మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంత్ చారి తల్లి కాసోజు శంకరమ్మకు ఎట్టకేలకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఓ పదవి దక్కింది. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ మహిళా కమిషన్ సభ్యురాలిగా కాసోజు శంకరమ్మను నియమించింది. ఈ నియామకంతో తెలంగాణ ఉద్యమ కుటుంబాలకు ప్రభుత్వం గౌరవం ఇచ్చినట్లయిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
చైర్ పర్సన్ గా గద్వాల విజయలక్ష్మితో పాటు ఆరుగురు కమిషన్ సభ్యులను కూడా ప్రభుత్వం నియమించింది. వీరంతా బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి ఐదేళ్ల పాటు పదవిలో కొనసాగుతారని జీవోలో ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ మనవరాలు చిట్యాల శ్వేత, కాసోజు శంకరమ్మ, శశికళ యాదవ్ రెడ్డి, సదాలక్ష్మి, రాధాభాయి, ఉజ్మా షకీరాలను కూడా తెలంగాణ ప్రభుత్వం నియమించింది. వివిధ సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించేలా ఈ నియామకాలు చేపట్టినట్లు తెలుస్తోంది.
తెలంగాణ రాష్ట్ర సాధన మలిదశ ఉద్యమంలో భాగంగా 2009లో ఆత్మత్యాగం చేసిన శ్రీకాంత్ చారి తల్లిగా శంకరమ్మ తనకు తగిన గుర్తింపును ఇవ్వాలంటూ బీఆర్ఎస్ ఉన్నన్నాళ్లు తరచు గొంతెత్తింది. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పొడిచేడు గ్రామానికి చెందిన శంకరమ్మ గతంలో టీఆర్ఎస్ నాయకత్వం 2014 అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్ నగర్ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయించింది. స్థానికేతరులైన శంకరమ్మకు(45,955ఓట్లు), పార్టీకి కూడా స్థానికంగా పార్టీకి తగిన బలం లేకపోవడంతో పాటు సీనియర్ నాయకుడైన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(69,879) చేతిలో ఓటమిపాలైంది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో తనకు మరోచోటి నుంచి ఎమ్మెల్యే టికెట్ లేదా ఎమ్మెల్సీ ఇవ్వాలని, నామినేటెడ్ పోస్టు కావాలని కోరినప్పటికి శంకరమ్మను బీఆర్ఎస్ నాయకత్వం పట్టించుకోలేదు. ఓ సారి ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. కేసీఆర్ ప్రభుత్వంలో ఆమె పదవీ ఘోష అరణ్య రోధనగానే మిగిలింది. దీంతో శంకరమ్మ పలుసార్లు బాహటంగానే కేసీఆర్ తీరుపై తన అసంతృప్తిని వెళ్లగక్కింది.
2024 మే 9న పార్లమెంటు ఎన్నికల సమయంలో శంకరమ్మ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చొరవతో గాంధీభవన్ కి వెళ్లి అప్పటి పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జీ దీపా దాస్‌మున్షీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఉద్యమకారులకు తగిన గుర్తింపునిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు శంకరమ్మకు మహిళా కమిషన్ సభ్యురాలి పదవిని కట్టబెట్టడం విశేషం.
ఈ సందర్బంగా కాసోజు శంకరమ్మ మాట్లాడుతూ తనను మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమించిన ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నా కొడుకు శ్రీకాంత్ చారి తెలంగాణ కోసం బలిదానమై 16ఏళ్లయ్యిందని..శ్రీకాంత్ చారి తల్లిగా కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి నాకు పదవి ఇవ్వడంతో అమరవీరుడి కుటుంబానికి న్యాయం జరిగిందని, గౌరవం దక్కిందని ప్రజలు భావిస్తున్నారన్నారు. మహిళా కమిషన్ సభ్యురాలిగా నిజాయితీగా నా సేవలు అందిస్తానన్నారు.
ఇవి కూడా చదవండి :
నీట్ పరీక్ష రద్దు.. కేంద్రం సంచలన నిర్ణయం
VeeraBhadrudu | ‘వీరభద్రుడు’ ట్రైలర్‌తో ఆకాశాన్నంటుతున్న అంచనాలు.. సూర్య మాస్ అవతార్‌కు ఫ్యాన్స్ ఫిదా!
