మోదీ ఇంకా గుజరాతీ గానే ప్రవర్తిస్తున్నారు: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణకు రావాల్సిన పెట్టుబడులను గుజరాత్ కు మళ్లీంచేందుకే నా అమెరికా పర్యటనను కేంద్ర ప్రభుత్వం అడ్డుకుందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. సోమవారం ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతు తన అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించడంపట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.

విధాత, హైదరాబాద్: నరేంద్ర మోదీ ఇంకా గుజరాతీగానే వ్యవహరిస్తున్నారు తప్ప భారత ప్రధాని అనే భావనతో వ్యవహరించడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ అంటే మోదీకి వివక్ష.. చిన్న చూపని, తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు గుజరాతీ నాయకత్వం చేస్తున్న కుట్ర అని అన్నారు. ఇది రేవంత్ రెడ్డికి వ్యక్తిగతంగా జరిగిన అవమానం కాదని, ఇది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు జరిగిన అన్యాయమన్నారు. దీనిని రాజకీయాలకు అతీతంగా అందరూ ఖండించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి పర్యటనను కేంద్రం అడ్డుకోవడం అంటే రాష్ట్రాభివృద్ధిని వ్యతిరేకించడమేనన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి చూస్తోంటే స్పష్టంగా తెలంగాణపై వివక్ష స్పష్టంగా కనిపిస్తోందన్నారు. విదేశాల్లో ఉన్నప్పుడే ఈ అంశంపై స్పందిస్తే తనను దేశద్రోహి అంటారని భావించి తెలంగాణ కు వచ్చిన తరువాతే స్పందిస్తున్నానన్నారు. వికసిత్ భారత్ పేరుతో కేంద్రం పనిచేస్తుండగా, తెలంగాణ రైజింగ్ విజన్ పేరుతో మేము పనిచేస్తున్నామన్నారు. మా ఎంపీలు ఈ అంశాన్ని పార్లమెంటులో ప్రస్తావిస్తారని, రాజ్యసభలో ప్రధాన విపక్ష నేత మల్లికార్జున ఖర్గే లేవనెత్తుతారన్నారు. గుజరాత్ అభివృద్ధికి ఇబ్బంది కలుగుతుందనే తన పర్యటనను కేంద్రం అడ్డుకుందని, ఇది రాజకీయ వివక్ష… తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడమేనని ఆయన విమర్శించారు. మేమంతా కేంద్రం వైఖరిని ముక్త కంఠంతో ఖండిస్తున్నామని, ఇది సమాఖ్య సూర్తికి పూర్తి విరుద్ధమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తన విదేశీ పర్యటనను అడ్డుకోవచ్చు.. తన లక్ష్యాన్ని చేరుకోకుండా అడ్డుకోలేరన్నారు. ఇన్వెస్ట్ తెలంగాణ ఆధ్వర్యంలో భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 ను డిసెంబర్ 8, 9 తేదీల్లో నిర్వహిస్తున్నామని, విద్య, క్రీడల్లో పెట్టుబడులను ఆహ్వానిస్తామని రేవంత్ రెడ్డి అన్నారు.

ఇంగ్లండ్ పర్యటన ముగించుకుని వచ్చిన సందర్భంగా సోమవారం సాయంత్రం బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సహచర మంత్రులతో కలిసి రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ వైఖరి, మోదీ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. తన పర్యటన షెడ్యూల్ పై రాష్ట్ర ప్రభుత్వం సరైన వివరాలు ఇవ్వలేదని మాట్లాడుతున్నారన్నారు. ఇది అధికారిక పర్యటన.. మా కార్యక్రమాలు అన్నీ భారత రాయబార కార్యాలయం పర్యవేక్షణలో జరుగుతాయన్నారు. ఇది చాటు మాటుగా, ప్రైవేటుగా జరిగే వ్యవహారం కాదన్నారు. అన్ని వివరాలను విదేశీ వ్యవహారాల శాఖకు అందించామన్నారు. తన పది రోజుల విదేశాల పర్యటనకు సంబంధించి భారత విదేశాంగ మంత్రిత్వ శాఖకు పూర్తి సమాచారం అందించానన్నారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఇంగ్లాండ్ కు అనుమతి ఇచ్చి అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించిందని ముఖ్యమంత్రి ఖండించారు.

