విధాత, హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికుల సమ్మెలో విషాదం నెలకొంది. నిన్న ఆత్మహత్య యత్నం చేసుకున్న నర్సంపేట ఆర్టీసీ డిపో డ్రైవర్ కోలా శంకర్ గౌడ్ ఆసుపత్రితో చికిత్స పొందుతూ మరణించాడు. అంత్యక్రియల నిమిత్తం శంకర్‌గౌడ్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులు నర్సంపేట ముత్తోజిపేటకు చేర్చారు. నిన్న ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు నర్సంపేట ఆర్టీసీ కార్మికులు నిర్వహించిన మహాధర్నా సందర్బంగా బస్టాండ్ ఆవరణలో శంకర్ గౌడ్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. 90శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
డ్రైవర్ శంకర్‌గౌడ్ బలిదానంతో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉద్రిక్తతగా మారింది. కార్మికుల సమ్మెకు మద్దతుగా బీఆర్ఎస్, బీజేపీలు నర్సంపేట పట్టణ బంద్‌కు పిలుపునిచ్చాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్ సహా బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు నర్సంపేటకు చేరుకోనుండటంతో నర్సంపేటలో పోలీసులు భారీగా మోహరించారు.
ముగ్గురు ఆత్మహత్య ప్రయత్నాలు ..ఒకరి మృతి
రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ఒక రోజునే ముగ్గురు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య యత్నం చేసుకోగా..అందులో శంకర్ గౌడ్ మరణించారు. నిన్న నల్లగొండలోనూ ఆర్టీసి కార్మికుడు రావుల వెంకన్న ఆత్మహత్య యత్నం, భద్రాచలంలో లింగారెడ్డి ఆత్మహత్య యత్నం చేసి ఆసుపత్రి పాలు కావడం కలకలం రేపింది.
ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌గౌడ్ మృతిపట్ల సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి
ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌గౌడ్ మృతిపట్ల సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శంకర్‌గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఆ కుటుంబాన్ని దుఃఖసాగరంలో ముంచిందంటూ సీఎం తీవ్ర విచారం వెలిబుచ్చారు. ఆర్టీసీ కార్మికులు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోద్దని సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు.
నిరసనలకు ఆర్టీసీ జేఏసీ పిలుపు
డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్యతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ముగ్గురు కార్మికులు ఆత్మహత్య యత్నం చేయడం పట్ల ఆర్టీసీ జేఏసీ సీరియస్ అయ్యింది. ఈ ఘటనలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ అన్ని డిపోల ఎదుట నిరసనలకు పిలుపునిచ్చింది. అలాగే శంకర్ గౌడ్ అంత్యక్రియలకు హాజరుకావాలని నిర్ణయించింది. అయితే వారిని పోలీసులు అడ్డుకునే అవకాశం కనిపిస్తుంది.
చర్చలపై జేఏపీ తర్జన భర్జన
మరోవైపు ప్రభుత్వం ఈ రోజు ఆర్టీసీ జేఏసీతో చర్చలకు ఆహ్వానించిన నేపథ్యంలో చర్చలకు వెళ్లాలా వద్దా అన్న అంశంపై జేఏసీ నాయకులు కసరత్తు చేస్తున్నారు. కార్మికుల ఆత్మహత్య నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె ఉద్రిక్తత స్థాయికి చేరుకోగా పోలీసులు అంతటా భారీ బందోబస్తు చేపట్టారు.
