CM Revanth Reddy | లక్షలాది యువతకు ఉపాధి లక్ష్యంగా స్కిల్ యూనివర్సిటీ శాసన సభలో : సీఎం రేవంత్‌రెడ్డి

లక్షలాది మంది యువతకు ఉపాధి లక్ష్యంగా వారిని నిపుణులగా తీర్చిదిద్దేందుకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కోన్నారు.

CM Revanth Reddy | లక్షలాది యువతకు ఉపాధి లక్ష్యంగా స్కిల్ యూనివర్సిటీ శాసన సభలో : సీఎం రేవంత్‌రెడ్డి

యూనివర్శిటీలో 17 స్కిల్‌ కోర్సులు
తొలి ఏడాది ఆరు కోర్సులు..2వేల మందికి శిక్షణ
ఎస్సీ వర్గీకరణపై సుప్రీం తీర్పు హర్షనీయం
బీఆరెస్ సభ్యులకు దేవుడు జ్ఞానాన్ని ప్రసాదించాలి
దొర పన్నిన కుట్రలో మా అక్కలు బందీ అయ్యారు
అక్కల క్షేమం కోరే చెబుతున్నా… వాళ్ల ఉచ్చులో పడొద్దు
సొంత చెల్లెల్ని జైల్లో పెట్టినా ఢిల్లీ వెళ్లి రాజకీయ ఒప్పందం చేసుకున్న నీచులు వాళ్లు
శాసన సభలో సీఎం రేవంత్‌రెడ్డి

విధాత, హైదరాబాద్‌ : లక్షలాది మంది యువతకు ఉపాధి లక్ష్యంగా వారిని నిపుణులగా తీర్చిదిద్దేందుకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కోన్నారు. గురువారం స్కిల్ యూనివర్సిటీ బిల్లు చర్చలో ఆయన మాట్లాడారు. యంగ్ ఇండియా పత్రిక నడిపిన జాతిపిత మహాత్మగాంధీ స్పూర్తితో యూనివర్సిటీని ఏర్పాటు చేసుకోబోతున్నామన్నారు. లక్షలాదిమంది యువతకు ఉపాధి కల్పించడమే స్కిల్స్ యూనివర్సిటీ ఉద్దేశమని చెప్పాలరు. ఆనాడు జవహర్ లాల్ నెహ్రూ పంచవర్ష ప్రణాళికలు తీసుకొచ్చి.. వ్యవసాయం, విద్యకు ఎంతో ప్రాధాన్యతనిచ్చారని,రెసిడెన్షియల్ స్కూల్స్ అందుబాటులోకి తెచ్చారని, ఇందిరాగాంధీ చదువుకునే విద్యార్థులకు స్కాలర్ షిప్స్ ఇచ్చి ప్రోత్సహించారని, రాజీవ్ గాంధీ దేశానికి సాంకేతికతను, కంప్యూటర్ విద్యను అందుబాటులోకి తీసుకొచ్చారన్నారు. హైదరాబాద్ లో ఐటీ రంగ అభివృద్ధికి ఆనాడు రాజీవ్ గాంధీ పునాదులు వేశారని, ప్రపంచంలో మార్పులకు అనుగుణంగా మన విధానాల్లో మార్పులు రావాల్సిన అవసరం ఉందని, ప్రపంచంలో నైపుణ్యం ఉన్నవారి కొరత ఉందని,వృత్తి నైపుణ్యం లేకపోవడం వల్ల నిరుద్యోగం పెరుగుతోందన్నారు. అందుకే అందరికీ అన్ని రకాల నైపుణ్యాలను అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేబోతున్నామని స్పష్టం చేశారు. స్కిల్స్ 17 కోర్సులను యూనివర్శిటీలో ప్రవేశపెట్టనున్నామని, కోర్సు పూర్తి చేసిన వారికి సర్టిఫికేట్స్ అందించాలని నిర్ణయం తీసుకున్నామని, ఏడాదికి రూ.50వేలు నామ మాత్రపు ఫీజుతో కోర్సుల శిక్షణ అందించనున్నామని తెలిపారు. అవసరమైతే ఎస్సీ,ఎస్టీ,ఓబీసీ పిల్లలకు ఫీజు రీయింబర్స్ మెంట్ ద్వారా ఉచితంగా శిక్షణ వసతి కల్పిస్తామన్నారు. ఇవాళ సాయంత్రం స్కిల్స్ యూనివర్సిటీకి భూమిపూజ చేసుకోబోతున్నామని, అందరు రావాలని కోరారు. ఈ సంవత్సరం 6 కోర్సులకు రెండువేల మందికి అడ్మిషన్స్ కు అవకాశం ఇస్తున్నామన్నారు. శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చేందుకు కొన్ని సంస్థలు ముందుకు వచ్చాయని, భవిష్యత్ లో జిల్లాల్లోనూ కళాశాలలు ఏర్పాటు చేసి శిక్షణ ఇచ్చే ఆలోచన చేస్తున్నామని తెలిపారు.

