విధాత, హైదరాబాద్ : ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఆదివారం ఉదయం సీఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. కర్ణాటక బీదర్ వెళ్లే క్రమంలో ఖర్గే శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నోవాటెల్ హోటల్‌లో బస చేశారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ లు నోవాటెల్ వెళ్లి ఖర్గేతో గంటన్నర పాటు సమావేశం అయ్యారు. ఈ భేటీలో వారంతా ఖర్గేతో ఏం చర్చించారన్నదానిపై పోలిటికల్ సర్కిల్ లో రకరకాల చర్చలు సాగుతున్నాయి.
రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు,ఎ స్ఐఆర్ సహాప్రభుత్వ కార్యక్రమాలపై ఈ భేటీలో చర్చించినట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు పూర్తి కావడం..జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం వేళ చేపట్టనున్న ప్రభుత్వ పథకాలు వంటి భవిష్యత్ కార్యక్రమాలపై చర్చించారని సమాచారం. అలాగే కేబినెట్ విస్తరణ, కొందరు మంత్రుల మార్పు, మరికొందరి మంత్రులు శాఖల మార్పులు వంటి విషయాలపై చర్చించినట్లుగా తెలుస్తుంది. రేవంత్ రెడ్డి ఈ వారంలోనే రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ తో కేబినెట్ విస్తరణపై చర్చించి.. జూన్ రెండోవారంలో కేబినెట్ విస్తరణ చేపడుతారని తెలుస్తోంది.
