ఈ నెల 30 నుంచి అసెంబ్లీ సమావేశాలు..కేసీఆర్ వస్తారా?
ఈ నెల 30 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోందని సమాచారం,ఈ సమావేశాలకు ప్రతిపక్ష నాయకుడు, బీఆరెస్ నేత కేసీఆర్ హాజరవుతారా? లేదా? అన్న ఆసక్తి సర్వత్రా నెలకొన్నది

- అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వస్తారా?
- వాడి వేడి సమావేశాలు సాగే చాన్స్
- కాళేశ్వరం సహా కీలకాంశాలపై చర్చ
- డిప్యూటీ స్పీకర్ ఎన్నికపైనా స్పష్టత
- ఇప్పటి వరకూ రెండుసార్లే అసెంబ్లీకి వచ్చిన ప్రతిపక్ష నేత కేసీఆర్
- సభలో కూర్చొన్నది కొద్దిసేపే ఈసారైనా సమావేశాలకు వస్తారా?
హైదరాబాద్, ఆగస్ట్ 26 (విధాత) : ఈ నెల 30 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోందని సమాచారం. ఈ నెల 29న నిర్వహించే మంత్రివర్గ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ సమావేశాల్లోనే కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ రిపోర్టు, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక తదితర అంశాలు ఉంటాయని తెలుస్తున్నది. మొత్తంగా వాడివేడిగా సాగే ఈ సమావేశాలు చాలా కీలకమైనవనే అభిప్రాయం ఉంది. మరి ఈ సమావేశాలకు ప్రతిపక్ష నాయకుడు, బీఆరెస్ నేత కేసీఆర్ హాజరవుతారా? లేదా? అన్న ఆసక్తి సర్వత్రా నెలకొన్నది.
ప్రతి ఆరు నెలలకు ఒకసారి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి. ఆ మేరకు ఈ ఏడాది సెప్టెంబర్ 20 లోపుగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాల్సి ఉన్నది. అయితే.. ఆగస్టు నెలాఖరులోనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో వాడివేడిగా చర్చలు జరిగే అవకాశం ఉంది. కాళేశ్వరం రిపోర్టుపై అధికార, ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధానికి దారితీసే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నది. కాళేశ్వరం రిపోర్టుపై అసెంబ్లీలో చర్చిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఈ చర్చలో ఈ అంశంపై తమ వాదనలను రెండు పక్షాలు సమర్ధవంతంగా వినిపించుకునే అవకాశం ఉంది. అయితే ఈ సమావేశాలకు కేసీఆర్ హాజరౌతారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. కాళేశ్వరంపై చర్చ ఉండే నేపథ్యంలో కేసీఆర్ సభకు హాజరైతేనే సమావేశాలకు అర్థం ఉంటుందని రాజకీయవర్గాలు అంటున్నాయి. అయితే.. గతంలో బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ అసెంబ్లీకి రావాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పేశారు. రేవంత్ రెడ్డికి తాము చాలని సెటైర్‌లు వేశారు. బీఆరెస్ నాయకులు సైతం కేసీఆర్ రాకపోయినా అసెంబ్లీ సమర్థవంతంగా వాదనలు వినిపించే నాయకత్వం తమకు ఉందని చెబుతున్నారు. కేసీఆరే డైరెక్షన్‌లోనే ప్రాజెక్టు నిర్మించారని పీసీఘోష్ కమిషన్ రిపోర్టు ఇచ్చింది. ఒకవేళ కేసీఆర్ అసెంబ్లీకి హాజరైతే ఈ రిపోర్టుపై తన వాదనను వినిపించేందుకు అవకాశం ఉంటుందని అంటున్నారు. కేసీఆర్ హాజరుపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని బీఆరెస్ వర్గాలు చెబుతున్నాయి.
ఎన్ని రోజులు అసెంబ్లీకి దూరంగా ఉండవచ్చు?
తొమ్మిదిన్నర ఏళ్లు తెలంగాణకు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2023 నవంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడి పోయింది. ఆ సమయంలో కనీసం గవర్నర్‌ను కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించేందుకు కూడా కేసీఆర్ ఇష్టపడలేదు. కనీసం తనను రెండుదఫాలు గెలిపించి తొమ్మదిన్నరేళ్లు అధికారంలో ఉండేందుకు సహకరించిన ప్రజలకు కృతజ్ఞతగా నాలుగు మాటు చెప్పిందీ లేదు. విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. అధికారానికి దూరమైన తర్వాత తెలంగాణ అసెంబ్లీకి రెండుసార్లు మాత్రమే కేసీఆర్ హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాలు జరిగే సమయంలో ప్రతిపక్ష నాయకుడిని అసెంబ్లీకి రావాలని అధికార పక్షం కోరుతోంది. ఇదే విషయమై బీఆర్ఎస్ పై హస్తం పార్టీ సెటైర్లు వేస్తోంది. ప్రతిపక్ష హోదాలో కేసీఆర్‌కు రూ.57 లక్షలకు పైగా జీతభత్యాలు అందించామని సీఎం రేవంత్ రెడ్డి గతంలో ప్రకటించారు. అసెంబ్లీకి హాజరు కాకుండా ప్రజా ప్రతినిధిగా దక్కే ప్రయోజనాలు పొందవచ్చా? అని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది.
అయితే.. ఆరోగ్య కారణాలు లేదా ఇతరత్రా కారణాలను చూపి ప్రజా ప్రతినిధులు సెలవు తీసుకోవచ్చు. ఆ కారణం తగినదై ఉంది. వాటిని వివరిస్తూ స్పీకర్ లేదా అసెంబ్లీ సెక్రటరీకి లేఖ అందించాలి. దీన్ని అసెంబ్లీలో ప్రవేశ పెట్టి లీడర్ ఆఫ్ ది హౌస్ అనుమతి తీసుకోవాలి. అసెంబ్లీ స్పీకర్ అనుమతి లేకుండా 60 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాని ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేయొచ్చు. రాజ్యాంగంలోని 190(4) లో ఈ విషయాన్ని వివరించారని అసెంబ్లీ అధికారులు చెబుతున్నారు. 60 రోజులను లెక్కించే విషయంలో తిరకాసు ఉంది. దీనిపై కొన్ని అంశాలను ప్రస్తావించారు. వరుసగా సభ నాలుగు రోజులకు మించి వాయిదా పడిన కాలాన్ని, ప్రోరోగ్ అయిన కాలాన్ని పరిగణనలోకి తీసుకోకూడదని నిబంధనలు చెబుతున్నాయి. గతంలో అసెంబ్లీ సమావేశాలు వంద రోజులకుపైగా జరిగేవి. కానీ, ఇప్పుడా పరిస్థితి లేదు. ఐదేళ్లలో కనీసం 150 రోజులు కూడా అసెంబ్లీ సమావేశాలు జరగని సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. అసెంబ్లీ సమావేశాలు ఎక్కువ రోజులు నిర్వహించాలని ప్రతిపక్షాలు గొడవ చేసేవి.
గతంలో ఏం జరిగింది?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1989లో టీడీపీ అధికారం కోల్పోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అప్పట్లో టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న ఎన్టీఆర్ అసెంబ్లీకి హాజరు కాలేదు. ఆయన అసెంబ్లీకి హాజరు కాకపోయినా ఇతర టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరయ్యారు. 2012 అక్టోబర్ 02న అనంతపురం జిల్లాలో వస్తున్నా మీ కోసం పాదయాత్రను చంద్రబాబు ప్రారంభించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో ఆయన పాదయాత్ర చేశారు. ఈ సమయంలో ఆయన అసెంబ్లీకి హాజరు కాలేదు. కానీ, టీడీపీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. 2014లో తెలంగాణ ఏర్పడింది. విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్‌సీపీ చీఫ్ వైఎస్ జగన్ 2017 నవంబర్ 6న ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించారు. 341 రోజులు 2019 జనవరి 09 న పాదయాత్రను ముగించారు. అప్పట్లో జగన్ సహా వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేదు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు నిరసనగా గైర్హాజరుతో నిరసన తెలిపారు. 2021 నవంబర్ 19న అసెంబ్లీలో తన భార్య భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఇది కౌరవసభ అంటూ… మళ్లీ సీఎంగానే అసెంబ్లీకి వస్తానని అప్పట్లో చంద్రబాబు ప్రకటించి అసెంబ్లీ నుంచి బయటకు వచ్చారు. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ సమావేశాలకు టీడీపీ సభ్యులు హాజరయ్యారు. కానీ, చంద్రబాబు మాత్రం అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాలేదు. ఇప్పుడు ఏపీలోనూ జగన్ అసెంబ్లీ సమావేశాలకు రావడం లేదు. ఏపీలో వైసీపీకి కనీసం ప్రతిపక్ష పార్టీ హోదా కూడా దక్కలేదు. కానీ.. తమ నేతకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని వైసీపీ నేతలు పట్టుబడుతున్నారు. ఇదే అంశంపై జగన్ సభకు రావడం లేదనే చర్చలు ఉన్నాయి.