Nagar Kurnool | మహిళా జర్నలిస్టులపై దాడి ఘటనపై నివేదిక ఇవ్వండి
కొండారెడ్డిపల్లెలో మహిళా జర్నలిస్టులపై జరిగిన దాడిపై ఎట్టకేలకు మహిళా కమిషన్ స్పందించింది. ఈ సంఘటనపై వీలైనంత త్వరగా దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని నాగర్‌కర్నూల్ ఎస్పీకి మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద లేఖ రాశారు

నాగర్ కర్నూల్ ఎస్పీకి మహిళా కమిషన్ చైర్మన్ లేఖ
Nagar Kurnool | కొండారెడ్డిపల్లెలో మహిళా జర్నలిస్టులపై జరిగిన దాడిపై ఎట్టకేలకు మహిళా కమిషన్ స్పందించింది. ఈ సంఘటనపై వీలైనంత త్వరగా దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని నాగర్‌కర్నూల్ ఎస్పీకి మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద లేఖ రాశారు. నిందితులపై తీసుకున్న చర్యలను పేర్కొంటూ నివేదిక ఇవ్వాలని సూచించారు. కాగా కాంగ్రెస్ కార్యకర్తల దాడికి గురైన మహిళా జర్నలిస్టులు సరిత, విజయారెడ్డి శుక్రవారం మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారదను కలిశారు. తమపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు.
డీజీపీని కలిసిన మహిళా జర్నలిస్టులు
కొండారెడ్డిపల్లిలో కాంగ్రెస్ కార్యకర్తల దాడికి గురైన మహిళా జర్నలిస్టులు శుక్రవారం డీజీపీ జితేందర్‌ను డీజీపీ కార్యాలయంలో కలిశారు. రుణమాఫీ కవరేజ్ కోసం వెళ్లిన తమపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. దోషులను గుర్తించి చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందేశారు. దాడి జరిగిన తీరును వారు డీజీపీకి వివరించారు. తమ ఫోన్లు, మెమొరీ కార్డులు లాక్కున్నారని, పోలీస్ స్టేషన్‌లో తమపై దాడి చేశారని, పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని ఫిర్యాదు చేశారు