విధాత, హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన ఖరారైంది. మోదీ మే 9వ తేదీన తెలంగాణలో పర్యటించనున్నారు. మూడోసారి ప్రధాని అయిన అనంతరం మోదీ తెలంగాణకు రావడం ఇదే తొలిసారి. ప్రధాని తన పర్యటనలో భాగంగా తెలంగాణలో జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రధాని మోదీ తన పర్యటనలో వేల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఎంఎంటీఎస్ ఫేజ్-2ని ఆయన జాతికి అంకితం చేయనున్నారు. వరంగల్‌లో నిర్మించిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ప్రారంభించడంతో పాటు మరికొన్ని రైల్వే ప్రాజెక్టులను మోదీ ప్రారంభించనున్నట్లుగా సమాచారం. అలాగే బీబీనగర్‌లోని ఎయిమ్స్ ఆస్పత్రిలో కొత్తగా నిర్మించిన విభాగాలను ఆయన ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. వీటితో పాటు పలు జాతీయ రహదారుల నిర్మాణ పనులకు, ఎలివేట్ కారిడార్లకు భూమిపూజ చేస్తారని సమాచారం.మాజీ మంత్రి మల్లారెడ్డి తన యూనివర్సిటీలో ఏఐ డిజిటల్ యూనివర్సిటీ ప్రారంభోత్సవానికి, వందేమాతరం గీతాలాపన కార్యక్రమానికి ప్రధానిని ఆహ్వానించినప్పటికి..ఆ కార్యక్రమానికి మోదీ హాజరవుతారో లేదోనన్నదానిపై స్పష్టత రాలేదు.
మోదీ సభతో జీహెచ్ఎంసీ ఎన్నికలకు పార్టీ సన్నద్దత
ప్రధాని రాకను పురస్కరించుకుని హైదరాబాద్-పరేడ్‌గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ నిర్వహణకు తెలంగాణ బీజేపీ నాయకత్వం ఏర్పాట్లు చేస్తుంది. త్వరలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మూడు కార్పోరేషన్లకు ఎన్నికలు జరుగునున్న నేపథ్యంలో హైదరాబాద్ లో ప్రధాని సభతో ఎన్నికల సన్నాహాలను ఘనంగా చేపట్టాలని రాష్ట్ర బీజేపీ నాయకత్వం భావిస్తుంది. జీహెచ్ఎంసీ కార్పోరేషన్ ఎన్నికల నాటికి తెలంగాణ బీజేపీ నేతల మధ్య ఆధిపత్య పోరును చక్కదిద్దాలని, కేంద్రాన్ని తరుచూ టార్గెట్ చేస్తున్న రేవంత్ సర్కార్ ను, బీఆర్ఎస్ ను ఈ ఎన్నికల్లో ఓడించాలని కమలనాధులు కసరత్తు చేస్తున్నారు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత మోదీ తెలంగాణకు వస్తుండటంతో ఈ సభ ద్వారా రాష్ట్ర బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాలని పార్టీ భావిస్తోంది.
రేవంత్ సర్కార్ పై పోలిటికల్ ఎటాక్..
అదిగాక గత కొంత కాలంగా సీఎం రేవంత్ రెడ్డి, కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదే క్రమంలో రేవంత్ తన నాయకత్వాన్ని పదిలం చేసుకునే క్రమంలో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణను ఏటీఎంగా మార్చారన్న విమర్శలు సైతం ఎదుర్కోంటున్నారు. తాజాగా మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లు వీగిపోవడంలోనూ రేవంత్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. డీలిమిటేషన్ తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందంటూ ఆరోపిస్తూ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనతో బీజేపీ తెలంగాణలోని రేవంత్ సర్కార్ పై ధీటైనా రాజకీయ దాడికి సన్నద్దం అవుతుందన్న ప్రచారం వినిపిస్తుంది.
