ఆ కేసులు కొట్టివేయండి : హైకోర్టుకు సీఎం రేవంత్ రెడ్డి..కేటీఆర్
తమపై కేసులను రద్దు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ కేటీఆర్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

విధాత, హైదరాబాద్ : తమపై దాఖలైన కేసులను కొట్టివేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) లు వేర్వేరుగా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. 2021లో ఏఐసీసీ పిలుపు మేరకు రాజ్ భవన్ ముట్టడి నిర్వహించిన రేవంత్ రెడ్డిపై పలు సెక్షన్ల కింద సైఫాబాద్ పీఎస్ లో కేసు నమోదయ్యాయి. తనపై నమోదైన ఆ కేసులను కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో రేవంత్ రెడ్డి పిటిషన్ వేశారు. ప్రస్తుతం నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో ఈ కేసు పెండింగ్ లో ఉంది. దీనిపై తాజాగా రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు(HighCourt) తదుపరి విచారణను వచ్చే నెల 7వ తేదీకి వాయిదా వేసింది.
ఇకపోతే కేటీఆర్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్(Banjara Hills Police Station) లో తనపై నమోదైన కేసును కొట్టేయాలనిహైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ నేత సృజన్ ఇచ్చిన ఫిర్యాదుతో..పోలీసులు గతంలో కేటీఆర్‌పై కేసు నమోదు చేశారు. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలంటూ.. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 9వ తేదికి వాయిదా వేసింది.