Telangana Legislative Assembly | కేసీఆర్ సత్యహరిశ్చంద్రుడే.. నీలాగా చంద్రుడికి సంచులు మోయలేదు.. రేవంత్ రెడ్డికి జగదీశ్ రెడ్డి చురకలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎప్పటికీ సత్యహరిశ్చంద్రుడే అని స్పష్టం చేశారు.

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎప్పటికీ సత్యహరిశ్చంద్రుడే అని స్పష్టం చేశారు. నీలాగా సంచులు మోసే చంద్రుడు కాదని రేవంత్ రెడ్డికి జగదీశ్ రెడ్డి చురకలంటించారు. శాసనసభలో విద్యుత్ పద్దులపై చర్చ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. కేసీఆర్, మీరు సత్యహరిశ్చంద్రులు అయితే ఎందుకు విద్యుత్ జ్యుడిషియల్ కమిషన్‌కు అడ్డు వస్తున్నారని ప్రశ్నించారు. దీనిపై జగదీశ్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.
విద్యుత్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం దొంగతనం దొరికిపోయింది కాబట్టే రేవంత్ రెడ్డి ఎందుకు భుజాలు తడుముకుంటున్నారని జగదీశ్ రెడ్డి నిలదీశారు. మా అధినేత కేసీఆర్ హరిశ్చంద్రుడే. రేవంత్ రెడ్డిలా సంచులు మోసే చంద్రుడు కాదు.. చంద్రుడికి సంచులు మోసి జైలుకు పోయింది రేవంత్ రెడ్డినే అని జగదీశ్ రెడ్డి గుర్తు చేశారు.
నేను విద్యుత్ విషయంలో నిజనిజాలు మాట్లాడుతుంటే.. రేవంత్ రెడ్డినే వడివడిగా సభలోకి వచ్చి నాకు అడ్డు తగిలారు. సీఎం సభలో అడుగు పెట్టగానే తప్పుదోవ పట్టింది. కేసీఆర్ కాలు గోటికి మీరు సరిపోతారా..? కేసీఆర్ గురించి మాట్లాడింది రికార్డుల నుంచి తొలగించండి.. సభను హుందాగా నడిపించాలి. సభలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల మీరు ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నట్లు అని జగదీశ్ రెడ్డి అధికారపక్షాన్ని నిలదీశారు.