నాదర్ గుల్ భూములపై వాటాలు బీఆర్ఎస్ కు..నిందలు మాపైనా? : మంత్రి పొంగులేటి ఫైర్

నాదర్‌గుల్ భూముల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వాటాలు వేసుకుని...ఇప్పుడు మాపై నిందలు వేస్తున్నారంటూ రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. సచివాలయంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్కతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.

విధాత, హైదరాబాద్ : నాదర్‌గుల్ భూముల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వాటాలు వేసుకుని…ఇప్పుడు మాపై నిందలు వేస్తున్నారంటూ రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. సచివాలయంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్కతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. హరీశ్‌ రావు చెబుతున్న భూముల్లో 2022లోనే నిర్మాణాలు ప్రారంభించారని, భూములు పొందిన వారు నాలా కన్వర్షన్ ఇవ్వట్లేదని 2022లోనే సుప్రీంకోర్టుకు వెళ్లారని, వాళ్లు కోర్టుకు వెళ్తే బీఆర్‌ఎస్ ప్రభుత్వం కనీసం కౌంటర్ కూడా దాఖలు చేయలేదు అని పొంగులేటి వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక.. అవి ప్రభుత్వ భూములు అని చెప్పి మేం కౌంటర్ వేశాం అని, ఆనాడు వాటాల ఒప్పందం చేసుకుని భూములు కట్టబెట్టి ఇవాళ మా మీద నిందలు వేస్తున్నారు అని పొంగులేటి మండిపడ్డారు. నాదర్‌ గుల్ భూముల్లో వాటా రాకపోవడంతో హరీశ్‌ రావు ఇవ్వాళ మళ్లీ ఆ సమస్యను తెరపైకి తెచ్చారని ఆరోపించారు.

సర్వే నంబర్ 613లోని భూములను 2014లో మూడు సంస్థలకు అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే రిజిస్ట్రేషన్‌ చేసిందని తెలిపారు. భూముల మ్యుటేషన్‌ జరిగిన 2016లోనూ వారి ప్రభుత్వమే ఉందన్నారు. 2014, 2016లో జరిగిన రిజిస్ట్రేషన్లతో ఈ ప్రభుత్వానికి ఏం సంబంధమని ప్రశ్నించారు. ప్రొహిబిటెడ్ భూముల్లో మా ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేయలేదు అని పొంగులేటి స్పష్టం చేశారు. హరీశ్ రావు చెబుతున్న కంపెనీల్లో నా కుటుంబ సభ్యులెవరూ లేరు. నా కుటుంబ సభ్యులు ఉన్నారని నిరూపించాలని సవాల్ పొంగులేటి సవాల్ చేశారు. వట్టి నాగులపల్లి భూముల్లోనూ హరీశ్ రావు పూర్తిగా దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. కుటుంబ సభ్యుల వివాదాన్ని కూడా ఈ ప్రభుత్వానికి అంటగట్టారు అని మంత్రి పొంగులేటి అసహనం వ్యక్తం చేశారు.

ఎటువంటి ఆధారాలు లేకుండానే వేల కోట్ల అవినీతి జరిగిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారని పొంగులేటి ఆగ్రహం వ్యక్తం చేశారు. సన్నబియ్యం పథకానికి ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి ఓర్వలేక దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. హ్యామ్ రోడ్ల నిర్మాణం పూర్తయితే కాంగ్రెస్ కు పేరు వస్తుందని..బీఆర్ఎస్ ఉనికి కోల్పోతుందన్న భయంతో మంత్రి కోమటిరెడ్డిని, అలాగే మద్యం పాలసీ, టూరిజం పాలసీల విషయంలో మంత్రి జూపల్లి కృష్ణారావును టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. గతంలో వారికి అంటిన బురదను ఇప్పుడు మంత్రులందరికీ పూయాలని చూస్తున్నారని హరీశ్ రావుపై పొంగులేటి ధ్వజమెత్తారు.

Latest News