స్కిల్ యూనివర్సిటీ బిల్లుపై చర్చను బీఆరెస్ అడ్డుపడాలనుకుంది

బీఆరెస్ నేతలకు రాజకీయ ప్రయోజనం తప్ప.. ప్రజల ప్రయోజనం పట్టడం లేదని, రైతు రుణమాఫీపై చర్చ జరగకూడదని బీఆరెస్ నేతలు ఆడబిడ్డలను అడ్డం పెట్టుకుని, అక్కలను అడ్డం పట్టుకుని రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. స్కిల్స్ యూనివర్సిటీపై చర్చ జరగకూడదని అడ్డుకోవాలని చూశారన్నారు. స్కిల్స్ యూనివర్సిటీపై ప్రధాన ప్రతిపక్ష నాయకులు సూచనలు ఇస్తే సంతోషించేవాళ్లమని, కానీ ప్రధాన ప్రతిపక్షం వాకౌట్ చేసి వెళ్లిపోయిందని విమర్శించారు. ప్రతిపక్ష నేత సభకు రాలేదు.. వచ్చిన వారు వాకౌట్ చేసి వెళ్లిపోయారన్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టులో ఉద్దండులైన న్యాయవాదులతో వాదించేలా కృషి చేశామన్నారు. వర్గీకరణకు అనుకూలంగా సుప్రీం తీర్పునిచ్చిన సందర్భంగా దళిత బిడ్డలు సంతోషపడే రోజు వస్తే వారికి తోడుగానిలబడాల్సిన అవసరం ఉందని, కాని ఈ రోజు బీఆరెస్ సభ్యులు వాకౌట్ చేశారని, అందుకే వాళ్ల నుంచి ఏమైనా ఆశిస్తే.. కుక్క తోక పట్టుకుని గోదారి ఈదినట్టేనని, వాళ్లకు దేవుడు జ్ఞానం ప్రసాదించాలని కోరుకుంటున్నానన్నారు.

అక్కల క్షేమం కోరే చెబుతున్నా… వాళ్ల ఉచ్చులో పడొద్దు

శాసన సభలో బీఆరెస్ ఎమ్మెల్యేలైన సబిత, సునితలను అవమానించేలా మాట్లాడినట్లుగా బీఆరెస్ రాజకీయ విమర్శలు చేస్తుందని, ఆ అక్కలను నేను నా సొంత అక్కలుగానే భావించానని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఒక అక్క నన్ను పార్టీలోకి రమ్మని నడిబజారులో వదిలేసి వెళ్లిపోయినప్పటికి నేను ఈ రోజు వరకు ఏం అనలేదని, ఇంకో అక్క ఎన్నికల ప్రచారం కోసం నేను వెళితే రెండు క్రిమినల్ కేసులపాలయ్యాయని, వారు మాత్రం మంత్రులు, ఎమ్మెల్యేలు, మహిళా చైర్ పర్సన్ పదవులు తెచ్చుకున్నారన్నారు. అరే తమ్ముడు నా ఎన్నికల కోసం వచ్చాడని ఆయనపై కేసులు తీయమని చెప్పలేదని, అయినా నేనేమి అనలేదన్నారు. దొర పన్నిన కుట్రలో మా అక్కలు బందీ అయ్యారని, అక్కల క్షేమం కోరే చెబుతున్నానని.. అక్కా మీరు వాళ్ల ఉచ్చులో పడొద్దని కోరారు. సొంత చెల్లెల్ని జైల్లో పెట్టినా ఢిల్లీ వెళ్లి రాజకీయ ఒప్పందం చేసుకున్న నీచులు వాళ్లని, వాళ్లను నమ్ముకున్న సొంత చెల్లెలు తిహార్ జైల్లో ఉందని, మమ్మల్ని లోపలెయ్యకు మా చెల్లెల్ని కావాలంటే ఇంకో ఏడాది జైల్లో పెట్టండని ఢిల్లీకి వెళ్లి మాట్లాడుకున్న నీచులని విమర్శించారు. ఈ తమ్ముడిని నమ్ముకున్న అక్కలు మంత్రులై ఈ సభలో ఉన్నారన్నారు. ఆ దిక్కుమాలిన తమ్ముడిని నమ్ముకున్న చెల్లెలు తీహార్ జైల్లో ఉందన్నారు. మా కుటుంబ సభ్యురాలని చెప్పిన మంత్రి సీతక్కపై సోషల్ మీడియాలో అవమానించేలా మీమ్స్ పెడుతున్నారని, వాటిని చూస్తే మీరే(స్పీకర్‌) చెప్పు తీసుకుని కొడుతారన్నారు. సీతక్కపై సోషల్ మీడియాలో మీమ్స్ పెట్టడం ఆదివాసీ ఆడబిడ్డను అవమానించినట్లు కాదా? అని ప్రశ్నించారు.

దళితుడు స్పీకర్‌గా ఉన్నాడని మీ ముందు కింద కూర్చో కూడదనే కేసీఆర్ సభకు రావడంలేదని, దళిత బిడ్డను మైక్ అడుక్కునే పరిస్థితి కాంగ్రెస్ తీసుకొచ్చిందన్నారు. కేసీఆర్ కు రాజకీయ జీవితం ఇచ్చిందే కాంగ్రెస్ అని, హరీష్ రావును మంత్రి చేసింది కాంగ్రెస్ కాదా? అని గుర్తు చేశారు. మైక్ ఇస్తే శాపనార్థాలు.. ఇవ్వకపోతే పోడియం దగ్గర నిరసనలు చేస్తున్నారని బీఆరెస్ సభ్యుల వైఖరిపై మండిపడ్డారు. బీఆరెస్ వాళ్లకంటే ప్రజాస్వామ్య యుతంగా మేం సభను నడిపామని చెప్పారు. నన్ను గతంలో సభలో మాట్లాడినివ్వకుండా బయటకు పంపించారని, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌ల శాసన సభ్యత్వం రద్దు చేశారని, బిల్లులను గిలెటిన్ చేసుకుని పాస్ చేసుకున్నారని గుర్తు చేశారు. చెడ్డోన్ని పదిచ్చి వదిలించుకోవాలని మంచోడిని పదిచ్చి కొనుక్కోవాలని, అందుకే మా అక్కలకు చెబుతున్నానని, మీరు బయటోళ్లు కాదని, మా కుటుంబ సభ్యులని, మా అక్కల క్షేమం కోరి చెబుతున్నానని, వాళ్లను నమ్ముకోవద్దని, నేను గ్రామీణ ప్రాంతంలో ఉమ్మడి కుటుంబంలో నుంచి వచ్చానని, నాకు అక్కా చెల్లెళ్లు ఉన్నారని, అక్కలను అవమానించే నీచమైన జాతీ కాదన్నారు. నేనయితే చెల్లెలు జైల్లో ఉంటే రాజకీయాల కోసం బజారులో తిరిగేటోన్ని కాదన్నారు. దళిత సోదరులకు వర్గీకరణ తీర్పు వచ్చిన శుభదినాన మా అక్కలు వారికి శుభాక్షాంక్షలు చెప్పివుంటే వారికి కూడా అక్కలుగా ఉండేవారన్నారు. దొర పన్నిన కుట్రలో చిక్కి బయటకు రాకుండా లోపల ఉండకుండా మా అక్కలు మధనపడుతున్నారని, మీకున్న పరిచయాలతో మా అక్కలకు దారిచూపించాలని స్పీకర్‌ను రేవంత్‌రెడ్డి కోరారు. కుక్క తోక మాదిరిగా బీఆరెస్ సభ్యుల వ్యవహారం ఉందని, మైక్ ఇవ్వనంత సేపు మైక్ కావాలని లొల్లి పెట్టి, ఇచ్చాకా వాకౌట్ చేసి వెళ్లిపోయారని విమర్శించారు.