Sheep | హైద‌రాబాద్‌లో భారీగా పెరిగిన గొర్రెల ధ‌ర‌లు..! ఎందుకో తెలుసా..?

Sheep | రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ మ‌హా న‌గ‌రంలో గొర్రెలు, మేక‌ల‌ ధ‌ర‌లు భారీగా పెరిగిపోయాయి. దీంతో మ‌ట‌న్ షాపు నిర్వాహ‌కుల‌తో పాటు గొర్రెలు, మేక‌ల వ్యాపారులు ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు.

  • By: raj |    telangana |    Published on : May 26, 2026 9:10 AM IST
Sheep | హైద‌రాబాద్‌లో భారీగా పెరిగిన గొర్రెల ధ‌ర‌లు..! ఎందుకో తెలుసా..?

Sheep | హైద‌రాబాద్ : రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ మ‌హా న‌గ‌రంలో గొర్రెలు, మేక‌ల‌ ధ‌ర‌లు భారీగా పెరిగిపోయాయి. దీంతో మ‌ట‌న్ షాపు నిర్వాహ‌కుల‌తో పాటు గొర్రెలు, మేక‌ల వ్యాపారులు ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. బ‌క్రీద్ పండుగ నేప‌థ్యంలోనే గొర్రెల ధ‌ర‌లు భారీగా పెరిగిపోయాయ‌ని జియగూడ‌లోని గొర్రెల మార్కెట్ నిర్వాహ‌కులు పేర్కొంటున్నారు.

ఇత‌ర రాష్ట్రాల నుంచి దిగుమ‌తి

తెలంగాణ‌లో గొర్రెలు, మేక‌ల ఉత్ప‌త్తి సరిప‌డా మోతాదులో లేక‌పోవ‌డ‌మే ధ‌ర‌ల పెరుగుద‌లకు కార‌ణ‌మ‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. మ‌హారాష్ట్ర‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, క‌ర్ణాట‌క‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్, గుజ‌రాత్ నుంచి మేక‌ల‌ను, గొర్రెల‌ను దిగుమ‌తి చేసుకుంటుకున్నారు వ్యాపారులు. ఇక న‌గ‌రంలో అధిక ధ‌ర‌ల‌కు విక్ర‌యిస్తూ సామాన్యుల‌ను సొమ్ము చేసుకుంటున్నారు.

గొర్రె ధ‌ర రూ. 14 వేల‌కు పైగా

ప్ర‌ధానంగా బ‌క్రీద్ ప‌ర్వ‌దినం రోజున ముస్లింలు భారీ స్థాయిలో గొర్రెలు, మేక‌ల‌ను బ‌లిస్తారు. మూడు రోజుల పాటు ఈ ప‌ర్వ‌దినాన్ని నిర్వ‌హించ‌డంతో పాటు ఆ రోజుల్లో మూగ‌జీవాల‌ను బ‌లిస్తారు. ఈ క్ర‌మంలోనే గొర్రెల‌కు, మేక‌ల‌కు భారీ డిమాండ్ పెరిగింది. దాంతో ధ‌ర‌లు కూడా పెరిగాయి. ప్ర‌స్తుతం 12 కిలోల మాంసం ప‌డే గొర్రె ధ‌ర రూ. 14 వేల‌కు పైగా ఉంద‌ని జియ‌గూడ మార్కెట్‌లోని క‌మిష‌న్ ఏజెంట్ షంషుద్దీన్ తెలిపాడు.

బ‌క్రీద్‌కు ఏడాది వ‌య‌సున్న గొర్రెలు, మేక‌లు బ‌లి

వాస్త‌వానికి బ‌క్రీద్‌కు ఏడాది వ‌య‌సున్న గొర్రెలు, మేక‌ల‌ను బ‌లిస్తారు. అంటే 10 నుంచి 12 కిలోల మాంసం ఉత్ప‌త్తి అయ్యే గొర్రెల‌ను కొనుగోలు చేస్తుంటారు. కొన్ని కుటుంబాలు అయితే 25 నుంచి 30 కేజీల బ‌రువున్న గొర్రెల‌ను, మేక‌ల‌ను కూడా కొనుగోలు చేస్తుంటారు. దీని ధ‌ర రూ. 30 వేల వ‌ర‌కు ఉంటుంది.

జోరుగా గొర్రెలు, మేక‌ల విక్ర‌యాలు 

మొత్తానికి బ‌క్రీద్ పండుగ నేప‌థ్యంలో న‌గ‌రంతో పాటు శివార్ల‌లో అనేక గొర్రెల, మేక‌ల దుకాణాలు వెలిశాయి. జ‌ల్‌ప‌ల్లి, టోలిచౌకీ, చంచల్‌గూడ‌, నాన‌ల్ న‌గ‌ర్, మెహిదీప‌ట్నం, ముషీరాబాద్, గోల్నాక‌, ఫ‌ల‌క్‌నుమా, ఖిలావ‌త్, చాంద్ర‌య‌ణ‌గుట్ట‌, బంజారాహిల్స్, జ‌హీరా న‌గ‌ర్, బోర‌బండ‌, కిష‌న్ బాగ్, అజాంపుర‌, ఏసీ గార్డ్స్ వంటి ప్రాంతాల్లో గొర్రెలు, మేక‌ల విక్ర‌యాలు జోరుగా కొన‌సాగుతున్నాయి.

మూడు భాగాలుగా మేక‌, గొర్రె మాంసం

అయితే ప్ర‌తి గొర్రె, మేక మాంసాన్ని మూడు భాగాలు చేస్తారు. ఒక భాగాన్ని స్నేహితులు, బంధువులకు, మ‌రో భాగాన్ని పేద‌ల‌కు పంచి పెడుతారు. మిగిలిన భాగాన్ని కుటుంబ స‌భ్యులే వండుకుంటారు.