Mahabubabad | ముగ్గురు కొడుకులున్నా.. అనాథగా తల్లి భిక్షాటన

కనిపెంచిన తల్లికి వృద్ధాప్యంలో అండగా నిలవాల్సిన కుమారులు బుక్కెడు బువ్వ కూడా పెట్టకుండా ఆనాధను చేశారు. ఆకలి తీర్చుకునేందుకు స్వగ్రామంలో ఇంటింటికి తిరిగి గ్రామస్తులు పెట్టింది తిని, వారి ఇళ్ల ముందు ఎండావానకు, చలికి అరుగులపైనే పడుకుంటూ రోజులు వెళ్లదీస్తుంది

Mahabubabad | ముగ్గురు కొడుకులున్నా.. అనాథగా తల్లి భిక్షాటన

ఆస్తి తీసుకుని అన్నం పెట్టని సంతానం

విధాత, హైదరాబాద్ : కనిపెంచిన తల్లికి వృద్ధాప్యంలో అండగా నిలవాల్సిన కుమారులు బుక్కెడు బువ్వ కూడా పెట్టకుండా ఆనాధను చేశారు. ఆకలి తీర్చుకునేందుకు స్వగ్రామంలో ఇంటింటికి తిరిగి గ్రామస్తులు పెట్టింది తిని, వారి ఇళ్ల ముందు ఎండావానకు, చలికి అరుగులపైనే పడుకుంటూ రోజులు వెళ్లదీస్తుంది. మహబూబ్‌నగర్‌ జిల్లాలో గార్ల గ్రామానికి చెందిన నర్సమ్మకు ముగ్గురు కుమారులు ఉన్నారు. చిన్నానాటి నుంచి ముగ్గురిని చదవించి, పెద్ద చేసి పెళ్లిళ్లు చేసింది. ముగ్గురు కొడుకులు ఉపాధి నిమిత్తం వేర్వేరు ప్రాంతాలకు వెళ్లడంతో, తల్లి నుంచి ఇల్లు, మూడెకరాల భూమి, బంగారం తీసుకున్నారు.

కాలక్రమంలో ఇల్లు పాడుబడి కూలిపోవడంతో, తల్లిని కొడుకులు ఒంటరిగా వదిలేశారు. ఎన్నిసార్లు చెప్పినా కొడుకులు పట్టించుకోలేదు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన వారు ఫిర్యాదు రశీదు ఇచ్చి చేతులు దులుపుకున్నారే తప్ప ఆమెకు న్యాయం చేయలేదు. దీంతో బుక్కెడు బువ్వ కోసం ముదిమి వయసులో నర్సమ్మ వీధిపాలై ఇప్పుడు భిక్షాటన చేస్తున్నది. తనకు న్యాయం చేయాలని, కాసింత ఆకలి తీరిస్తే చాలని ఆ వృద్ధురాలు ప్రాధేయపడటం పలువురిని కంటతడి పెట్టించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.