మే 12న నర్సింగ్ ఆఫీసర్లకు అపాయింట్‌మెంట్ ఆర్డర్స్‌: మంత్రి దామోదర

ప్రభుత్వ హాస్పిటళ్లలో 2322 నర్సింగ్ ఆఫీసర్ల భర్తీ ప్రక్రియలో భాగంగా మే 12న నర్సింగ్ ఆఫీసర్లకు అపాయింట్‌మెంట్ ఆర్డర్స్‌ ఇవ్వనున్నట్లుగా వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ వెల్లడించారు.

మే 12న నర్సింగ్ ఆఫీసర్లకు అపాయింట్‌మెంట్ ఆర్డర్స్‌: మంత్రి దామోదర

విధాత, హైదరాబాద్ : ప్రభుత్వ హాస్పిటళ్లలో 2322 నర్సింగ్ ఆఫీసర్ల భర్తీ ప్రక్రియలో భాగంగా మే 12న నర్సింగ్ ఆఫీసర్లకు అపాయింట్‌మెంట్ ఆర్డర్స్‌ ఇవ్వనున్నట్లుగా వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ వెల్లడించారు. ఉద్యోగాలకు ఎంపికైన నర్సింగ్ ఆఫీసర్లకు మే 12వ తేదీన ఇంటర్నేషన్ నర్సెస్ డే సందర్భంగా నియామక పత్రాలు అందజేసేందుకు ఏర్పాట్లు చేయాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు. ఆరోగ్య, పర్యాటక శాఖ ఉన్నతాధికారులతో సెక్రటేరియట్‌లోని తన చాంబర్‌‌లో మంత్రి సమీక్ష నిర్వహించారు.

20 రోజుల్లో పూర్తి అవనున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ

ప్రభుత్వ హాస్పిటల్స్‌, మెడికల్ కాలేజీల్లో జరుగుతున్న పోస్టుల భర్తీపై సమావేశంలో చర్చించారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ హాస్పిటల్స్‌లో భర్తీ చేస్తున్న సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్‌, ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో భర్తీ చేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు.. అలాగే, ఫార్మసిస్ట్ పోస్టులు, మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (MPHA-Female) పోస్టుల భర్తీ ప్రక్రియపై మంత్రి ఆరా తీశారు. వచ్చే నెల 15వ తేదీ నాటికి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేసి, ఫలితాలు విడుదల చేస్తామని అధికారులు మంత్రికి తెలిపారు. ఫార్మసిస్ట్‌, మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టుల భర్తీలో నెలకొన్న లీగల్ చిక్కులను పరిష్కరించి, భర్తీ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. ఈ రెండేళ్లలో సుమారు 12,650 పోస్టులను భర్తీ చేశామని, మిగిలిన పోస్టుల భర్తీ ప్రక్రియ కూడా పూర్తయితే.. ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందుతాయని మంత్రి పేర్కొన్నారు.

జూన్‌లో ఇంటర్నేషనల్ మెడికల్ టూరిజం ఈవెంట్

ప్రపంచ వైద్య పర్యాటక కేంద్రంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. జూన్‌లో ఇంటర్నేషనల్ మెడికల్ టూరిజం ఈవెంట్‌ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు. ఈవెంట్ నిర్వాహణ కోసం పర్యాటకశాఖతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు ఆరోగ్య, పర్యాటక శాఖ ఉన్నతాధికారులతో సెక్రటేరియట్‌లోని తన చాంబర్‌‌లో మంత్రి సమీక్ష నిర్వహించారు. మెడికల్ టూరిజం అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలు, కలిగే ప్రయోజనాలపై సమావేశంలో చర్చించారు. హైదరాబాద్‌ను ప్రపంచ వైద్య పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేయాలని సీఎం రేవంత్‌రెడ్డి చేసిన సూచనలను ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. ఇకపై ప్రతి సంవత్సరం హైదరాబాద్‌లో కనీసం ఒక మెడికల్ టూరిజం ఈవెంట్‌ను నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారని, ఇందుకు అనుగుణంగా ఈ ఏడాది జూన్‌లో మొదటి ఈవెంట్ నిర్వాహణకు ఏర్పాట్లు చేయాలని ఆరోగ్యశాఖ అధికారులను మంత్రి ఆదేశించారు.

వివిధ దేశాల ప్రతినిధులకు ఆహ్వానం

ఈవెంట్‌లో దేశ, విదేశీ వైద్య, ఫార్మా రంగ ప్రముఖులను భాగస్వాములను చేయాలని మంత్రి సూచించారు. మెడికల్ టూరిజంలో ఉన్న ప్రైవేటు సంస్థలను సైతం ఈవెంట్‌లో భాగస్వామ్యం చేయాలని ఆదేశించారు. ఆఫ్రికా, ఏసియా, మిడిల్ ఈస్ట్‌ తదితర కంట్రీస్ నుంచి ప్రతినిధులను ఆహ్వానించాలని సూచించారు. హైదరాబాద్‌లోని ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటల్స్‌తో పాటు.. నిమ్స్‌, టిమ్స్‌, ఉస్మానియా, గాంధీ వంటి ప్రభుత్వ హాస్పిటళ్ల సందర్శనకు ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్న 3 టిమ్స్ హాస్పిటల్స్‌లో ఇంటర్నేషనల్ పేషెంట్ సర్వీసెస్ విభాగాలను ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. ఒక్కో హాస్పిటల్‌లో 50 బెడ్లతో ఇంటర్నేషనల్ పేషెంట్స్ వార్డు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

దేశ, విదేశాల నుంచి వచ్చే పేషెంట్లతో ప్రభుత్వ హాస్పిటళ్లకు ఆదాయం సమకూరుతుందని, తద్వారా హాస్పిటళ్ల నిర్వాహణ మెరుగుపడి స్థానిక ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందుతాయన్నారు. ఈ సమావేశంలో ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి, డాక్టర్ క్రిస్టినా జడ్ చొంగ్తు, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్, డాక్టర్ సంగీత సత్యానారాయణ, టీజీఎంఎస్‌ఐడీసీ ఎండీ, డాక్టర్ గౌరవ్ ఉప్పల్, ఆరోగ్యశాఖ, పర్యాటక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.