కేరళం ఎన్నికల్లో లెఫ్ట్ ఫ్రంట్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్
కేరళ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి లెఫ్ట్ ఫ్రంట్‌పై సంచలన వ్యాఖ్యలు. తెలంగాణ కమ్యూనిస్టులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో రాజకీయంగా హీట్ పెరిగింది.
విధాత: కేరళం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి లెఫ్ట్ పార్టీలపై చేసిన విమర్శలు అటు కేరళంతో పాటు ఇటు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. రెండు రోజుల కేరళం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి గురవారం సీపీఐ, సీపీఎం లెఫ్ట్ ఫ్రంట్‌ను టార్గెట్ చేసి విమర్శల దాడి సాగించారు. కేరళంలోని అధికార సీపీఐ, సీపీఎం పార్టీల లెఫ్ట్ ఫ్రంట్ కు ఓటు వేస్తే ప్రధాని నరేంద్ర మోదీకి వేసినట్టే అని రేవంత్ సంచలన విమర్శలు చేశారు. అంతేకాకుండా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, నరేంద్ర మోదీకి నీడ లాంటి వాడు అని, వాళ్లిద్దరూ అన్నదమ్ముల లాంటివారు అంటూ విమర్శించారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు రెండు రాష్ట్రాల రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి.
సీపీఐతో తెలంగాణలో పొత్తు పెట్టుకుని ప్రభుత్వం నడుపుతున్నామన్న విషయం మర్చిపోయి రేవంత్ రెడ్డి కేరళంలో కమ్యూనిస్టులను విమర్శించడం ఆయన అవకాశ వాద రాజకీయాలకు నిదర్శనమని లెఫ్ట్ వర్గాలు మండిపడుతున్నాయి. ఖమ్మం వెలుగుమట్లలో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి ఇళ్లు కూల్చిన అంశంపై పినరయి విజయన్ ఇటీవల విమర్శలు చేసినదానికి కౌంటర్ గా సీఎం రేవంత్ రెడ్డి కేరళం ఎన్నికల్లో ఆయనపై విమర్శల దాడి చేసినట్లుగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
రేవంత్ వ్యాఖ్యలపై తెలంగాణ కమ్యూనిస్టుల గరంగరం
కేరళం అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్టులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన విమర్శలపై తెలంగాణ సీపీఐ, సీపీఎం పార్టీలు మండిపడ్డాయి. సీపీఎం రాష్ట్ర పార్టీ కార్యదర్శి జాన్ వెస్లీ, సీపీఐ కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు లు ఘాటుగా స్పందించారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఇండియా కూటమి ఐక్యతను దెబ్బతీసేలా ఉన్నాయని మండిపడ్డారు. సీఎం పినరయి విజయన్ ను లక్ష్యంగా చేసుకుని వ్యక్తిత్వ హనానికి పాల్పడవద్దని హితవు పలికారు. కేరళ ప్రజలు విద్యావంతులు. అన్ని విషయాలు ఆలోచిస్తారు. అక్కడ జరిగేటటువంటి ఎన్నికల్లో యూడీఎఫ్ కు తగిన గుణపాఠమే చెప్తారని ఆశిస్తున్నామని తెలిపారు. కేరళ రాష్ట్రం సామాజిక న్యాయం విషయంలో, మత సామరస్యం విషయంలో అట్లాగే సంక్షేమ పథకాల అమలు విషయంలో, విద్య, వైద్యం అందుబాటులో ఉండే విషయంలో, ఉపాధి అవకాశాలు కల్పించే విషయంలో దేశంలోనే ముందున్న పరిస్థితి ఉందని గుర్తు చేశారు. ప్రజలు తగిన పద్ధతిలోనే అక్కడ ఎల్‌డీఎఫ్ కు అండగా నిలబడతారని , మతోన్మాద శక్తుల్ని, అట్లాగే దోపిడీ వర్గాలకు అనుకూలంగా ఉన్న కాంగ్రెస్ యూడీఎఫ్ పార్టీని ఓడించే విధంగా ప్రజలు ఓట్లు వేస్తారని ఆశిస్తున్నాం అన్నారు. కేరళంలో లెఫ్ట్ ప్రభుత్వాన్ని విమర్శించేముందు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల అమలు సంగతేమిటో రేవంత్ రెడ్డి ఆలోచించుకోవాలని హితవు పలికారు.
ఇవి కూడా చదవండి :
HAM Roads Scam : హ్యామ్ మోడల్ కాదు.. కాంగ్రెస్ స్కామ్ మోడల్!
ఆలేరు నియోజకవర్గంలో కాళేశ్వరం జలాల సందడి!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram