విధాత, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు మంగళవారం ఆసక్తికరంగా సాగుతున్నాయి. బీజేపీ ఎమ్మెల్యేలు రైతు సమస్యలపై సేకరించిన లక్ష దరఖాస్తులతో గన్ పార్కు వద్ద నిరసన తెలిపి..వాటిని తోపుడు బండిపై పెట్టుకుని అసెంబ్లీకి వెళ్లారు. అయితే పోలీసులు ఆ బండిని అసెంబ్లీ ప్రాంగణం బయటే ఆపివేయడంతో రైతు సంతకాలతో కూడిన దరఖాస్తు కట్టలను నెత్తిన పెట్టుకుని బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రాంగణంలోకి వెళ్లారు.
కాంగ్రెస్ హామీ ఇచ్చిన రూ.2లక్షల రుణమాఫీ పూర్తిగా అమలు చేయాలని, రైతు భరోసా బకాయిలు చెల్లించాలని, కేంద్ర పథకం పసల్ బీమా అమలు చేయాలని కోరుతూ బీజేపీ ఎమ్మెల్యేలు లక్ష దరఖాస్తులు సేకరించారు. అటు రైతు సమస్యలపై కిసాన్ మోర్చా అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించగా..పోలీసులు అడ్డుకున్నారు.
అనంతరం అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ ఎమ్మెల్యేలు రైతు సమస్యలపైన, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపై వాయిదా తీర్మానాలు ఇవ్వగా..స్పీకర్ గడ్డం ప్రసాద్ తిరస్కరించారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ చేపట్టారు.
