తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పిన తరువాతనే ఇక్కడ నవ నిర్మాణ సభ పెట్టుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన పవన్ కల్యాణ్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు ఇక్కడే ఎందుకు నవ నిర్మాణ సభ పెడుతున్నారని పొన్నం నిలదీశారు. తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం మానేసినా అని బహిరంగంగా చెప్పిన వెధవ వచ్చి..ఇక్కడ తెలంగాణ పట్ల మొసలి కన్నీరు కారిస్తే ఒప్పుకోబోమన్నారు. తెలంగాణ వాసుల కళ్ల దిష్టి సోకి కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోయాయని పవన్ చెప్పాడని, అటువంటి వ్యక్తి సభకు తెలంగాణ రక్తం ఉన్న ఏ బిడ్డ కూడా వెళ్లరని పొన్నం వ్యాఖ్యానించారు.
ఏపీలో చేయలేదు…ఇక్కడేం చేస్తారు…
ఇది ప్రజాస్వామ్య దేశం అని, తెలంగాణలో ప్రజా ప్రభుత్వం నడుస్తోందని, ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా సభలు సమావేశాలు పెట్టుకోవచ్చు అని పొన్నం అన్నారు. పవన్ కల్యాణ్ సహా ఎవరైనా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటే మాకు అభ్యంతరం లేదు అని, కానీ ఇక్కడ నవ నిర్మాణ సభ పెట్టడాన్నే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని పొన్నం స్పష్టం చేశారు. తెలంగాణ అస్థిత్వం, ఆత్మగౌరవం దెబ్బతీసేలా మాట్లాడిన పవన్ కళ్యాణ్ బీజేపీ ఎజెండా మోస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రపదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఏం చేయలేని వ్యక్తి… ఇక్కడికి వచ్చి నవ నిర్మాణ సభ పెడితే, ఎవరు వినడానికి సిద్దంగా లేరు అని, కన్న తల్లికి గాజులు కొనలేని వాడు, పినతల్లికి ఒడ్డాణం చేయిస్తానన్న సామేత తీరుగా ఆయన తీరు ఉందని, కూట్లో రాయి తీయలేని వాడు..ఎట్లా రాయి తీస్తాడా అని పొన్నం విమర్శించారు.
బీజేపీ రెమ్యూనరేషన్ తోనే తెలంగాణ పవన్ యాక్షన్
వాస్తవంగా పవన్ కళ్యాణ్ సినిమా నటుడని, పైసలు ఇస్తే ఏం నటన చేయమంటే ఆది చేస్తాడనొ పొన్నం విమర్శించారు. తెలంగాణలో విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడి తెలంగాణ వాతావరణాన్ని కలుషితం చేయాలని బీజేపీతో లోపాయికారి ఒప్పందం చేసుకొని పవన్ కళ్యాణ్ ఈ నటన స్టార్ట్ చేశారు అని పొన్నం ఆరోపించారు. బీజేపీ రెన్యుమనేషన్ ఇస్తే ఇక్కడికి రాలేదని కొండగట్టు అంజన్న మీద ప్రమాణం చేసి పవన్ కళ్యాణ్ చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ అభిమానులు సినిమా చూడండని… కానీ మన తెలంగాణ అస్తిత్వం మీద దాడి చేస్తే ఎవరు చూస్తూ ఊరుకోరని స్పష్టం చేశారు. అణువణువునా తెలంగాణ వ్యతిరేకతను నింపుకున్న పవన్ కళ్యాణ్ మొదట తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడిన దానికి క్షమాపణ చెప్పాలన్నారు. పవన్ కళ్యాణ్ తెలలంగాణ ద్వేషి అని, ఇక్కడ విద్వేష రాజకీయాలు చేస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. 2014 లో నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఇక్కడికి వస్తే… తోడుకలు తీస్తాం అని చెప్పడం జరిగిందని గుర్తు చేశారు.
ఏపీలో చూపించండి.. మీ నవ నిర్మాణం
హైదరాబాదులో పవన్ కళ్యాణ్ నవనిర్మాణ సభ పేరు వెనుక ఆంతర్యం ఏమిటీ? బీజేపీకి తెలంగాణను తాకట్టు పెట్టడమే మీరు స్థాపించే నవనిర్మాణమా? అని పొన్నం ప్రశ్నించారు. మీకు ఏపీ ప్రజలు ఆశీర్వదించి అధికారం ఇచ్చారు. అక్కడ చూయించండి మీ నవనిర్మాణం… కూట్లో రాయి తీయకుండా ఏట్లో రాయి తీస్తానని బయలు దేరడం ఎందుకు? అని పొన్నం ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ నవనిర్మాణ సభలు.. బీజేపీ పాలిత గుజరాత్ ,మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ లలో ఎందుకు ఏర్పాటు చేయడం లేదు? అని ప్రశ్నించారు. మీ బాస్ ప్రధాని మోదీ ను మెప్పించడానికి తెలంగాణలో సభ పెడుతున్నారా..? అని నిలదీశారు. తెలంగాణలో సభ ఏర్పాటు చేసి.. నాలుగు రెచ్చగొట్టే మాటలు మాట్లాడాలని, ఇక్కడ జనాలు తన్నుకు చావాలని పవన్ ఆలోచనగా కనిపిస్తుందని, ఇదేనా మీ పవనిజం? అని పొన్నం ప్రశ్నించారు.
బీజేపీ ఎజెంట్ పవన్ రాజకీయం
బీజేపీ డైరెక్షన్ లో తెలంగాణలో విద్వేషాలు రెచ్చగొట్టి వైషమ్యాలు రెచ్చగొట్టేలా చేస్తే ఊరుకోమని అని పొన్నం హెచ్చరించారు. ఇక్కడ బీజేపీ పప్పులు ఉడకక… ఏజెంట్ గా పవన్ కళ్యాణ్ ను ఇక్కడికి పంపిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు చేసిన ఏమీ లేదు. అందుకే ఇక్కడ దొడ్డిదారిన బీజేపీ పవన్ కళ్యాణ్ ను పంపిస్తోందని పొన్నం ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినా, సాటి తెలుగు రాష్ట్రంగా మాకు ప్రేమ ఉంటుందన్నారు. భారతీయులుగా ఇతర రాష్ట్రాలను గౌరవించాలి..అవమాన పరుచుకోవద్దు అని, మాకు అస్సాం కంటే ఆంధ్రప్రదేశ్ దగ్గర.. ఆంధ్రప్రదేశ్ తో సంత్సంబంధాలు ఉండాలని కోరుకుంటాం అని స్పష్టం చేశారు.
వేడుకల తెలంగాణ ఆవిర్బావ దినోత్సవం
రేపు జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అని, దీనిని ప్రతి తెలంగాణ బిడ్డ వేడుకల పండగల జరుపుకుంటాం అని పొన్నం తెలిపారు. తెలంగాణ కోసం పార్లమెంట్ సభ్యుడిగా, సకల జనుల సమ్మె ద్వారా తెలంగాణ కోసం పోరాటం చేశామని గుర్తు చేశారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ,పోరాట యోధులను గుర్తించాలని ప్రభుత్వం కమిటీ వేసి ముందుకు పోతుంది.. వారిని గుర్తించి గౌరవించాలని ప్రభుత్వం కార్యక్రమం చేస్తుందని తెలిపారు.
