మీ ఆడబిడ్డను.. ఆశీర్వదించండి: కాంగ్రెస్ అభ్యర్థి పర్ణిక రెడ్డి

- తాత, తండ్రి ఆశీస్సులతో మీ ముందుకు వచ్చా
- చిట్టెం వారసురాలిగా ఆదరించండి
- కాంగ్రెస్ ఆరు గ్యారంటీ లు పక్కాగా అమలు
- నారాయణ పేట కాంగ్రెస్ అభ్యర్థి పర్ణిక రెడ్డి
- కోయిలకొండ మండలంలో జననీరాజనం
విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రతినిధి: ‘మీ ఆడబిడ్డగా.. చిట్టెం వారసురాలిగా మీ ముందుకు వచ్చా. కాంగ్రెస్ పార్టీ నారాయణ పేట అభ్యర్థిగా బరిలో ఉన్నా. నన్ను అభిమానించి ఆదరించండి. నియోజకవర్గం అభివృద్ధిలో నన్ను భాగస్వామిగా నిలబెట్టండి’ అని నారాయణ పేట కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిట్టెం పర్ణిక రెడ్డి ప్రజలను కోరారు. మంగళవారం కోయిలకొండ మండలంలోని కొతలాబాద్ గ్రామం నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సీనియర్ కాంగ్రెస్ నేత, పర్ణిక రెడ్డి మేనమామ కుంభం శివకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ఎన్నికల ప్రచారానికి గ్రామస్థులు జననీరాజనం పట్టారు.
తొలిసారిగా ఇక్కడి నుంచే ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన పర్ణికకు మహిళలు బొడ్డెమ్మలు, బోనాలతో ఘన స్వాగతం పలికారు. ఈగ్రామం నుంచే ఆమె ఎన్నికల శంఖారావం పూరించారు. గ్రామంలో ర్యాలీ నిర్వహించిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ జిల్లా గడ్డపైనే తాత చిట్టెం నర్సిరెడ్డి, తండ్రి చిట్టెం వెంకటేశ్వర్ రెడ్డిని పోగొట్టుకున్నానని, వారి ఆశీర్వాదం, తన మేనమామ శివకుమార్ రెడ్డి అండతో కాంగ్రెస్ అభ్యర్థిగా ముందుకు వచ్చానని అన్నారు.

తాత, తండ్రి చనిపోయిన బాధ.. మీ అభిమానం చూస్తుంటే కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయన్నారు. నాపై చూపిస్తున్న అభిమానానికి ఏమిచ్చి మీ రుణం తీర్చుకోవాలో అని ఆలోచన వచ్చిందన్నారు. మీ మంచి కోసం.. గ్రామాల అభివృద్ధి కోసం తాను పాటుపడేందుకు వచ్చే ఎన్నికల్లో అవకాశం కల్పించే అధికారం మీకే ఉందని పర్ణిక అన్నారు. నేను రాజకీయాలకు కొత్త వ్యక్తిని అయినా.. తాను రాజకీయ కుటుంబ నేపథ్యంలో పెరిగానన్నారు. చిట్టెం వారసురాలిగా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చిందని, మీ అండతో నన్ను ముందుకు నడిపించాలని గ్రామస్థులను పర్ణిక కోరారు.
అనంతరం శివకుమార్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చిన నా మేనకోడలు పర్ణిక రెడ్డికి మండల ప్రజలు అండగా ఉండాలని కోరారు. ఈనియోజకవర్గంలో గతంలో నన్ను అక్కున చేర్చుకున్నారని, అదేవిధంగా పర్ణికను అభిమానించి ఇక్కడి వారంతా ఆమెకు మద్దతుగా నిలవాలని కోరుతున్నానన్నారు. ప్రజల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీల పథకం ప్రతి ఒక్కరికీ అందేవిధంగా కృషి చేస్తామన్నారు. కోయిలకొండ మండలం ఎంతో వెనకబడిందని, ఈ మండలాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లడంలో ప్రస్తుత పాలకులు విఫలం చెందారన్నారు.
నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న పర్ణికను భారీ మెజారిటీతో గెలిపించాలని శివకుమార్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనంతరం సూరారం, లింగాల్ చెడు, బూరుగుపల్లి తదితర గ్రామాల్లో ప్రచారం చేపట్టారు. ప్రతి గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థికి ప్రజలు భారీఎత్తున స్వాగతం పలికారు. ఈ ప్రచారంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు జీన్గరి రవి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు విద్యాసాగర్, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు రాజు నాయక్, మండల నాయకులు మల్లు సత్యపాల్ రెడ్డి, కొండారెడ్డి, రామునాయక్, యాదవ్ కుమార్, సుధాకర్ రెడ్డి, భారీ సంఖ్యలో గిరిజన నాయకులు పాల్గొన్నారు.