బీజేపీ నేతలు వ్యక్తిగత విమర్శలు…

ఈ విషయంలో కేంద్రం వైఖరిని అందరూ తప్పు పట్టారని, తన పర్యటనను తిరస్కరించడమే కాకుండా బీజేపీ నాయకులు రాజకీయంగా నాపై వ్యక్తిగత ఆరోపణలు చేశారన్నారు. బీజేపీ నాయకులు విచక్షణ కోల్పోయి ప్రభుత్వంపై, అధికారిక పర్యటనపై తప్పుడు ప్రకటనలు చేశారని అసహనం వ్యక్తం చేశారు. కొందరు బీజేపీ నేతలు తన అధికారిక పర్యటనలపై కేంద్రాన్ని తప్పుదోవ పట్టించారన్నారు. బీజేపీ పెద్దల వైఖరిపై రాజకీయ అంశాలను నేను ప్రస్తుతం ప్రస్తావించదలచుకోలేదని, ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అంశమన్నారు. యూఎస్ఏ పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖకు సమర్పించామని, రాజకీయపరమైన నిర్ణయాలతో పర్యటనను తిరస్కరిస్తున్నామని ఇంగ్లండ్ కు వెళ్లిన తరువాత సమాచారం ఇచ్చారన్నారు. ఆ రాజకీయ కారణాలు ఏమిటో ప్రధాని నరేంద్ర మోదీ సమాధానమివ్వాలని డిమాండ్ చేశారు. తన పర్యటనలో దాపరికం లేదని, దాపరికం ఉన్నట్లు విదేశాంగ శాఖ మాట్లాడిందని ఆయన ఆరోపించారు. ఏదైనా దాపరికం ఉందని విదేశాంగ శాఖ భావిస్తే అందుకు కారణాలను స్పష్టంగా వెల్లడించాలని డిమాండ్ చేశారు. సాధారణంగా ఏ అధికారిక విదేశీ పర్యటన జరిగినా ఆయా దేశాల్లోని భారత రాయబార కార్యాలయాల ప్రతినిధులు ప్రతి సమావేశంలో పాల్గొంటారని, ప్రొటోకాల్ ప్రకారం అన్ని సమీక్షించిన తరువాతే నివేదికలను కేంద్రానికి పంపిస్తాయన్నారు. ప్రధాని కి తెలియకుండా, కేంద్రం అనుమతులు లేకుండా సొంతంగా పర్యటనలు చేస్తామా అని ఆయన ప్రశ్నించారు.

ఆగస్టు 17 నుంచి 28 వరకు వైబ్రంట్ గుజరాత్ అని పెట్టుబడుల కోసం అమెరికా, కెనడా పర్యటనకు గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానికి అనుమతించారన్నారు. అక్కడ ర్యాలీలు కూడా చేశారని గుర్తు చేశారు. కానీ తెలంగాణ రైజింగ్ 2047 లో భాగంగా అమెరికాలో పర్యటించాలనుకుంటే తనను అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిజంగా నా విదేశీ పర్యటనలో విషయం లేదనుకుంటే ఇంగ్లాండ్ కు ఎందుకు అనుమతి ఇచ్చారు? అమెరికాకు ఎందుకు తిరస్కరించారు? అనేది తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీ, భారతరత్న బీఆర్ అంబేడ్కర్ ఇంగ్లాండ్ లో చదువుకుని దేశానికి దార్శనికులుగా మారారని కొనియాడారు. ఆర్ధికంగా వెనకబడిన వర్గాల వారు విదేశాల్లో చదువుకునే పరిస్థితి ఉండదని, వారి కోసం విదేశీ చదువులను, క్రీడలను ఇక్కడికి తీసుకురావాలని మేం ప్రయత్నిస్తున్నామన్నారు. విదేశీ వర్సిటీలు మనవద్ధ స్థాపిస్తే, మన విద్యార్థులు ఆ దేశాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు. ఇందుకు విదేశీ పర్యటనలు ఉపయోగపడుతాయని భావించామన్నారు. విద్య, క్రీడలు, పెట్టుబడులు లక్ష్యంగా మా విదేశీ పర్యటన కార్యాచరణ రూపొందించుకున్నామని తెలిపారు. తెలంగాణ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ఒక కార్యాచరణ తీసుకున్నదని రేవంత్ రెడ్డి అన్నారు.

సైద్ధాంతిక విభేధాలు ఉండవచ్చు కానీ…

రాజకీయ పార్టీల మధ్య సిద్ధాంత వైరుధ్యాలు ఉండొచ్చు కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు ఉండాలని ముఖ్యమంత్రి అభిలాషించారు. ప్రస్తుతం కేంద్రంలోని ప్రభుత్వ వైఖరి చూస్తుంటే సత్సంబంధాలను దెబ్బతీసేలా ఉందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు విదేశీ పర్యటనలకు వెళ్లొచ్చు కానీ తెలంగాణ ముఖ్యమంత్రిగా నా పర్యటనను అడ్డుకున్నారన్నారు. కేంద్రం వైఖరితో తెలంగాణకు రావాల్సిన పెట్టుబడులు రాకుండా పోతాయన్నదే మా ఆవేదన తప్ప మరోటి కాదన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం కచ్చితంగా కేంద్రంపై ఒత్తిడి తెస్తామని, రాష్ట్రాల కలయికనే కేంద్ర ప్రభుత్వమని, ఇది భారత దేశ ప్రజాస్వామ్య స్ఫూర్తి అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Latest News