తహశీల్ధార్ సుచరిత నివాసంలో భారీగా అక్రమాస్తులు!

తెలంగాణలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో సస్పెండ్ అయిన శామీర్ పేట తహశీల్దార్ & జాయింట్ సబ్-రిజిస్ట్రార్ తుమ్మకొమ్మ సుచరిత నివాసంలో ఏసీబీ జరిపిన సోదాల్లో భారీగా అక్రమాస్తులను గుర్తించారు. సోదాల్లో గుర్తించిన మొత్తం ఆస్తులు రూ.5.05 కోట్లు అని, పత్రాల్లో ఉన్న విలువ కంటే ఈ స్థిరాస్తుల మార్కెట్ విలువ గణనీయంగా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఏసీబీ చెబుతోంది.

విధాత, హైదరాబాద్ : తెలంగాణలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో మరో అధికారి చిక్కారు. ఈసారి ఒక మహిళా అధికారి అక్రమాస్తుల కేసులో వార్తల్లో నిలిచారు. సస్పెండ్ అయిన శామీర్ పేట తహశీల్దార్ & జాయింట్ సబ్-రిజిస్ట్రార్ తుమ్మకొమ్మ సుచరిత నివాసంలో ఏసీబీ జరిపిన సోదాల్లో భారీగా అక్రమాస్తులను గుర్తించారు. 2026 మే నెలలో స్థానిక రైతులకు చెందిన 30 ఎకరాలను వ్యవసాయేతర భూమిగా మార్చేందుకు సుచరిత రూ.30 లక్షలు డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో మే 26న తొలివిడత కింద రూ.2 లక్షల సొమ్మును ప్రైవేటు డ్రైవర్‌ ద్వారా తీసుకుంటుండగా పట్టుబడ్డారు. దీంతో సుచరితను ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఆమెపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు ఇదే కేసులో గురువారం మరోసారి విస్తృత తనిఖీలు చేపట్టారు.

సోదాల్లో గుర్తించిన మొత్తం ఆస్తులు రూ.5.05 కోట్లు అని, పత్రాల్లో ఉన్న విలువ కంటే ఈ స్థిరాస్తుల మార్కెట్ విలువ గణనీయంగా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఏసీబీ చెబుతోంది. సోదాలలో సిద్దిపేట జిల్లా దామరకుంట గ్రామంలో 2.17 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్‌లో 3 ఫ్లాట్లు, కీసర మరియు ఖానామెట్ గ్రామాల్లో 2 ప్లాట్లు, రూ.12 లక్షల నగదు, వోక్స్‌వ్యాగన్ కారు, హ్యుందాయ్ క్రెటా కారు, సుమారు రూ.1.20 కోట్ల విలువైన బంగారం & వజ్రాల ఆభరణాలు, బ్యాంకు ఖాతాలో దాదాపు రూ.38 లక్షల నగదు గుర్తించారు.

Latest News