‌క్ష‌ల నుంచి రూ. 2.8 ల‌క్ష‌ల వ‌ర‌కు ప‌లుకుతోంది. ఈ నేప‌థ్యంలో రాప‌ల్లి స‌త్యం ఈ పండ్ల‌ను కంటికి రెప్ప‌లా కాపాడుకుంటున్నాడు.

ఈ పంట విలువను తెలిపేందుకు శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే బొజ్జు పటేల్‌ను సత్యం కలిసి వీటి గురించి వివరించి ఆయనకు పండ్లను అందజేశారు. ఆయుర్వేద గుణాలున్న ఈరకం మామిడి కిలో ధర రూ.2.5 లక్షల పైమాటేనని రాప‌ల్లి స‌త్యం పేర్కొన్నాడు.

 

Latest News