Akunuri Murali | మన యూనివర్సిటీలు పల్లీ బఠాణీల?

ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారంలో కేటీఆర్ వ్యాఖ్యలపై రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళీ ఫైర్ అయ్యారు.

Akunuri Murali | మన యూనివర్సిటీలు పల్లీ బఠాణీల?

కేటీఆర్‌పై రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళీ ఫైర్‌
బూమ్‌రాంగ్‌ అవుతున్న కేటీఆర్‌ వ్యాఖ్యలు

విధాత, హైదరాబాద్: ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారంలో బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ బీఆరెస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నలను ఉద్దేశించి ఇటు బిట్స్ పిలానీ..అటు పల్లీ బఠాణీలు ఉన్నారని ఎవరు కావాలో పట్టభద్రులు ఆలోచించుకోండి అంటూ చేసిన వ్యాఖ్యలపై రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళీ ఫైర్ అయ్యారు. కేటీఆర్ వ్యాఖ్యలను ట్విట్టర్ వేదికగా ఆకునూరి మురళీ తీవ్రంగా ఖండించారు.

కేటీఆర్‌కు మన ఉస్మానియా, మన జేఎన్ టీయూ, మన కాకతీయ యూనివర్సిటీలు పల్లీ బఠాణీల లాగా కనపడుతున్నాయా? అని ప్రశ్నించారు. ‘మన యూనివర్సిటీలను అన్నింటిని పల్లీ బఠాణీలను చేసింది నువ్వు.. నీ తండ్రి కదా అంటు మండిపడ్డారు. ఫైనల్ గా మీరు ఒప్పుకున్నారు.. మన యూనివర్సిటీలను ధ్వంసం చేశారని, మన విద్యా వ్యవస్థను ధ్వంసం చేశారని.. ఒక తరంని నాశనం చేశారు కదరా! మిమ్మల్ని ఎప్పటికీ తెలంగాణ సమాజం క్షమించదని విరుచుకపడ్డారు.

అస్సలు బిట్స్ పిలానీ నుండి సొక్కమ్ అని గారంటీ ఇస్తావా? ఈ దేశంలో చదువుకి క్యారెక్టర్ కి సంబంధమే లేదని, 80 వేల పుస్తకాలు చదివిన మహానుభావుని దరిద్రపు పరిపాలనను చూసినం’ అని తీవ్ర స్థాయిలో విమర్శించారు. బీఆరెస్‌ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి బిట్స్ పిలానీలో మాస్టర్స్ చేశారు. భువనగిరి జిల్లాకు చెందిన మల్లన్న ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఏ పొలిటికల్ సైన్స్, జేఎన్టీయూ నుండి ఎంబీఏ చదివారు.

ఈ నేపథ్యంలో కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలు కాస్తా మన యూనివర్సిటీ చదువులను అవమానించేదిగా ఉన్నాయన్న విమర్శలు వ్యక్తమవుతుండగా ఆయన వ్యాఖ్యలు బూమ్‌రాంగ్‌గా మారుతుండటం చర్చనీయాంశమైంది. కేటీఆర్ వ్యాఖ్యలను నిరసిస్తూ ఉస్మానియాలో నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఉస్మానియాలో చదువుకున్న విద్యార్థులను పల్లీ బఠాణీలు అమ్ముకునే వాళ్లని కేటీఆర్ హేళన చేసి మాట్లాడారని ఉస్మానియా విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.